కాప్-31.. విఫలమా? విజయమా?

కాప్-31.. విఫలమా? విజయమా?
X

‘కాప్’ ప్రాధాన్యత కలిగిన ప్రపంచ దౌత్య (చర్చలు, సంప్రదింపుల) వేదిక కావడం వల్లనే వాతావరణ ప్రేమికులు ఆశగా దాని వైపు చూస్తారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు ముసాయిదా ఒప్పందం (యుఎన్‌ఎఫ్‌సిసిసి) 1992లో ఇచ్చిన వేదిక ఇది. 1995నుంచి మొదలెట్టి, గత మూడు దశాబ్దాలుగా నిరవధిక కృషి చేస్తూనే ఉంది. వాతావరణ మార్పుల ఉపద్రవాన్ని తెచ్చిన భూతాపోన్నతికి మానవ ప్రమేయ కాలుష్యాలే కారణమని, అందుకు ప్రధానంగా శిలాజ ఇంధనాలు కాల్చడంవల్ల పెరుగుతున్న కర్బన ఉద్గారాలే మూలమని సందేహాలకు అతీతంగా ధ్రువపడింది. ఇక మిగిలింది వాతావరణ చర్యలు (క్లైమెట్ యాక్షన్) పకడ్బందీగా చేపట్టడమే! ఇప్పటివరకు జరిగిన ప్రకృతి విధ్వంసానికి కారకులు ఒకరైతే (అభివృద్ధి సమాజాలు), బాధితులు వేరొకరు (వర్ధమాన, అభివృద్ధి చెందని సమాజాలు) కావడంవల్ల సమస్య వచ్చింది.

నిజానికి సమస్య అందరిదీ. బాధ్యత కూడా అందరిదే! కానీ, అందులోనూ కొంత వ్యత్యాసం చూపాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తించారు. ‘ఉమ్మడి సమస్య, సమకర్తవ్యం, వైవిధ్య బాధ్యతలు’ సిబిడిఆర్ అనే పరిష్కారం తెరపైకి వచ్చింది. అంటే, ప్రకృతి వనరులను ఇన్నాళ్ల ఇష్టానుసారం వాడి అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు ఇప్పుడు పరిమితుల గురించి మాట్లాడటమేమిటి? బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధనాలైన సౌరశక్తి, పవన విద్యుత్తు వైపు మళ్లాలంటే.. ఇప్పుడిపుడే ప్రగతివైపు అడుగులు వేసే పేద దేశాలకు ఆర్థికంగా భారమవుతుంది అనే అంశం తెరపైకి వచ్చింది. సిబిడిఆర్ ప్రకారం సంపన్న దేశాలు, పేద, వెనుకబడిన దేశాలకు ఆర్థిక సహాయం అందించాలనే ప్రతిపాదన కోపన్‌హెగన్ (2009), పారిస్ (2015) లో జరిగిన ‘కాప్’: సదస్సుల్లో కొంత మార్గం దొరికింది. ‘క్లైమెట్ నిధి’ ఇవ్వడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. శిలాజ ఇంధనాలు వాడకాన్ని దశలవారీగా తగ్గించడానికి పారిస్‌లో ఒప్పందం కుదిరింది. కానీ, సదరు వినియోగ తగ్గింపు, క్లైమెట్ నిధుల విషయంలో వెనక్కి తగ్గడమే కాప్-31 వైఫల్యం.

వైరుధ్యాలదే పైచేయి

సాధారణంగా కాప్ సదస్సు చర్చలు, సంప్రదింపులు వివిధ దశల్లో సాగుతాయి. ఒక దశలో భిన్నాభిప్రాయాలున్నా తుది దశలో ఏకాభిప్రాయంతో ఒప్పందం కుదురుతుంది. ప్రధాన పత్రం ముసాయిదాలో పదాల కూర్పు గాని, వాక్య నిర్మాణంపైగాని అభ్యంతరాలుంటే ఆ మేరకు స్వల్పమార్పులు చేసి, సర్వసమ్మత ఏకాభిప్రాయంతోనే ‘ఒప్పందం’ ఖరారవుతుంది. కానీ, ఈసారి అది సాధ్యపడలేదు. ప్రధాన పత్రం (కవర్‌టెక్ట్) లో ‘శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం’ అనే మాటే లేకపోవడంపట్ల పనామా, నార్వే, ఐరోపా సంఘం తీవ్రంగా వ్యతిరేకించాయి. అది అలా ఉండాల్సిందే అని రష్యా, సౌదీ అరేబియాలు పట్టుబట్టాయి. ప్రతిష్టంభనకు ఇదే ప్రధాన కారణమయింది. ఇదే కారణంతో తుది ముసాయిదా ప్రతిని 130కి పైగా దేశాలు అంగీకరించలేదు. ఆ మాటల్ని తప్పించడమంటే, నిజానికి ఈ వైఖరి, 2015 పారిస్ ఒప్పందం, 2023 దుబాయ్ అంగీకారం నుంచి వైదొలగడం వంటిదే! ఇవి సక్రమంగా అమలు చేయాలంటే వాతావరణ మార్పులకు తట్టుకునే (అడాప్టేషన్) వ్యవస్థల ఏర్పాటుకు నిధులు అవసరం. 2020 నుంచి యేటా పదివేల కోట్ల డాలర్ల నిధులిస్తామని 2009 లో అంగీకరించి, 2015లో ధ్రువపరిచిన సంపన్న దేశాలు ఆ నిధుల్ని ఎవరు? ఎప్పుడు? ఏ రూపంలో ఇస్తారో స్పష్టత ఇవ్వకపోవడం కాప్31 మరో వైఫల్యం. ఫలితంగా ఏకాభిప్రాయ సాధనలో ఏర్పడ్డ ప్రతిష్టంభన ‘ఒప్పందం’ లేకుండా చేసింది.

విశ్వసనీయతపై నీలినీడలు

తాజా కాప్‌లో ప్రధానంగా మూడంశాల్లో ఇబ్బంది వచ్చింది. దశలవారీగా శిలాజ ఇంధనాలు వాడకాన్ని తగ్గించాలనే అంశమే ముసాయిదా ప్రతిలోంచి తప్పించడం ఒకటి. అడాప్టేషన్ లాస్ అండ్ డామేజెస్ తదితర క్లైమెట్ ఫైనాన్స్ విషయంలో స్పష్టతకు సంపన్న దేశాలు ముందుకు రాకపోవడం మరో కీలకాంశం. వెనకటి ఒక కథ, చేపా చేపా ఎందుకు ఎండలేదు అంటే... గడ్డిమోపు, ఆవు, కుర్రవాడు, చీమకుట్టడం... నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? కథను తలపిస్తాయి. తమ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి కొన్ని దేశాలు సిద్ధంగా లేకపోవడం, ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్న ప్రస్తుత ఆర్థిక మాంద్యం కాప్- 31 ఒప్పంద ప్రక్రియనే దిశ మార్చగలిగింది. శిలాజ ఇంధనాల్ని తవ్వి తీసి విక్రయిస్తున్న సౌదీ అరేబియా, రష్యా, కాప్ ఆతిథ్య దేశాలైన టర్కీ, ఆస్ట్రేలియా తోపాటు వాటిని విరివిగా కాలుస్తూ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న చైనా, భారత వంటి దేశాలు ఒక బాటపట్టాయి. శిలాజ ఇంధనాల వాడకం నిలుపుదల ప్రస్తావన లేకపోవడం వాటికి అంగీకారమైంది. అందుకే కవర్ ముసాయిదాకు మద్దతిచ్చాయి.

శిలాజ ఇంధనాల వాడకం దశలవారీగా తగ్గాలని వాదిస్తూ, ముసాయిదాకు నిరసన తెలిపిన ఐరోపా సంఘం (ఇయు) లోని పలు సంపన్న దేశాలు క్లైమెట్ ఫైనాన్స్ విషయంలో మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించాయి. సదరు నిధులు లేకుండా వారు కోరుతున్నట్టు ‘న్యాయ, సమ్మతమైన పరివర్తన’ (జస్ట్ ట్సాన్షేషన్) సాధ్యపడదు. ఏటా వంద బిలియన్ డాలర్ల నుంచి, యేటా 600 బిలియన్ డాలర్లు అని, చివరగా యేటా 1.4 ట్రిలియన్ డాలర్ల నిధికి పెంచుతున్నట్టు చెప్పినవన్నీ ఇప్పటికి ఒట్టి మాటలుగానే నిలిచాయి. నిధులు గ్రాంట్‌గా ఇస్తారా, సాంకేతికతను బదలాయిస్తారా? అధిక వడ్డీ రుణాలుగా ఇస్తారా? దేని వాటా ఎంత? స్పష్టత లేదు. ‘కాలుష్య కారకులే చెల్లించాల’నే సహజ, న్యాయ సూత్రాల అమలు గాలికిపోతోంది. వాతావరణ మార్పులకు ప్రధానంగా కారకులైన వారు హాయిగా ఉన్నారు. కర్బన ఉద్గారాలు విడుదల చేయకుండానే బాధితులవుతున్న పేద, ఎదుగుతున్న సమాజాలకు న్యాయం జరగటం లేదు. అందుకు నేపాల్ తాజా ఉదాహరణ. హిమానీనదాలు కరిగి జరిగిన ఉపద్రవం వల్ల అక్కడ దేశం ఎదుర్కొన్న నష్టంలో, వారికి అందిన నష్టపరిహారం (లాస్ అండ్ డామేజెస్ ఫండ్ నుంచి) ఒక మూలకు కూడా సరిపోదు. ఈ సమస్య ఉత్తర, దక్షిణ భూగోళాల మధ్య పలు విషయాల్లో కొనసాగుతోంది. చర్చల సరళిని మరింత తీక్షణం చేసి ‘కాప్’ పర్యావరణ ప్రేమికుల్లో, క్లైమెట్ ఛేంజ్ బాధితుల్లో విశ్వసనీయత పెంచాల్సి వుంది.

సుస్థిర వేదికగా కాప్ అవసరం

ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ మార్పులపై స్థిరంగా చర్చలు, సంప్రదింపులు జరిపించే గ్లోబల్ వేదికగా ‘కాప్’ మాత్రమే ఆశాకిరణంగా కనిపిస్తోంది. శిలాజ ఇంధన ఉత్పత్తిదారులు, వినియోగదారులు, కాలుష్య కారకులు, బాధితులు... ఇలా అందిరినీ, సమాన సార్వభౌమ హోదాలతో ఒక వేదికపైకి తెచ్చే మరో ఎజెన్సీ లేదు. నయానో భయానో ఆయా దేశాలను, వారు స్వయంగా ప్రకటించుకున్న (ఎన్‌డిసి) నిబద్ధతలకు కట్టుబడేలా చూడాలి. ఎవరి కాలుష్యం ఎంత? ఎవరి బాధ్యత ఎంత? ముంచుకు వస్తున్న వాతావరణ మార్పు ప్రమాద తీవ్రత ఎంత? శాస్త్రీయమైన, ప్రామాణిక సమాచారం ఇచ్చే అంతర ప్రభుత్వాల అధ్యయన బృంద (ఐపిసిసి) పనికి ఆటంకం కలుగకుండా నిధులు సమకూర్చేలా చూసే బాధ్యత కూడా ‘కాప్’దే! ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా కాప్-31 పలు ప్రధానేతర (164) ఉప అంశాల్లో చర్చలు, సంప్రదింపులు (సైడ్ రూమ్స్‌లో) జరిపించి, అంగీకారాలు కుదిరేలా చూసింది. న్యాయ, సమంజస పరివర్తన ప్రక్రియలు అమలు యోగ్యం చేసే పాక్షిక అంగీకారాలు (దుబాయ్ సదస్సు కొనసాగింపు) ఇక్కడే కుదిరాయి. అమలు ప్రక్రియ మదింపు (జిఎస్‌టి- 2), క్లీన్ ఎనర్జీ ‘విద్యుద్దీకరణ, క్లైమెట్ ఫైనాన్స్ తదుపరి ప్రక్రియలు... వంటి అంశాల్లో కొంత ప్రగతి కాప్- 31 సాధించిన సత్ఫలితాలుగా పరిగణించవచ్చు. ఐక్యరాజ్యసమితి మరో ప్రత్యామ్నాయ, ప్రభావంతమైన కార్యాచరణ చేపట్టే వరకు, ఈ భాగస్వాముల సదస్సు (కాప్) లే పర్యావరణ, పుడమి సంరక్షణకు దారిదీపాలు, ఆశాకిరణాలు.


దిలీప్‌రెడ్డి

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

Tags

Next Story