జెన్జీల జెండాల జోరు ఎజెండాలు వేర్వేరు!

ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త తరం తన ఉనికిని చాటుకుంటోంది. ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తోంది. అవినీతిని నిలదీస్తోంది. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, విద్యారంగంలోని సంక్షోభం, పెరుగుతున్న జీవన వ్యయాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ భవిష్యత్తును నిర్ణయించే రాజకీయ వ్యవస్థలో తమకూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది. ఈ మార్పు ఇప్పుడు ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ పరిణామాల మధ్య అత్యధిక యువ జనాభా కలిగిన మన భారతదేశం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది!
భారతదేశంలో ఈ కొత్త రాజకీయ చైతన్యానికి ఇటీవల జరిగిన నీట్ (NEET) పరీక్ష వివాదం ఒక ప్రేరణగా, ఉదాహరణగా నిలిచింది. లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ప్రవేశ పరీక్షలో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించింది. పరీక్ష రద్దు, మళ్లీ నిర్వహణతో విద్యార్థులు ఎదుర్కొన్న మానసిక, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపైనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ అసంతృప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యంగ్య వేదికగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) క్రమంగా విద్యార్థుల ఉద్యమానికి వేదికగా మారింది. అభిజీత్ దీప్కే తదితర యువ నేతల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త నిరసనల వరకు సాగిన ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. జులై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సెప్టెంబరులో సుప్రీం కోర్టు ఈ నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయడం కూడా ప్రజాస్వామిక నిరసన హక్కు చర్చలో కీలక పరిణామం. ఒక పరీక్ష వివాదంతో మొదలైన ఆగ్రహం విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, యువత ఉపాధి, పాలనా పారదర్శకత వంటి విస్తృత ప్రశ్నలకు, ఆందోళనలకు విస్తరించింది!
భారత్‌లో కనిపిస్తున్న ఈ పరిణామాలకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యువజన ఉద్యమాలు అద్దం పడుతున్నాయి. స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమం షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసింది. నేపాల్‌లో 2025లో సోషల్ మీడియా నిషేధం, అవినీతి, నిరుద్యోగం, రాజకీయ కుటుంబాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం కెపి శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చింది. మడగాస్కర్‌లో విద్యుత్, మంచినీటి సమస్యలపై యువత నిరసనలు ప్రభుత్వ మార్పునకు దారితీశాయి. ఈ దేశాల్లో ఉద్యమాల తక్షణ కారణాలు వేర్వేరైనా, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పాలనపై అసంతృప్తి ఉమ్మడి అంశంగా కనిపించింది. తాజాగా ఇటీవలి వారాల్లో ఐరోపాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ చైతన్యం మరింత విస్తరిస్తోందని సూచిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో విద్య, ప్రజాసేవలు, జీవన వ్యయాలపై ప్రారంభమైన నిరసనలు క్రమంగా విస్తృత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఇటలీలో వేతనాలు, ఉపాధి, ఆరోగ్యం, విద్యారంగానికి నిధుల కేటాయింపుపై విద్యార్థులు, కార్మికులు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చారు. నవంబర్ 20న ఇటలీలో వందకు పైగా నగరాల్లో జరిగిన సమ్మెలు, నిరసనలు ఈ అసంతృప్తికి అద్దం పట్టాయి. జర్మనీలోనూ విద్యకు నిధులు పెంచాలని, తప్పనిసరి (నిర్బంధ) సైనిక సేవను వ్యతిరేకిస్తూ యువత నిరసన తెలిపింది. అదే రోజు కనీసం 25 ఐరోపా దేశాల్లో యువత అంతర్జాతీయ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. విద్య, ఉపాధి, గృహవసతి, వేతనాలు, వాతావరణ పరిరక్షణ, పెరుగుతున్న సైనిక వ్యయాలు ఈ ఉద్యమాల్లో ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి.
ఈ పరిణామాలను కేవలం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా చూడలేం. యువతరం రాజకీయాలను చూసే విధానంలో వస్తున్న మార్పుకు ఇవి సంకేతాలు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఈ తరం ఒక దేశంలోని ఉద్యమం నుంచి మరో దేశంలోని యువత స్ఫూర్తి పొందేలా చేస్తోంది. సంప్రదాయ రాజకీయ నాయకత్వం, పార్టీలకే పరిమితం కాకుండా తమ సమస్యల చుట్టూ స్వతంత్రంగా సమీకృతమవుతోంది. అయితే ఈ తరంలోనూ భిన్నమైన రాజకీయ అభిప్రాయాలున్నాయి. అన్ని ఉద్యమాలూ ఒకే లక్ష్యంతో సాగడం లేదు. అయినప్పటికీ తమ భవిష్యత్తుపై తమకు హక్కు ఉందనే భావన బలపడుతోంది.
భారతదేశం ఈ పరిణామాలను మరింత లోతుగా పరిశీలించాలి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా మన ముందున్న అవకాశాలు అపారం. కానీ ఆ జనాభాకు తగిన ఉపాధి కల్పించలేకపోతే, నాణ్యమైన విద్య అందించలేకపోతే, పోటీ పరీక్షల్లో పారదర్శకతను పాటించకపోతే దేశంలోని లక్షలాది యువతలో పేరుకుపోతున్న అసంతృప్తి అసమ్మతిగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరుగుతున్న విద్యా ఖర్చులు, నిరుద్యోగం యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. వీటికి ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు సరిపోవు. పాలనలో స్పష్టమైన పరిష్కారాలు అవసరం.
ప్రభుత్వాలను మార్చడం కంటే వ్యవస్థలను మార్చడం ముఖ్యం. బంగ్లాదేశ్, నేపాల్ అనుభవాలు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ఉద్యమాల ద్వారా అధికార మార్పు సాధ్యమే అయినా, అవినీతిని అరికట్టడం, ఉపాధి కల్పించడం, ప్రజాస్వామిక సంస్థలను బలోపేతం చేయడం అంతకంటే పెద్ద సవాలు. యువత సంధిస్తున్న ప్రశ్నలను శత్రుత్వంగా చూడకుండా, ప్రజాస్వామిక హక్కుగా గుర్తించాలి. వారి ఆలోచనలకు పాలనలో స్థానం కల్పించాలి. ప్రపంచవ్యాప్తంగా యువతరం కొత్త రాజకీయ భాషను ఆవిష్కరిస్తోంది! ఆ భాషలో కేవలం అధికారం, పదవులు కాదు.. విద్య, ఉపాధి, సమానత్వం, స్వేచ్ఛ, జవాబుదారీతనం ప్రధాన అంశాలవుతున్నాయి. ఈ మార్పును అర్థం చేసుకొని యువత ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగడం భారత ప్రజాస్వామ్యం ముందున్న అసలైన సవాలు. సిసలైన కర్తవ్యం! ఎందుకంటే రేపటి భారతదేశాన్ని నిర్మించాల్సింది నేటి యువతరమే. వారి భవిష్యత్తును నిర్ణయించే హక్కు కూడా వారికే ఉంది. అధికారం ప్రజల కోసం, ప్రగతి కోసం ఉండాలి కానీ.. ప్రజలపై పెత్తనం చెలాయించడానికి కాదు. ప్రజల గొంతును, నిరసనను కొంతకాలం అణచివేయవచ్చేమో కానీ, వారి ఆకాంక్షలను, స్వేచ్ఛా భావనలను శాశ్వతంగా అణచివేయడం సాధ్యం కాదు! ఇప్పుడు వీస్తున్న కొత్త గాలి జన ప్రభంజనంగా మారితే ఏ నిరంకుశ, నియంత్రత్వ ప్రభుత్వమూ అడ్డుకోలేదు!!
వీరేంద్ర కాపర్తి
(సీనియర్ జర్నలిస్టు)
Tags
-
Home
-
Menu
