గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణకు మహర్దశ!

గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణకు మహర్దశ!
X

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పారిశ్రామిక ప్రగతి, భారీ పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026’కు సిద్ధమైంది. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు.. తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలకు ప్రతిరూపంగా, రాష్ట్రానికి ప్రపంచస్థాయి పెట్టుబడులను తీసుకొచ్చే వేదికగా నిలవనుంది. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ తెలంగాణ సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు గ్లోబల్ సమ్మిట్ సిద్ధమైంది. వెయ్యికి పైగా కంపెనీలు, వేలాది మంది పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో జరగనున్న ఈ సదస్సు.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కొత్త బాటలు వేయనుంది. గత ఏడాది గ్లోబల్ సమ్మిట్‌లో రూ. లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటనలు, 75కుపైగా అవగాహన ఒప్పందాలు తెలంగాణ పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. 44కు పైగా దేశాలు, 500కు పైగా కంపెనీలు, 10వేల మందికి పైగా ప్రతినిధుల భాగస్వామ్యం రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.

ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ 2026 సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గతంలో ప్రకటించిన పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావడంతోపాటు, కొత్త పెట్టుబడులతో మరిన్ని పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే ఈసారి లక్ష్యం కావాలి. భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి గ్లోబల్ సమ్మిట్ వేదిక కానుంది. సుమారు 30వేల ఎకరాల విస్తీర్ణంలో నెట్‌జీరో నగరంగా రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి కొత్త దిశ చూపనుంది. తెలంగాణ రైజింగ్ విజన్ -2047లో భాగంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనకు ఈ ప్రణాళిక దోహదపడనుంది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని జిల్లాలకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తరించడమే ఈ అభివృద్ధి ప్రణాళికలో కీలకం.

పరిశ్రమలు, సాంకేతికత, విద్య, ఆవిష్కరణలకు సమ ప్రాధాన్యమిస్తూ గ్లోబల్ సమ్మిట్‌లో ఇండియా జాయ్, రక్షా ఎక్స్‌పో, స్టార్టప్ అరీనా, ఫార్మా ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి, ఏరోస్పేస్ రంగాల్లో ఇప్పటికే దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణకు ఈ సదస్సు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే అవకాశాన్ని కల్పించనుంది. ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యంతో స్థానిక పరిశ్రమలకు కొత్త మార్కెట్లు, యువతకు ఆధునిక రంగాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడానికి ఈ వేదిక దోహదపడనుంది.

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రక్షా ఎక్స్‌పో వేదిక కానుంది. డిసెంబర్ 7 నుంచి 13 వరకు జరిగే ఈ ప్రదర్శనలో ఆధునిక రక్షణ పరికరాలు, డ్రోన్ సాంకేతికత, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిసెంబర్ 7న నిర్వహించే ఎయిర్ షో మరో విశేషం. ఈ రంగాల్లో పెట్టుబడులు, పరిశోధన, దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తే తెలంగాణలో కొత్త పరిశ్రమలు, యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఆక్స్‌ఫర్డ్, ఐఐటి హైదరాబాద్, ఐఎస్‌బి, బిట్స్, నల్సార్ వంటి ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో నిర్వహించే ఎడ్యుకేషన్ ఎక్స్‌పో యువతకు కొత్త అవకాశాలను పరిచయం చేయనుంది. మరోవైపు ఇండియాజాయ్ వేదికగా యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్ రంగాల్లోని ఆధునిక అవకాశాలను వివరించనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తే ఉపాధితోపాటు తెలంగాణ ఆర్థిక ప్రగతికి మరింత ఊతం లభిస్తుంది. పారిశ్రామిక ప్రగతితోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మిట్‌లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం విశేషం. కాకతీయుల శిల్పకళ, నిర్మల్ చిత్రకళ, చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఇది దోహదపడనుంది.

మరోవైపు క్లైమేట్ కాంక్లేవ్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎకానమీ, పునరుత్పాదక ఇంధనంపై చర్చలు జరగనున్నాయి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్న ప్రభుత్వ దృక్పథం సుస్థిర తెలంగాణ నిర్మాణానికి తోడ్పడుతుంది. తెలంగాణలో టిజిఐపాస్ వంటి పారిశ్రామిక అనుకూల విధానాలు పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తూ పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పించాలి. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించే పెట్టుబడులు పరిశ్రమలుగా మారి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెంచుతూ జిల్లాలవారీగా పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించినప్పుడే తెలంగాణ ప్రగతి లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి కొత్త అవకాశాలకు బాటలు వేయనుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమల విస్తరణతో యువతకు ఉపాధి కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు చేరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. మూడు రోజుల సదస్సు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి శాశ్వత పునాదిగా మారి, ప్రపంచ పారిశ్రామిక పటంలో తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆశిద్దాం.


మరవాజీ నాగరాజు

(టిపిసిసి ప్రెసిడెంట్ పిఆర్‌ఒ)

Tags

Next Story