విభేదాలతో ‘కాప్31’ వైఫల్యం

భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) తగ్గించడానికి, పర్యావరణ వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కార్యాచరణ రూపొందించుకోవడానికి చర్చించడమే కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్) సదస్సుల లక్షం. అంటల్యా, టర్కీలో జరిగిన కాప్31 సదస్సులో దాదాపు 200 దేశాలు 14 రోజుల పాటు చర్చించినా దేశాల మధ్య విభేదాలు తలెత్తి తుది ఒప్పందాన్ని సాధించలేకపోయాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల దహనం, వాతావరణ మార్పులతో వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి తగిన ఆర్థిక సహాయం, వాతావరణ న్యాయం, ఉద్గారాల నివారణ బాధ్యతలు, సాంకేతిక పరిమితులు, తదితర ముఖ్యమైన అంశాలపై గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాలను గ్లోబల్ నార్త్‌గా, అభివృద్ధి చెందుతున్న దేశాలను గ్లోబల్ సౌత్‌గా పరిగణిస్తుంటారు. అమెరికా, కెనడా, పశ్చిమ ఐరోపా, జపాన్ వంటి దేశాలు గ్లోబల్ నార్త్, భారత్, ఆఫ్రికా దేశాలు, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు గ్లోబల్ సౌత్ కిందకు వస్తాయి.
గ్లోబల్ సౌత్ తరఫున భారత్ ఈ సదస్సులో ముఖ్యమైన పాత్ర పోషించింది. అన్ని దేశాలకు ఒకే విధమైన ఉద్గారాల తగ్గింపు లక్షాలను విధించకూడదని, అభివృద్ధి చెందిన దేశాలు తమ చారిత్రక ఉద్గారాలకు తగిన బాధ్యత వహించాలని, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, కారణంగా విద్యుత్ అవసరాలు పెరుగుతున్నందున ఇంధన భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తగినన్ని నిధులు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు అందించాలని, బొగ్గు ఆధారిత ఆర్థిక వ్యవస్థనుంచి స్వచ్ఛమైన ఇంధనాలవైపు మారేటప్పుడు కార్మికులు, రైతులు, స్థానిక సమాజాల జీవనోపాధికి నష్టం జరగకుండా చూడాలని భారత్ మొత్తం అయిదు ప్రతిపాదనలు ప్రత్యేక చర్చాంశంగా సదస్సు అజెండాలో చేర్చినా తుది ఒప్పందం కుదరకపోవడంతో ఫలితం దక్కలేదు. కార్బన్‌డైయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులు విడుదలకు, భూతాపం పెరగడానికి కారణమవుతున్న శిలాజాల ఇంధనాల వినియోగంనుంచి దశల వారీగా బయటపడేందుకు 130 దేశాలు స్పష్టమైన కార్యాచరణ కోరగా, చమురు, గ్యాస్ ఉత్పత్తిపై ఆర్థికంగా ఆధారపడిన సౌదీ అరేబియా, రష్యా వంటి చమురు దేశాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి.
అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పారిశ్రామికీకరణకు, విద్యుత్ అవసరాలకు ఇంధనశక్తి వనరులను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశాయి. 18వ శతాబ్దంనుంచి యూరప్‌లో పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడంతో బొగ్గు, చమురు వంటి ఇంధనాలను ఆయా దేశాలు విస్తృతంగా వినియోగించుకుని అభివృద్ధి సాధించాయి. అయితే అదే సమయంలో పరిశ్రమలు, రవాణా, విద్యుత్నుంచి గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత వాతావరణంలో భారీగా పెరిగింది. ఇప్పుడు భారత్, ఆఫ్రికా వంటి దేశాలు పారిశ్రామికీకరణ ద్వారా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక ప్రశ్న వేస్తున్నాయి. మీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగించిన మార్గాలను మాకెందుకు పరిమితం చేస్తున్నారు? అని నిలదీస్తున్నాయి. ఇది నార్త్ సౌత్ మధ్య విభజనలోని ప్రధాన వివాదమైంది. వాతావరణ మార్పులను ఎదుర్కోడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా ఆర్థిక వనరులు అవసరమవుతాయి. వరదల నివారణకు కరకట్టల నిర్మాణం, తుపాన్ హెచ్చరికల వ్యవస్థల ఏర్పాటు, కరవు నిరోధిక వ్యవసాయ పద్ధతుల అభివృద్ధి, సముద్ర ముంపు నుంచి తీర ప్రాంతాలకు రక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి తదితర చర్యలు చేపట్టడానికి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కావలసిన ఆర్థిక స్తోమతు లేదు. అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు ఈమేరకు ఆర్థిక సాయం అందించాలని గ్లోబల్ సౌత్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇది వాతావరణ న్యాయం, సమానత్వం, చారిత్రక బాధ్యతలకు సంబంధించిన సమస్య తప్ప దేశాలను భిక్షమెత్తు కోవడం కాదని ఆఫ్రికా దేశాల ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలనుంచి వెలువడే కార్బన్‌డైయాక్సైడ్‌ను సంగ్రహించి భూగర్భంలో నిల్వచేస్తే వాతావరణ మార్పులకు పరిష్కారం లభిస్తుందని అభివృద్ధి చెందిన దేశాల ప్రతిపాదనకు కూడా అభ్యంతరాలు వచ్చాయి. దీనికి ఖర్చు ఎక్కువగా ఉంటుందని, సాంకేతిక పరిమితులు తలెత్తుతాయని, బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగంపై దృష్టి తగ్గుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదించాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల విషయంలో గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ దేశాల బాధ్యతలను ఒకే విధంగా చూడకూడదన్న అభిప్రాయం బయటపడింది. వాతావరణ న్యాయం తప్పనిసరి అని తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చైనా, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఉద్గారాలు కూడా ప్రపంచ ఉద్గారాల్లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయనే విషయం మర్చిపోరాదు. కాబట్టి ప్రస్తుత ఉద్గారాలు, భవిష్యత్ ఉద్గారాల ఆధారంగా ప్రధాన ఉద్గారాల దేశాలు సమాన బాధ్యత తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పారిశ్రామిక విప్లవం నుంచి ఇప్పటివరకు జరిగిన చారిత్రక ఉద్గారాలను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్ ఏర్పడింది. తలసరి ఉద్గారాలు, అభివృద్ధి స్థాయి, ఆర్థిక సామర్ధాలను కూడా పరిశీలించాలి. అప్పుడే వాతావరణ న్యాయం అనే సూత్రానికి ప్రాధాన్యం లభిస్తుంది. ఇది కేవలం ఉద్గారాల నివారణతోనే సరిపోదు. మిగతా సమస్యలపై కూడా పరిష్కారం లభిస్తేనే కాప్ వంటి అంతర్జాతీయ వాతావరణ సదస్సులకు గుర్తింపు లభిస్తుంది.
-
Home
-
Menu
