బలం పెరిగిందనా బిల్లులతో బరిలోకి?

బలం పెరిగిందనా బిల్లులతో బరిలోకి?
X



పరిస్థితుల్లో ఏం మార్పు వచ్చిందని కొద్ది మాసాల క్రితమే వీగిపోయిన బిల్లుకు మళ్లీ ప్రాణం పోయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది? అది జరగదని తెలిసీ ప్రతిపక్షాలను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు అధికారపక్షం కొత్త పాచిక వేస్తున్నదా? గతంలో పార్లమెంటులో అవసరమైన మద్దతు లభించక చతికిలపడిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను కేంద్రప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకురావడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది. గత వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, ప్రతిపక్షాల అభ్యంతరాలకు కొన్ని సవరణలు చేసి అధికారపక్షం మళ్లీ రంగంలోకి దిగింది. కేంద్రమంత్రివర్గం తెస్తున్న ఈ బిల్లు ఆమోదం పొందితే అధికారపక్షానికి రాజకీయ విజయమే. వీగిపోతే ప్రతిపక్షాలపై మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారన్న ముద్ర వేయడానికి అవకాశం. ఈ రెండు పరిస్థితుల్లోనూ రాజకీయ లబ్ధి పొందేలా కేంద్రం వ్యూహం రచిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది సభ్యులున్నారు. వారిలో 469 మంది పురుషులు కాగా, మహిళలు కేవలం 74 మంది మాత్రమే. అంటే మహిళల ప్రాతినిధ్యం 14 శాతం కూడా లేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ప్రస్తుత లోక్‌సభలో పురుషులకు పోటీ చేసే అవకాశం ఉన్న స్థానాలు 362కు పరిమితమవుతాయి. ఇంతకాలం రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించిన పురుష నాయకులకు ఇది సహజంగానే తీవ్ర అసంతృప్తిని కలిగించే అంశం. తమకు దక్కాల్సిన స్థానాలు తగ్గిపోతున్నాయన్న ఆందోళన వారిలో నెలకొనవచ్చు. అలాంటి పరిస్థితిలో ముందుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెస్తే బీజేపీ, తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు కలిగించే నాయకుల ఆగ్రహానికి గురయ్యే ప్రమా దం ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభ స్థానాల సంఖ్య 850కు పెరిగితే పరిస్థితి మారిపోతుంది. మహిళలకు మూడింట ఒక వంతు స్థానాలు కేటాయించినా, పురుషులకు పోటీ చేయడానికి సుమారు 566 స్థానాలు అందుబాటులో ఉంటాయి. అంటే ప్రస్తుత లోక్‌సభలో పురుషులకు ఉన్న స్థానాల సంఖ్యతో పోలిస్తే, వారి అవకాశాలు తగ్గకపోగా మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇంతకుమించి ఏముంటుంది?

అయితే లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచడం వల్ల పార్లమెంటు పనితీరు మెరుగుపడుతుందా అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ గణాంకాల ప్రకారం, 2026 వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ జరగాల్సిన సమయంతో పోలిస్తే కేవలం 15 శాతం సమయం మాత్రమే పనిచేసింది. రాజ్యసభ పనితీరు కూడా 33 శాతానికే పరిమితమైంది. పార్లమెంటు తనకు కేటాయించిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మరో రెండు వందలమంది సభ్యులను చేర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? సభ్యుల సంఖ్య పెరిగితే చర్చలు మరింత గందరగోళంగా మారే ప్రమాదం లేదా? ప్రశ్నోత్తరాల సమయం భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన వేదిక. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి, పాలనలోని లోపాలను ఎత్తిచూపడానికి ఇది సభ్యులకు లభించే ముఖ్యమైన అవకాశం. కానీ సభలో సభ్యుల అనుచిత ప్రవర్తన కారణంగా ప్రశ్నోత్తరాల సమయం తరచూ వాయిదా పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సభలో బిల్లులను చింపివేయడం, నినాదాలు చేయడం, ఒకరి మాట మరొకరు వినకుండా అడ్డుకోవడం, సభ మధ్యలోకి దూసుకెళ్లడం, ప్లకార్డులు ప్రదర్శించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంటులో సాధారణంగా మారిపోయాయి.

అధికార పక్షానికి, ప్రతిపక్షానికి వేర్వేరు రాజకీయ బాధ్యతలు ఉండవచ్చు. కానీ ఆ రెండు పక్షాలూ ఓటర్లకే జవాబుదారీగా ఉంటాయి. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేది పార్లమెంటులో గందరగోళం సృష్టించడానికి కాదు, ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనడానికి. అందువల్ల పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచే ముందు, పార్లమెంటు తనకు కేటాయించిన సమయాన్ని సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం అవసరం కాదా? 543 మంది సభ్యులతో ఉన్న పార్లమెంటు సరిగా పనిచేయలేకపోతున్నప్పుడు, 785 మంది లేదా 850 మంది సభ్యులతో కూడిన పార్లమెంటు మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్న నమ్మకం ఎలా కలుగుతుంది?పార్లమెంటులో 543 మంది ఉండాలా, 785 మంది ఉండాలా, 850 మంది ఉండాలా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ప్రజలు తమ ప్రతినిధుల నిర్వహణ కోసం వెచ్చిస్తున్న అపారమైన ప్రజాధనానికి తగిన ఫలితం లభిస్తున్నదా అన్నదే అసలు ప్రశ్న. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, సౌకర్యాలు, సభ నిర్వహణకు అయ్యే ఖర్చులు అన్నీ ప్రజల పన్నుల నుంచే వస్తాయి. ప్రజాధనంతో నిర్వహించే ఈ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థ ప్రజల ఆశలు,

ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. భారత రాజకీయ నాయకత్వం ముందున్న అసలు సవాలు సభ్యుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదు. పార్లమెంటు గౌరవాన్ని, పనితీరును పునరుద్ధరించడం, ప్రజలకు తమ ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం కలిగించడం. సభలో సభ్యుల సంఖ్య ఎంత ఉన్నా, వారు ప్రజల సమస్యలను చర్చించకపోతే, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టకపోతే ప్రయోజనం ఏమిటి?మహిళా రిజర్వేషన్లు అవసరమే. నియోజకవర్గాల పునర్విభజన కూడా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఉండాలి. కానీ ఈ మార్పులన్నీ పార్లమెంటు పనితీరును మెరుగుపరిచే సంస్కరణలతోపాటు సాగాలి. లేకపోతే సభ్యుల సంఖ్య పెరుగుతుంది తప్ప, ప్రజాస్వామ్య విలువ పెరుగుతుందన్నగ్యారెంటీ లేదు కదా. అయితే ఈసారి అధికారపక్షం నిజంగానే అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకున్నదా? గతంలో వ్యతిరేకించిన పార్టీలను తనవైపు తిప్పుకోవడంలో సఫలమైందా? లేక ఎన్నికల రాజకీయాల కోసం మరోసారి పార్లమెంటులో ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నదా? ఈ రెండు వాదనల మధ్యే ఇప్పుడు చర్చ సాగుతున్నది.


ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. దానిపై ఆధారపడిన నియోజకవర్గాల పునర్విభజన, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఇతర బిల్లులపై కూడా ముందుకు సాగలేకపోయింది. అయితే ఈ వైఫల్యాన్ని తాత్కాలికమని భావించిన కేంద్రప్రభుత్వం, బిల్లులో మార్పులు చేసి మరోసారి రంగంలోకి దిగుతోంది. ఈసారి లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం పెంచే ప్రతిపాదనను చేర్చింది. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించేలా ప్రతిపాదనలు చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తున్నది. లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కు పెంచడం, రాష్ట్రాల శాసనసభల సభ్యుల సంఖ్యను కూడా పెంచడం ఈ ప్రతిపాదనల్లో ముఖ్యమైన అంశాలు.

మహిళలకు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న 2023 చట్టం అమలును వేగవంతం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతున్నది. 2029 ఎన్నికలనాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావడానికి ఈ చర్యలు అవసరమని అధికారపక్షం వాదిస్తున్నది. బిల్లు మళ్లీ తీసుకురావడానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు రెండు ప్రధాన వాదనలు వినిపిస్తున్నారు. మొదటి వాదన ప్రకారం, గతంలో బిల్లును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలలో కొన్ని ఇప్పుడు తమ అభ్యంతరాలను పునఃపరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళనను తొలగించడానికి కేంద్రం చేసిన సవరణలు కొన్ని పార్టీలను సంతృప్తిపరిచినట్లు కనిపిస్తున్నది. తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ ప్రస్తుత ప్రాతినిధ్య వాటా తగ్గకూడదని పట్టుబడుతున్నాయి.

రాష్ట్రాల మధ్య పార్లమెంటు స్థానాల నిష్పత్తిని 2051 వరకు కొనసాగిస్తామని కేంద్రం ప్రతిపాదించడం ఈ ఆందోళనలకు సమాధానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వ్యతిరేకించిన కొన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అధికారపక్షం ఈ పరిణామాలను తనకు అనుకూలంగా భావిస్తున్నది. గతంలో అవసరమైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఎదురైన పరాజయం ఈసారి పునరావృతం కాకపోవచ్చని భావిస్తోంది. ప్రతిపక్షాల్లో చీలికలు, కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు, సవరణల ద్వారా అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలు బిల్లుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అధికార పక్షం భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే మద్దతు లభిస్తుందని భావించడం వేరు, పార్లమెంటులో నిజంగా అవసరమైన మెజారిటీ సాధించడం వేరు. రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభతోపాటు రాజ్యసభలోనూ ప్రత్యేక మెజారిటీ అవసరం. అందువల్ల చివరి నిమిషం వరకు రాజకీయ చర్చలు, ఒప్పందాలు కీలకంగా మారే అవకాశం ఉంది.

మరో వాదన మాత్రం ఈ బిల్లుల వెనుక రాజకీయ వ్యూహం ఉందని సూచిస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నదనే వాదన. బిల్లుకు మద్దతు ఇవ్వని ప్రతిపక్షాలను మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకులుగా చిత్రీకరించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చన్నది ఈ వాదన సారాంశం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశం ప్రజల్లో విస్తృతమైన మద్దతు కలిగినది. అలాంటి అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో కలిపి ముందుకు తీసుకురావడం వల్ల ప్రతిపక్షాలకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చు. బిల్లు మళ్లీ వీగిపోయినా, మహిళా రిజర్వేషన్ల అమలును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని అధికారపక్షం ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని ఈ వాదనను సమర్థించే వారు భావిస్తున్నారు.

ఇక్కడ అసలు ప్రశ్న మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంలో పెద్దగా విభేదాలు లేవు. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడానికి దేశ రాజకీయ ప్రాతినిధ్య వ్యవస్థలో భారీ మార్పులు చేయ తలపెట్టడం అవసరమా? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యతను ఎలా కాపాడాలి? జనాభా పెరుగుదల ఆధారంగా స్థానాల సంఖ్య పెరిగితే, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఎలా చూడాలి వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరం. ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. మహిళలకు రిజర్వేషన్లు అనే మాట వినబడగానే మన రాజకీయ నాయకులు తమ కుమార్తెలను, చెల్లెళ్ళను, కోడళ్ళను, భార్యలను ఎన్నికల బరిలోకి దింపడానికి సిద్దం చేసేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి రాష్ట్రానికి సముచిత ప్రాతినిధ్యం ఉండాలి. అదే సమయంలో మహిళలకు తగిన రాజకీయ అవకాశాలు కల్పించడం కూడా అత్యవసరం. ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించడమే కేంద్ర ప్రభుత్వానికి అసలు సవాలు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులపై జరిగే చర్చ దేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. బిల్లు ఆమోదం పొందితే మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం కావడంతోపాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఆమోదం పొందకపోతే మాత్రం గత వైఫల్యానికి కారణాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలవుతుంది.అధికార పక్షం బిల్లును ఆమోదింపజేసుకోవడానికి సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడం సహజమే. కానీ అంతకంటే ముఖ్యమైనది ప్రతిపక్షాల ఆందోళనలకు నిజాయితీగా సమాధానం చెప్పడం. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ఆయుధంగా కాకుండా ప్రజాస్వామ్య సంస్కరణగా చూడాలి. నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఎన్నికల ప్రయోజనాల కోణంలో కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరిగేలా చేపట్టాలి.


ఈసారి బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి కేంద్రం ఏ భరోసాతో సిద్ధమవుతున్నదన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే లభించవచ్చు. ప్రతిపక్షాల మద్దతు నిజంగా పెరిగిందా? లేక కొన్ని రాజకీయ పక్షాలు అమ్ముడుపోవడానికి, అధికారపక్షం వారిని కొనుగోలు చెయ్యడానికి నిస్సిగ్గుగా సిద్దపడుతోందా అన్నది పార్లమెంటు చర్చలు, ఓటింగ్ ఫలితాలు తేల్చనున్నాయి. ఎన్ని విన్యాసాలు చేసినా మోడీ-షా ప్రయత్నాలు ఫలించి బిల్లు లోక్ సభలో గట్టెక్కాలంటే ఆరు నుంచి ఎనిమిదిమంది సభ్యులు తక్కువ అవుతున్నారని ఓ లెక్క. ఈ పరిస్థితులలో అధికార నాయకత్వద్వయం వ్యూహం ఏమిటో బిల్లు సభలో ఓటింగుకు పెట్టినపుడు తేలిపోతుంది. ఓటింగ్ బహిష్కరణ మంత్రం లేకపోలేదు. మహిళా రిజర్వేషన్ల వంటి కీలకమైన అంశం రాజకీయ వ్యూహాల మధ్య చిక్కుకోకుండా, దేశ ప్రజాస్వామ్యానికి మేలు చేసే విధంగా ముందుకు సాగడం మాత్రం అత్యంత అవసరం.

Tags

Next Story