యుపిలో కమలం కళ తగ్గుతోందా?

యుపిలో కమలం కళ తగ్గుతోందా?
X

ఉత్తరప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో బిజెపి పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. 2027 ప్రారంభంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అయోధ్యలో భారీ విరాళాల కుంభకోణం బయటపడి సంచలనం కలిగించిన నేపథ్యంలో తొలిసారిగా ఈ ఎన్నికలు జరగనుండటం గమనార్హం. ఈ విరాళాల కుంభకోణం భక్తుల మనోభావాలను బాగా దెబ్బతీసింది. ఈ కుంభకోణాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడం, విద్యార్థుల ఆందోళనలు ఇవన్నీ బిజెపికి ఆందోళన కలిగిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఊహించని విధంగా భారీ ఎదురు దెబ్బతగిలింది. యుపిలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఇదివరకు 62 స్థానాలను గెలుచుకున్న బిజెపి గత ఎన్నికల్లో కేవలం 33స్థానాలకే పరిమితమైంది. అదే సమయంలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 37స్థానాలను గెలుచుకోవడం విశేషం.

ఈ ఫలితాలకు కారణాలు ఏమైనా కావచ్చు. అయితే ప్రస్తుతం యుపిలో బిజెపిలో సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు పార్టీలో అందరి మద్దతు లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన తన ప్రభుత్వంలో ఠాకూర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై కొందరు నాయకులు అసంతృప్తిగా ఉంటున్నారని తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పంకజ్ చౌదరి కూడా యోగి ఆదిత్యనాథ్‌కు అంత అనుకూలంగా ఉండడం లేదని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలపట్ల యోగి ఆదిత్యనాథ్ ఆందోళన చెందుతున్నట్టు కనిపించడం లేదు. తనకు బాగా తెలిసిన రాజకీయ వ్యూహం ‘మతపరమైన ధ్రువీకరణ’. దీని ద్వారానే మళ్లీ రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ముఖ్యంగా “8020 ఫార్ములా’ అనుసరిస్తుంటారు. అంటే ఉత్తరప్రదేశ్‌లో సుమారు 80% హిందువులు, 20% ముస్లిములు ఉన్నారనే జనాభా నిష్పత్తిని రాజకీయంగా ఉపయోగించుకుని మతపరమైన విభజనను ప్రోత్సహించడమే ఆయన వ్యూహం. ప్రత్యర్థి రాజకీయ పక్షాలు విజయ పథంలో ముందున్నాయని భావిస్తున్నప్పటికీ మతపరమైన భావోద్వేగాలను ఎన్నికల రాజకీయాల్లో ఉపయోగించడంలో బిజెపికి ఉన్న సామర్థం ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. బిజెపి హిందుత్వ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకమైన రాష్ట్రం. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ మొదటి నుంచీ ఉత్తరప్రదేశ్‌ను తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాలేదన్న సంగతి మర్చిపోకూడదు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటికీ, తన పార్టీకి పూర్తి మెజారిటీ సాధ్యం కాలేదు. అయోధ్యలో కూడా ఓటమి ఎదురుకావడం బిజెపికి తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయం తనదే అని నమ్మినా చివరిక్షణంలో చేజారిపోయింది. సంస్థాపరంగా బిజెపిలో అంతా సవ్యంగా లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కొందరు కేంద్ర స్థాయి నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, ఇటీవల ప్రాంతీయ నాయకులనుంచి అభిప్రాయాలు సేకరించడానికి సమావేశాలు నిర్వహించారు. పార్టీ నాయకత్వం లోని ఒక వర్గం తమను నిర్లక్షం చేస్తోందని, కొందరు నాయకులు ఈ సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022, 2017 ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితుల మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో సామాజికంగా బ్రాహ్మణులు, ఠాకూర్ల మధ్య ఆధిపత్య పోటీ ఉంటోంది. యోగి ఆదిత్యనాథ్ తన సామాజిక వర్గమైన ఠాకూర్ల ప్రభావాన్ని అన్ని ప్రాంతాల్లో విస్తరించడం బ్రాహ్మణుల్లో అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. చాలా కాలంగా బిజెపితో బ్రాహ్మణులు అంటకాగడం వల్ల ఇతర రాజకీయ పార్టీలకు వారు దూరం కావలసి వచ్చింది. 1980 చివరలో రామజన్మభూమి ఉద్యమం ప్రారంభమైన తరువాత బ్రాహ్మణ సమాజం పూర్తిగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బిజెపికే పట్టంగట్టడం ప్రారంభించింది.

దీనివల్ల దేశంలోనే అత్యంత కీలకమైన యుపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడింది. బిజెపిపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, బిజెపికి బదులుగా మద్దతు ఇవ్వడానికి మరో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలేక వారు బిజెపితోనే మనుగడ సాగించవలసి వస్తోంది. గతంలో యుపిలో యాదవుల ఆధిపత్యంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ప్రస్తుతం ఠాకూర్ల ఆధిపత్యంపై కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఏం జరిగినా అది జాతీయ స్థాయిలో పార్టీపై లేదా మోడీ ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని బిజెపిలోని ఒకవర్గం అభిప్రాయపడుతోంది. యోగి ఆదిత్యనాథ్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలినా, అది ప్రధాని మోడీకి ఎదురు దెబ్బగా పరిగణించవలసిన అవసరం లేదని వాదిస్తున్నారు.

రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రం నుంచి ఆ రాష్ట్రాల రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునే కళను మోడీ బాగా అలవర్చుకున్నారు. దీన్నే మోడీ శైలి లోని ‘సహకార సమాఖ్యవాదం’ అని అర్థం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో బిజెపి మరింత బలపడడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నమ్ముతోంది. ఇటీవల యుపి శాసనమండలి ఎన్నికల్లో బిజెపి వారణాసి ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాన్ని కోల్పోవడం బిజెపికి శృంగభంగమే. ఎందుకంటే వారణాసి ప్రధానమంత్రి మోడీ ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం కావడమే. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న ఐక్యత స్థాయి బట్టి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృఢంగా ఉంటే బిజెపికి గట్టి పోటీ ఇవ్వగలవు. కూటమి ఏర్పాటులో విభేదాలు భగ్గుమంటే బిజెపికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. గత ఎన్నికల్లో బిజెపి చాలా తక్కువ ఓట్ల తేడాతో అనేక స్థానాలను గెలుచుకోవడం ఈ సందర్బంగా ప్రస్తావించడం అవసరం.


కె.యాదగిరి రెడ్డి

9866789511

Tags

Next Story