ఏఐ దెబ్బకు రూ.1.7 లక్షల కోట్ల ఐటీ వ్యాపారం పోయేనా?

IT business worth Rs 1.7 lakh crore be lost due to AI?
గూగుల్, మెటా ఔట్‌సోర్సింగ్ తగ్గిస్తే భారత ఐటీపై ప్రభావం.. హైటెక్ రంగమే ముందుగా దెబ్బతినే అవకాశం
బెంగళూరు:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ భారత ఐటీ పరిశ్రమకు కొత్త సవాలు ఎదురవుతోంది. గూగుల్, మెటా వంటి బిగ్‌టెక్ సంస్థలు ఐటీ ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులను తగ్గిస్తున్నాయి. ఈ ధోరణి మరిన్ని రంగాలకు విస్తరిస్తే భారత ఐటీ సంస్థలు ఏటా 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్లు) వరకు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రస్తుతం భారత ఐటీ సేవల ఆదాయం సుమారు 149 బిలియన్ డాలర్లు. ఇందులో 80–100 బిలియన్ డాలర్లు ఔట్‌సోర్సింగ్ ద్వారా వస్తున్నాయి. మొత్తం దేశీయ ఐటీ పరిశ్రమ పరిమాణం సుమారు 315 బిలియన్ డాలర్లుగా ఉంది.
హైటెక్ రంగమే ముందుగా...ఏఐ సామర్థ్యాలను వేగంగా పెంచుకున్న బిగ్‌టెక్ సంస్థలు ఇప్పటికే కొన్ని కాంట్రాక్టు పనులను తగ్గిస్తున్నాయి. సాధారణ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, టెస్టింగ్, సపోర్ట్ వంటి పనుల్లో ఏఐ వినియోగం పెరగడంతో బయటి సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతోంది. అందుకే భారత ఐటీ పరిశ్రమలో హైటెక్ విభాగమే మొదట ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత బ్యాంకింగ్, రిటైల్, తయారీ, ఆరోగ్య రంగాలకు కూడా ఈ ధోరణి విస్తరించవచ్చని అంచనా.
15–20 శాతం పని తగ్గితే?..ఒక సంస్థ తన ఔట్‌సోర్సింగ్ పనిలో 15–20 శాతం వరకు ఏఐతో చేయగలిగితే, అదే మేరకు బయట సంస్థలకు ఇచ్చే పనిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది భారత ఐటీ కంపెనీల ఆదాయం పైనే కాకుండా కొత్త నియామకాలు, ఉద్యోగాల వృద్ధి, ప్రాజెక్టుల సంఖ్య పైనా ప్రభావం చూపవచ్చు. కాకపోతే.. ఏఐ రంగంలో భారత కంపెనీలు బలం పుంజుకుంటే ఈ సంక్షోభమే సరికొత్త అవకాశంగా మారుతుంది.
-
Home
-
Menu
