డిజిటల్ చీకట్లలో చిన్నారులకు ఆశాదీపం

డిజిటల్ చీకట్లలో   చిన్నారులకు ఆశాదీపం
X

A beacon of hope for children

amidst digital darkness

డిజిటల్ విప్లవంలో భాగమైన సోషల్ మీడియా మానవ సంబంధాలను, సమాచార మార్పిడిని వేగవంతం చేసినప్పటికీ, దాని వెనుక దాగి ఉన్న చేదు నిజం నేడు యావత్ సమాజాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా నిరపరాధులైన చిన్నారులపై జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, వారి అశ్లీల దృశ్యాల ప్రసారం నైతిక సరిహద్దులన్నింటినీ తుడిచిపెట్టేస్తున్న దారుణమైన నేరం. ఈ నేపథ్యంలోనే చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని ఇకపై నేరుగా భారతీయ దర్యాప్తు సంస్థలకే అందజేస్తామని సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ తాజాగా అంగీకరించడం ఆహ్వానించదగిన పరిణామం.

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, చట్టపరమైన బాధ్యతను గుర్తుచేసిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకు ఇలాంటి దురాగతాలకు సంబంధించిన సమాచారం అమెరికాకు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్’ (ఎన్‌సిఎంఇసి) ద్వారా చుట్టూ తిరిగి భారతీయ ఏజెన్సీలకు చేరేది. ఆ సుదీర్ఘమైన ప్రక్రియలో ఎంతో కీలకమైన సమయం వృథా కావడంతోపాటు బాధితులకు తక్షణ న్యాయం అందించడం లేదా నేరస్థులను సకాలంలో పట్టుకోవడం కష్టంగా మారేది. ఆ మధ్యవర్తిత్వపు అడ్డంకులను తొలగించి, మెటా నేరుగా భారత దర్యాప్తు సంస్థలకే నివేదించడానికి ముందుకు రావడం అనేది సైబర్ భద్రతా వ్యవస్థలో ఒక రకమైన పురోగతి అని చెప్పవచ్చు.

అయితే, ఈ అంగీకారం మాత్రమే డిజిటల్ ప్రపంచంలో మురిసిపోతున్న మన పిల్లలను సంపూర్ణంగా కాపాడేస్తుందని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇస్తామని చెప్పడం మొదటి అడుగు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సైతం స్పష్టం చేయడం వెనుక ఉన్న తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఇంటర్నెట్ చౌకగా మారడం, ప్రతి ఇంటా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడంతో డిజిటల్ పరిజ్ఞానం లేని చిన్న పిల్లలు కూడా సులభంగానే ఈ డిజిటల్ ప్రపంచంలో చిక్కుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని వికృత మనస్తత్వం కలిగిన నేరగాళ్లు, గ్యాంగ్‌లు పిన్న వయస్కులను టార్గెట్ చేస్తున్నారు.

డీప్‌ఫేక్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాధనాలు విస్తృతమయ్యాక లైంగిక వేధింపుల స్వరూపం మరింత ప్రమాదకరంగా మారింది. నిజమైన చిత్రాలను వికృతంగా మార్చడం నుంచి, నకిలీ ప్రొఫైళ్లతో పిల్లలను బురిడీ కొట్టించే వరకు సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మెటా వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు కేవలం చట్టపరమైన నోటీసులు వచ్చినప్పుడో, లేదా ప్రభుత్వాల ఒత్తిడి పెరిగినప్పుడో మాత్రమే స్పందించడం కాకుండా, స్వచ్ఛందంగా తమ అల్గారిథమ్‌లను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

సామాజిక మాధ్యమాల వ్యాపార నమూనా ప్రధానంగా లాభాపేక్షతో, కంటెంట్ వీక్షణల (వ్యూస్) ఆధారంగా నడుస్తుంది. నేరపూరిత లేదా వికృత కంటెంట్ వ్యాప్తి చెందకుండా ఆపే ప్రక్రియలో ఈ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతారహిత వైఖరి గతంలో అనేకసార్లు బహిర్గతమైంది. ప్లాట్‌ఫామ్‌లలోని అల్గారిథమ్‌లు వినియోగదారులను నిమిషాల తరబడి తమ వైపు తిప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాయి తప్ప, పిల్లల భద్రతకు సంబంధించి పటిష్టమైన ఫిల్టర్లను స్వతంత్రంగా నిర్మించడంలో తరచుగా విఫలమవుతున్నాయి. ఒకపక్క లాభాలను కోట్లలో కొల్లగొడుతూ, మరోపక్క సామాజిక బాధ్యతను విస్మరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనే సంకేతాన్ని భారత ప్రభుత్వం స్పష్టంగా పంపడం అభినందనీయం. భారతీయ చట్టాలకు లోబడి నడుచుకోవడం, ఇక్కడి కంటెంట్ నియంత్రణ వ్యవస్థలను పారదర్శకంగా ఉంచడం వంటి విషయాల్లో గ్లోబల్ టెక్ సంస్థలు కఠినమైన నిబంధనలను ఎదుర్కోవాల్సిందే. లీగల్ నోటీసులకు స్పందిస్తూ మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఒక హెచ్చరికలా పనిచేయాలి.

కానీ కేవలం సమాచార మార్పిడితోనే నేరాలు ఆగిపోవు. మెటా సమాచారం ఇచ్చినా, దాన్ని స్వీకరించి అంతే వేగంగా చర్యలు తీసుకోగల సాంకేతిక, చట్టపరమైన సన్నద్ధత మన దర్యాప్తు సంస్థలకు ఉందా అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. మన సైబర్ క్రైమ్ విభాగాలకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ, మౌలిక వసతులు, తగినంత సిబ్బందిని కేటాయించకపోతే, లభించిన సమాచారం మూలనపడే ప్రమాదం ఉంది. నేరం జరిగిన వెంటనే బాధితుడికి రక్షణ కల్పించడం, నేరస్థుడిని చట్టం ముందు నిలబెట్టడం, ఆ నివేదిత దృశ్యాలను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టడం అత్యంత త్వరితగతిన జరగాలి. దీనితోపాటు, డిజిటల్ సమాజంలో తల్లిదండ్రులు, పాఠశాలల పాత్ర కూడా ఏమాత్రం తక్కువ కాదు.

పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశంపై నిరంతర పర్యవేక్షణ, అవగాహన ఉండాలి. విద్యాసంస్థల్లో సైబర్ సురక్షిత ప్రవర్తనపై బాలబాలికలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి. సైబర్ భద్రత అనేది కేవలం ప్రభుత్వం లేదా టెక్ కంపెనీల బాధ్యత మాత్రమే కాదు, ఇది సామాజిక విధి. మెటా అంగీకారం అనేది ఆన్‌లైన్ నేరాలపై జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఒక ఆశాకిరణం మాత్రమే. భవిష్యత్తులో మన పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలంటే చట్టాల కఠిన అమలు, టెక్నాలజీ నియంత్రణ, సామాజిక చైతన్యం త్రికరణ శుద్ధిగా ముందుకు సాగాల్సి ఉంది.

జి శ్రీలత

Tags

Next Story