రైతు భరోసాకు డ్రోన్ టెక్నాలజీ

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగం పుంజుకుంటోంది. పంటలకు పురుగు మందులు, ద్రవ ఎరువుల పిచికారీతోపాటు పంటల పర్యవేక్షణ, వ్యవసాయ సేవలను వేగంగా అందించడంలో డ్రోన్ల వినియోగం విస్తరిస్తోంది. రైతులకు డ్రోన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గ్రామీణ మహిళలు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కిసాన్ డ్రోన్ల ప్రోత్సాహానికి ఇప్పటివరకు రూ. 141.39 కోట్లు విడుదలయ్యాయి. రైతులకు 527 డ్రోన్లు అందించడంతోపాటు 1,595 డ్రోన్ కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రైతుల పొలాల్లో 27,099 డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించి, సుమారు 30.23 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రదర్శనలు చేపట్టగా, 3.51లక్షల మంది రైతులు వాటి ద్వారా లబ్ధి పొందారు. డ్రోన్ వినియోగానికి సంబంధించి 287 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి పరిశోధన, ప్రయోగాల ద్వారా పునాది పడింది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంనకు 2021లో డి జిసిఎ అనుమతులు లభించడంతో పంట రక్షణ, పురుగు మందుల పిచికారీ, తెగుళ్లు, వ్యాధుల గుర్తింపుపై డ్రోన్లతో పరిశోధనలు జరిగాయి. 2022లో వరి పంటలో డ్రోన్ ఆధారిత పిచికారీకి ప్రామాణిక విధానం రూపొందించగా, అనంతరం వరి, పత్తి, కంది, వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, కుసుమ వంటి ఏడు పంటలకు పంట -నిర్దిష్ట డ్రోన్ పిచికారీ విధానాలు అభివృద్ధి చేసినట్లు రిచ్ నివేదిక పేర్కొంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం, పిజెటిఎస్‌ఎయు, రిచ్, అగ్రిటెక్ స్టార్టప్‌ల భాగస్వామ్యంతో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను పొలాల్లో పరీక్షించే కార్యక్రమాలు చేపట్టాయి. డ్రోన్ టెక్నాలజీతో పాటు పంట పర్యవేక్షణ, నీటి నిర్వహణ, పోషక యాజమాన్యం వంటి అంశాల్లోనూ సాంకేతిక పరిష్కారాలను పరీక్షించారు. ఈ చర్యల ద్వారా తెలంగాణలో డ్రోన్ ఆధారిత వ్యవసాయానికి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ప్రయోగాల స్థాయిలో పునాది ఏర్పడింది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను రైతులకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం వ్యవసాయ యాంత్రీకరణలో కీలకంగా మారనుంది. డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతతో అనుసంధానించేందుకు ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. 202324 నుంచి 2025-26 వరకు అమలయ్యే ఈ పథకానికి రూ. 1,261కోట్ల కేటాయింపుతో ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు 15,000 డ్రోన్లు అందించాలన్నది లక్ష్యం. ఈ సంఘాలు రైతులకు అద్దె ప్రాతిపదికన డ్రోన్ సేవలను అందించేలా పథకాన్ని రూపొందించారు.
ఈ పథకం కింద డ్రోన్ ఖర్చులో 80% వరకు, గరిష్ఠంగా రూ. 8 లక్షల వరకు కేంద్ర ఆర్థిక సహాయం అందుతోంది. డ్రోన్‌తోపాటు స్ప్రే అసెంబ్లీ, అదనపు బ్యాటరీలు, నిర్వహణ, బీమా, డ్రోన్ పైలట్, సహాయకుడి శిక్షణ వంటి సదుపాయాలను ప్యాకేజీలో చేర్చారు. 2026 జనవరి నాటికి ప్రధాన ఎరువుల కంపెనీలు స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్లు పంపిణీ చేయగా, అందులో 500 డ్రోన్లు నమో డ్రోన్ దీదీ పథకం కింద పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటి నిర్వహణకు ఎంపికైన మహిళలకు డిజిసిఎ అనుమతించిన శిక్షణ సంస్థల్లో డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు. తెలంగాణలోనూ ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం లభిస్తోంది. కేంద్రం వెల్లడించిన రాష్ట్రాల వారీ వివరాల ప్రకారం, నమో డ్రోన్ దీదీ పథకం కింద పంపిణీ చేసిన తొలి 500 డ్రోన్లలో తెలంగాణకు చెందిన 72 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లు, గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకులతోపాటు కిసాన్ డ్రోన్ల ప్రదర్శనలు, కొనుగోలు, డ్రోన్ కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పంటలపై రసాయనాల పిచికారీ నుంచి పంట పర్యవేక్షణ వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతకు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. రైతులకు డ్రోన్ సేవలు సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తే వ్యవసాయ యాంత్రీకరణకు మరింత ఊతం లభించే అవకాశముంది.
డా. మోటె చిరంజీవి, 99491 94327
-
Home
-
Menu
