రణజ్వాలల్లో ‘శాంతి’ మంత్రం

రణజ్వాలల్లో ‘శాంతి’ మంత్రం
X

చైనా లోని షెన్‌జెన్ నగరంలో నిర్వహించిన ఆసియాపసిఫిక్ ఆర్థిక సహకార (ఎపిఇసి) శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా త్రైపాక్షిక సమావేశం జరగడం ప్రపంచ దేశాల్లో ఉత్కంఠను కలిగించింది. సుమారు 80 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో మూడు అగ్రరాజ్యాలు ‘శాంతిదిశగా’ పేరుతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించడం చెప్పుకోతగిన పరిణామం. ఒకవైపు ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఉక్రెయిన్ష్య్రా రణజ్వాలలు ఆగక పోయినప్పటికీ అగ్రరాజ్యాలు శాంతి మంత్రాన్ని జపించాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించటంలో మూడు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నప్పటికీ, త్రైపాక్షిక భేటీలో ఇది ప్రధాన ఎజెండా కాలేదని క్రెమ్లిన్ వర్గాలు తెలియజేయడం గమనార్హం. అయితే అంతకు ముందు ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన 40 నిమిషాల ద్వైపాక్షిక భేటీలో ఉక్రెయిన్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడంపై కూడా చర్చించారు. అమెరికా, రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ ఒప్పందం (న్యూస్టార్ట్ ) ముగిసిన నేపథ్యంలో చైనాను కూడా కలుపుకొని కొత్త అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం చేయాలని ట్రంప్ భావించారు. అయితే అమెరికా, రష్యాల కంటే తమ వద్ద అణ్వాయుధ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని చైనా పేర్కొనడంతో, కేవలం ‘చర్చలు కొనసాగించాలనే’ మాటతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే అణువ్యాప్తిని అరికట్టడానికి, అణ్వాయుధాల ముప్పులను తగ్గించడానికి చర్చలు కొనసాగించాలని ముగ్గురు నేతలు పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన భద్రతను కాపాడడానికి, మూడు దేశాల మధ్య స్థిరమైన ఇంధన సరఫరా ఉండేలా చూడడానికి, చమురు ఉత్పత్తిని పెంచడానికి అంగీకరించారు. ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకు రావాలని ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై విమర్శలు గుప్పిస్తూ ఈ కోర్టు విచారణల నుండి దేశాధినేతలకు రక్షణ ఉండాలని, అది తన పరిధిని అతిక్రమించకూడదని మూడు దేశాలూ హెచ్చరించాయి. పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారంట్ ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సదస్సువల్ల మూడు దేశాల వ్యూహాత్మక లాభాలు లభించాయి. ఈ చారిత్రక భేటీకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చైనా తన అంతర్జాతీయ దౌత్యపలుకుబడిని ప్రపంచ శాంతి స్థాపనలో తన కీలక పాత్రను ప్రపంచానికి చాటుకునే అవకాశం లభించింది.

ఈ క్రెడిట్ అంతా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కే దక్కుతుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ఒంటరితనం మధ్య అమెరికా అధ్యక్షుడితో సమాన స్థాయిలో కూర్చోవడం పుతిన్‌కు పెద్ద దౌత్య విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా డిసెంబర్‌లో అమెరికాలో జరగనున్న జి20 సదస్సుకు ట్రంప్ నుంచి ఆహ్వానం కూడా లభించింది. ఇక ట్రంప్ విషయానికి వస్తే అమెరికా రాజకీయాల్లో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్న కొద్ది రోజులకే చైనా సదస్సుకు ట్రంప్ హాజరవ్వడం అంతర్జాతీయ స్థాయిలో తన నాయకత్వ సామర్థాన్ని నిరూపించుకోవడానికే. అమెరికా ప్రపంచ ఆధిపత్యం తగ్గలేదని కూడా నిరూపించుకోవాలన్నదే తన లక్షం. అంతర్జాతీయ భద్రతా సమస్యల పరిష్కారంలో తన కీలక పాత్రను కొనసాగించాలని భావిస్తున్నారు. అంతేకాక చైనా, రష్యాలతో ప్రత్యేక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. గత అధ్యక్షులకు భిన్నంగా ప్రత్యర్థులతో నేరుగా చర్చలు జరపడం ద్వారా ‘చరిత్ర సృష్టిస్తున్నామని’ ట్రంప్ తన విదేశాంగ విధానాన్ని బలంగా ప్రదర్శించుకున్నారు. ప్రపంచ రాజకీయాలపై ఈ భేటీ ప్రభావం ఎలా ఉంటుందని పరిశీలిస్తే 1945లో రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ కలిసి ప్రపంచ సరిహద్దులను నిర్ణయించిన ‘యాల్టా సదస్సు’ తో ఈ షెన్‌జెన్ భేటీని పోలుస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ఆధ్వర్యంలో పాశ్చాత్య దేశాల భద్రతా వ్యవస్థ ఏర్పడింది. అమెరికా, యూరప్ మధ్య భద్రతా బాధ్యతల విషయంలో విభేదాలు ఉన్నాయి. రష్యాఉక్రెయిన్ యుద్ధం నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)పై ఒత్తిడి పెంచుతోంది. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు యూరప్ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఈ మూడు అగ్రరాజ్యాల (జి3) చేతుల్లోకి వెళుతోందా అనే చర్చ మొదలైంది. తమ ప్రమేయం లేకుండానే ఉక్రెయిన్, యూరప్ భద్రతపై ఈ మూడు దేశాలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయేమోనని యూరప్ దేశాలు, అమెరికా మిత్ర పక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు నాటో వంటి పాత కూటముల్లో అంతర్గత విభేదాలు పెరుగుతుండగా, మరోవైపు అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య కొత్త దౌత్యవేదిక ఏర్పడుతోంది. ఇది అంతర్జాతీయ వ్యవస్థలో మార్పులకు సంకేతం. గతంలో ప్రపంచ వ్యవస్థ ప్రధానంగా అమెరికా నాయకత్వంపై ఆధారపడేది. కానీ ఇప్పుడు చైనా ఆర్థిక, సాంకేతిక, సైనిక శక్తిగా ఎదగడం, రష్యా తన వ్యూహాత్మక ప్రభావాన్ని కొనసాగించడం, పాశ్చాత్య కూటముల్లో విభేదాలు ఇవన్నీ కొత్త శక్తి సమీకరణలకు దారి తీస్తున్నాయి. ప్రపంచ శాంతి అనేది అగ్రరాజ్యాల మధ్య కుదిరే ఒప్పందాల మీద మాత్రమే ఆధారపడదు. ఈ ‘మూడు కాళ్ల పీఠం’ ప్రపంచాన్ని స్థిరంగా నిలబెడుతుందా? లేక వాటి మధ్య పోటీ ప్రపంచాన్ని మరింత అస్థిర పరుస్తుందా? అనేది రాబోయే కాలంలో తేలుతుంది.

Tags

Next Story