శీతాకాలం.. గుండె పదిలం!

తీవ్రమైన చలివాతావరణం, ఆకస్మిక శీతగాలులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సీజన్‌లో గుండెపోటు కేసులు అత్యధికంగా నమోదవ్వటంతోపాటు గుండె సంబంధిత మరణాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. చలిగాలులు, జీవనశైలి మార్పులు గుండెపై ప్రభావాన్ని చూపిస్తాయి. చలివల్ల మనలో చురుకుతనం తగ్గటం, నిద్రమత్తు ఎక్కువగా ఉండటం, సోమరితనం, ఒకేచోట కదలకుండా ఎక్కువసేపు ఉండిపోవడంవల్ల గుండె ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి గుండె సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో గుండెపోటు సమస్యలకు శీతాకాలం ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. చలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్లు మొదలైవి. శీతాకాలంలో గుండెపోటు రావడానికి కారణాలు అవుతున్నాయి. అతిచల్లదనంవల్ల శరీరం వెచ్చఉండటానికి రక్తనాళాలు ముఖ్యంగా కరోనరీ ఆర్టరీస్ (ధమనులు)సంకోచించడం, ఈ కాలంలో శరీర వ్యాయామం తక్కువయ్యి చెమట తక్కువగా ఉండటం వల్ల రక్తపరిమాణం పెరగటంతో రక్తపోటు అధికమవ్వడం, చలికి జీవక్రియ (మెటబాలిజం)నెమ్మదించడం, కొన్ని హార్మోన్ల ప్రభావంతో రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువయ్యి గుండె సిరల్లో చిక్కుకొని రక్తప్రసరణను అడ్డుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదాలు ఎక్కువ అవుతాయి.
శీతాకాలం హృదయనాళ వ్యవస్థను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అంతర్లీన గుండెజబ్బులు ఉన్నవారు ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వయో వృద్ధులు, హై బి.పి, షుగర్, ఇదివరకే గుండెజబ్బు ఉన్నవాళ్లు చాలాజాగ్రత్తగా ఉండాలి. ‘కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వారిలో శీతాకాలంలో ‘ఆంజినా’(ఛాతీ నొప్పి) తరుచూ వచ్చే అవకాశం ఉంటుంది. చల్లని వాతావరణంవల్ల రక్తనాళాలు కుచించుకుపోయి (వాసోకన్‌స్ట్ట్రక్షన్), సహజ ప్రతిస్పందనవల్ల రక్త పోటు పెరగటం, గుండెకు ఆక్సిజన్ సరఫరా డిమాండ్ పెరగటం, శరీరానికి కావలసిన రక్తాన్ని గుండె సరిగా సరఫరా చెయ్యలేకపోవటం వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, గుండెపై ఒత్తిడి పెరిగి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక సాధారణ సమస్య ‘అరిథ్మియా’. ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల, శీతాకాలంలో క్రమరహిత గుండె లయలు ఏర్పడుతాయి. చల్లనిగాలి గుండె విద్యుత్ వ్యవస్థను చికాకుపెడుతూ, దుర్బలవ్యక్తుల్లో అసాధారణ లయలు ఏర్పడుతాయి. శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం, వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా తినడం, అధిక ఒత్తిడి కూడా గుండెకు చేటుతెస్తాయి. శరీరం బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే, అధిక బరువువల్ల ముఖ్యంగా యువతలో హృదయ స్పందనరేటు పెరుగుతుంది తద్వారా గుండెపై భారం పడుతుంది.
చలికాలంలో గుండె సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఎలా నిర్వహించాలి? శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా వెచ్చని దుస్తులు ధరించాలి. నడక, యోగలాంటి స్వల్ప వ్యాయామాలు చెయ్యాలి. మెడిటేషన్ (ధ్యానం ) కూడా బాగా ఉపయోగపడుతుంది. పొగతాగడం, మద్యం మానెయ్యాలి లేదా బాగా తగ్గించాలి. పోషకాలు అధికంగా ఉండే తాజా ఆహార పదార్థాలు, పప్పుధాన్యాలు, పండ్లు, గింజలు, తృణధాన్యాలు మొదలైవి ఎక్కువగా తీసుకుంటూ, దాహం అనిపించకపోయినా మంచినీళ్లు బాగా (గోరువెచ్చగా) తాగాలి.దీనివల్ల ఆరోగ్యం ఆకస్మికంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. గుండె వైఫల్యం చెందేవరకు మనం గమనించలేమని తెలుసుకోవాలి. వృద్ధులు, గుండెజబ్బులు ఉన్నవారు, అధికరక్తపోటు, మధుమేహం ఉన్న వారు, శరీరబరువు అధికంగా ఉన్నవారు, అతి బలహీనంగా ఉన్నవారు, మానసికంగా ఒత్తిడిలో ఉన్నవారు, ఆరుబయట ఎక్కువసేపు పని చేసేవారు, చలిప్రభావం వల్ల మాత్రమే అసౌకర్యంగా ఉండవచ్చని నిర్లక్ష్యం చెయ్యకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, అవసరం అనిపిస్తే వైద్య సలహా తీసుకోవడం మంచిది. రక్తపోటు(బిపి), షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తలతిరుగుతున్నట్లు అనిపిస్తే, ఎడమచేయి, మెడ, దవడతోపాటు వీపుకు ప్రసరించే నొప్పి, అసాధారణ అలస ట, ఆకస్మిక బలహీనత, మైకంగా ఉండటంవంటి లక్షణాలు నిరంతరంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించండి. ఈ చిన్నమార్పులతో, శీతాకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అకాల మరణాలను కూడా నివారించవచ్చు !
డా. జి.దుర్గాప్రసాద్‌రావు
-
Home
-
Menu
