ఓటర్ల హక్కుకు గట్టి దిక్కు లేదా?

కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న విస్తృత అధికారాలు చాలావరకు సుప్రీం కోర్టు తీర్పుల వల్లనే ఏర్పడినప్పటికీ, ఓటర్ల హక్కులకు అదే స్థాయిలో న్యాయస్థానాల మద్దతు లభించలేదు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల కమిషన్ అధికారాలను సుప్రీం కోర్టు పెంచుతూ వచ్చింది. అదే సమయంలో ఆర్టికల్ 326 కింద ఓటర్ల హక్కును మాత్రం పరిమితం చేస్తూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ లోని ప్రతి దశ లోనూ ఎన్నికల కమిషన్‌కు విస్తృత అధికారాలుంటాయని, పార్లమెంట్ చేసిన చట్టం కూడా ఆ అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేయలేదని సుప్రీం కోర్టు పేర్కొంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కును రాజ్యాంగం కల్పించినప్పటికీ, ఓటు హక్కును కేవలం చట్టం ద్వారా కల్పించబడిన హక్కుగా గత అనేక దశాబ్దాలుగా సుప్రీం కోర్టు పరిగణిస్తూ వచ్చింది. బీహార్ ‘సర్’ తీర్పులో ‘ఓటు హక్కును ఒక విలువైన రాజ్యాంగ హక్కు’గా పేర్కొన్నప్పటికీ, ‘సర్’లో కోరిన పత్రాలు అంత కఠినంగా ఉండి ఓటరు హక్కును పూర్తిగా అర్థరహితం చేస్తున్నాయా? అన్న ఒక్క ప్రశ్నకే సుప్రీం కోర్టు పరిమితమైపోవడం గమనార్హం. ఈ సమయంలో ఓటరు సంగతి ఎలా ఉన్నా ఎన్నికల సంఘం నైపుణ్యానికే కోర్టు కొంతవరకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన పేరు ఓటర్ల జాబితాలో ఉండాల్సిందే అని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసే హక్కు ఓటరకు లేదనే పరిస్థితి ఏర్పడుతోంది.
అందువల్ల ‘సర్’ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓటర్ల పేర్లు జాబితానుంచి తొలగించబడవచ్చు. ఆ తర్వాత ప్రతి వ్యక్తి తన అర్హతను నిరూపించుకుని మళ్లీ ఓటర్ల జాబితా లోకి రావలసి ఉంటుంది. ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితాను నిర్ణయించే అధికారం ఉన్నప్పటికీ, ఓటర్ల హక్కుకు కూడా అంతే బలమైన రక్షణ ఉండాలి. లేకపోతే ముందుగా ఓటర్లను జాబితా నుంచి తొలగించి, తర్వాత వారినే తమ అర్హతను నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికలను నిర్వహించే అధికారం ఆర్టికల్ 324 ఇస్తుంది. అయితే అర్హత ఉన్న పౌరులకు ఓటు హక్కును ఆర్టికల్ 326 కల్పిస్తుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి పౌరుడినీ ఓటర్ల జాబితాలో చేర్చడం, ఎన్నికల కమిషన్ బాధ్యత. రాజ్యాంగం అనుమతించిన కారణాలుంటేనే తప్ప ఎవరినీ ఓటు హక్కు నుంచి దూరం చేయకూడదు. అంటే ఇసి అధికారం ప్రజల ఓటు హక్కును రక్షించడానికే ఉపయోగపడాలి. రాజ్యాంగం అసలు స్ఫూర్తి ఓటర్ల ప్రజాస్వామ్య హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడమే. ప్రస్తుతం జరుగుతున్న ఇసి సర్ వివాదాన్ని సుప్రీం కోర్టు ఈ రాజ్యాంగ నేపథ్యంతో పరిశీలించాల్సి ఉంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన కొన్ని నిర్ణయాల విషయంలో ఎలక్షన్ కమిషన్ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వెల్లడైన విషయం తెలిసిందే. దీనిపై కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను కోరింది.
ముఖ్యంగా ఇసి తీసుకున్న నిర్ణయాలు అందరి ఏకాభిప్రాయంతో తీసుకున్నవా లేక మెజారిటీ ఆధారంగా తీసుకున్నవా? అని సుప్రీం కోర్టు అడిగింది. నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోకపోతే, ఆ నిర్ణయాలు ఎందుకు, ఎలా తీసుకున్నారో, ఎన్నికల కమిషన్ వివరించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించే విధానం కూడా చర్చకు వస్తోంది. ఈ కారణాలను విశ్లేషించి చూస్తే ప్రభుత్వం కనుసన్నల్లో నడవడం కాకుండా స్వతంత్రంగా ఎన్నికల కమిషన్ పని చేయాలన్న బలమైన సూచన వస్తోంది. లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించి, ఎన్నికల నిష్పక్షపాతాన్ని దెబ్బ తీయవచ్చు. దీని ప్రధాన లక్షం సాధారణ పౌరులకు ఓటు వేసే హక్కును పరిరక్షించడం. 1995లో టిఎన్ శేషన్ కేసులో ప్రభుత్వ రోజువారీ జోక్యం నుంచి ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ తర్వాత 2023 లో అనూర్ బరన్వాల్ కేసులో ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తావన ప్రముఖంగా వచ్చింది. ఆనాడు తాత్కాలికంగా ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఉండాలని కోర్టు సూచించింది. అంటే ఎన్నికల కమిషన్‌లో ఒక వ్యక్తి మాత్రమే నిర్ణయాలు తీసుకోకుండా, అనేక మంది సభ్యులు కలిసి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల సిఇసి మాత్రమే సర్వాధికారి కాదు. సిఇసి, ఇతర ఎన్నికల కమిషనర్లు కలిసి నిర్ణయాలను తీసుకోవడం తప్పనిసరి.
అయితే ప్రస్తుతం ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు తాము గత 10 నెలల కాలంలో 14 సార్లు తమ అభ్యంతరాలను వెల్లడించినప్పటికీ సిఇసి పట్టించుకోవడం లేదని బాహాటంగా ప్రకటించడం, ఇప్పుడు ఎన్నికల కమిషన్ పనితీరు లోపాలను బహిర్గతం చేసింది. దీనిపైనే దేశమంతా సిఇసి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు సాగుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఈ ఆందోళనలను చల్లార్చడానికి రకరకాల ప్రకటనలు చేస్తోంది. ఎన్నికల కమిషన్‌లో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, చివరికి నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఆమోదం పొందాయని సర్ది చెబుతోంది. ఇద్దరు ఇసిలు నిరంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంటే ఆ నిర్ణయం ఏకగ్రీవం కాదు. ఫారం 6 డిక్లరేషన్‌పై కూడా వివాదం తలెత్తింది. సుప్రీం కోర్టు ఆ ఫారం 6ను సమర్థించిందని ఇసి చెప్పగా, అలా సమర్ధించలేదని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఇవన్నీ ఎన్నికల కమిషన్ పనితీరుపై అనుమానాలను రేపుతున్నాయి.
-
Home
-
Menu
