బడ్జెట్ రూపకల్పనలో జెన్‌జెడ్

బడ్జెట్ రూపకల్పనలో జెన్‌జెడ్
X

నీతి ఆయోగ్ పరీక్షల్లో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన ఆందోళన ప్రభంజనంలా మారి చివరకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌నే గద్దెదించగలిగింది. అలాగే ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలపై కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని సాగిస్తోంది. ఈ ఆందోళనల ప్రకంపనల ప్రభావంతో ప్రభుత్వం యువతను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. 2024లో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల జ్వాలలకు షేక్‌హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. అదే విధంగా 2025లో నేపాల్‌లో యువత నాయకత్వంలో జెన్‌జీ విప్లవం హోరెత్తి ఆనాటి కేపీ శర్మ ఓలి ప్రభుత్వం గద్దె దిగవలసి వచ్చింది. ఈ అనుభవాలను గుణపాఠంగా నేర్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రానున్న కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మొట్టమొదటిసారిగా జెన్‌జెడ్‌కు భాగస్వామ్యం కల్పించడానికి సిద్ధమైంది. జెన్ జెడ్ అనేది సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరాన్ని సూచిస్తుంది. ఈ తరం డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వినూత్న పరిణామాలతో పెరిగింది. దేశానికి యువజనాభా గొప్ప ఆర్థిక వనరు. అటువంటి యువత కోసం ప్రత్యేకంగా సంప్రదింపుల విభాగాన్ని ఏర్పాటు చేయడం ఈసారి బడ్జెట్ ప్రక్రియలో కొత్త పరిణామం.

ఈ మేరకు బడ్జెట్ ముందస్తు సంప్రదింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 16న ఆర్థిక వేత్తలతో ప్రారంభించగా, నవంబర్ 26న యువత ప్రత్యేక సమావేశంతో ఇవి ముగియనున్నాయి. ఈ సంప్రదింపుల్లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులతోపాటు యువజన సంఘా లు, యువ నాయకులను భాగస్వాములుగా చేర్చారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, నైపుణ్యాల అభివృద్ధి, నాణ్యమైన ఉద్యోగ అవకాశాల సృష్టికి ప్రత్యేక కార్యాచరణ, యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, విద్యారంగంలో మార్పులు, తదితర అంశాలపై యువత అభిప్రాయాలను తెలుసుకుని, వారి సూచనల బట్టి బడ్జెట్‌ను రూపొందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆరాటం. నవంబర్ 26న జరగనున్న సమావేశంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) వంటి విద్యార్థి రాజకీయ సంఘాల ప్రతినిధులు, వృత్తి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం మరింత సాంకేతికంగా మారుతుంది.

అందువల్ల డిగ్రీతోపాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం తప్పనిసరి. దానివల్ల ఉపాధి లభించడమే కాక, ఆదాయం, వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. జాతీయ యువజన విధానం (నేషనల్ యూత్ పాలసీ) ప్రకారం భారత దేశ జనాభాలో 1529 సంవత్సరాల మధ్య వయస్సుగల యువత సుమారు 27 శాతంగా ఉన్నారు. అంటే దేశంలో దాదాపు 370 మిలియన్ల నుంచి 380 మిలియన్ల వరకు యువత ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ‘వికసిత్ భారత్ ’అనే దార్శనికతలో యువతను నాలుగు ప్రధాన వర్గాల్లో ఒకటిగా ప్రస్తావించారు. మిగిలిన మూడు వర్గాలు పేదలు, మహిళలు, రైతులు. ఈ ప్రాధాన్యత ఇంతవరకు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లలో కూడా ప్రతిబింబించింది. ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తూ ఈ రంగాలకు కేటాయింపులను పెంచడంతోపాటు యువత కోసం అనేక కొత్త పథకాలను ప్రకటిస్తోంది. యువత అభివృద్ధి అనేది కేవలం వారి వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు, భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కూడా కీలకమైన అంశం.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పనకు అనుసంధానమైన ప్రోత్సాహకాలు, ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుమారు 4.1కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగించే లక్షంతో రూ. 2లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 2026 27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కూడా యువత అభివృద్ధికే అత్యంత ప్రాధాన్యం కల్పించారు. ఇందులో భాగంగా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఐదు జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను (నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ స్కిల్లింగ్) ఏర్పాటు చేయాలని, విద్యారంగంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రకటించారు.

గతంలో కూడా బడ్జెట్ రూపకల్పనలో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారు. 2026 జనవరిలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులతో ఆమె సమావేశమై నైపుణ్యాభివృద్ధి, హరిత ఇంధనం, గ్రామీణాభివృద్ధి, నూతన రంగాల ప్రాముఖ్యత గురించి విద్యార్థుల సూచనలను గ్రహించారు. ఒక నెల తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30మంది కళాశాల విద్యార్థులను ఎంపిక చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను వీక్షించడానికి ఆహ్వానించారు. అయితే నవంబర్ 26న జరగనున్న సమావేశం వెనుక విస్తృతమైన లక్షం ఇమిడి ఉంది. ఈ చర్చలను కేవలం కొన్ని విద్యాసంస్థలకే పరిమితం చేయకుండా, విభిన్న నేపథ్యాలకు చెందిన మరింత మంది ఇందులో భాగస్వాములను చేయాలనే ప్రయత్నం ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. సమావేశాల్లో సూచనలు స్వీకరించడం మాత్రమే సరిపోదు. ఏ సూచనలను ప్రభుత్వం అంగీకరించింది, వాటి అమలుకు ఎంత నిధులు కేటాయించింది అనే విషయాలు కూడా వెల్లడించడం ప్రభుత్వ బాధ్యత.

Tags

Next Story