పెట్టుబడులకు ఊపు.. పన్ను ఆదాయానికి ఊతం

అభివృద్ధి అంటే వేదికలపై చెప్పే ఉపన్యాసాలు కావు, కాగితాలపై కనిపించే రాతలు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేవలం మాటలకు పరిమితం కాకుండా గణాంకాల రూపంలో ఉండడంతో పాటు తీసుకునే నిర్ణయాల ఫలితాలు ఆచరణలో కనిపిస్తేనే అది నిజమైన ప్రగతికి నిదర్శనం. తెలంగాణలో పెట్టుబడుల ఒప్పందాలు, వాటికి అనుగుణంగా పరిశ్రమల స్థాపన, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడడం వంటి పరిణామాలు పారిశ్రామికాభివృద్ధికి సూచికలుగా మారుతున్నాయి. తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలతో పరిశ్రమల విస్తరణ, భారీ పెట్టుబడులు, ఐటి, ఐటిఇఎస్ రంగం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డిజిటల్ మౌలిక వసతులు, డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ విప్లవాత్మక మార్పుకు కేవలం పెట్టుబడి ప్రతిపాదనలే కాకుండా ప్రభుత్వానికి పన్ను రూపంలో వస్తున్న ఆదాయం కూడా సూచికగా నిలబడుతోంది.
తాజాగా వెలువడిన జిఎస్టి గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణలో వ్యాపార లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా విస్తరిస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2026- 27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయం 16 శాతం పెరిగి రూ. 44,372 కోట్లకు చేరడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే కాలంలో ఈ ఆదాయం రూ. 38,269 కోట్లుగా ఉంది. ఇందులో జిఎస్టి కీలక పాత్ర పోషించింది. జిఎస్టి వసూళ్లు 19 శాతం పెరిగి రూ. 21,061 కోట్ల నుంచి రూ. 25,049 కోట్లకు చేరాయి. ఒక్క సెప్టెంబరులోనే రాష్ట్ర జిఎస్టి ఆదాయం సుమారు 15 శాతం పెరిగి రూ. 4,164 కోట్లకు చేరినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 7,303 కోట్లుగా నమోదవడం గమనార్హం. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలపడిందని చెప్పడానికి జిఎస్టి ఆదాయం పెరగడం ఒక్కటే నిర్ధారించే ఏకైక ప్రమాణం కాదు. అయితే అదే సమయంలో పరిశ్రమలు, సేవలు, వినియోగం, వాణిజ్య లావాదేవీలు వంటి అనేక కార్యకలాపాలు పన్ను ఆదాయంలో ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో జిఎస్టి వృద్ధి ఆర్థికాభివృద్ధికి ఒక ముఖ్యమైన సూచికగా చూడవచ్చు. తెలంగాణ జిఎస్టి నమోదును పరిశీలిస్తే 2025- 26లో 2.64 లక్షల నుంచి 2026 సెప్టెంబరుకు 3.28 లక్షలకు పెరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు నివేదిస్తున్నాయి. ఇదే సమయంలో పారిశ్రామిక రంగంలోనూ పెట్టుబడుల పరిమాణం పెరుగుతోంది. 2026 -27లో ఇప్పటివరకు 1,172 పారిశ్రామిక యూనిట్లకు అనుమతులు లభించగా, వాటి ప్రతిపాదిత పెట్టుబడులు రూ.16,384.5 కోట్లుగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల ద్వారా 30,511 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే 2025 -26 మొత్తం సంవత్సరంలో అనుమతించిన పెట్టుబడి ప్రతిపాదనలు రూ. 10,237 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం ఇప్పటికే దాటిపోవడం విశేషం. పారిశ్రామికాభివృద్ధి తెలంగాణలో విస్తృతంగా విస్తరిస్తున్నట్లు గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 30,040 పారిశ్రామిక యూనిట్లకు అనుమతులు లభించగా రూ. 2.62 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, పునరుత్పాదక ఇంధనం, పారిశ్రామిక పార్కులు, ఐటి భవనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ వంటి విభిన్న రంగాల్లో భారీగా పెట్టుబడులు నమోదవుతున్నాయి. ఇక్కడ మరో కీలకాంశం ఏమిటంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. డేటా సెంటర్లు తెలంగాణ ఆర్థిక వృద్ధిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో డేటా సెంటర్లు భవిష్యత్తు డిజిటల్ మౌలిక వసతుల్లో కీలక భాగంగా మారుతున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎస్అండ్పి గ్లోబల్ తాజా అధ్యయనం ప్రకారం దేశంలో డేటా సెంటర్లకు అత్యంత ఆకర్షణీయమైన పాలసీ ప్యాకేజీని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం విశేషం. డేటా సెంటర్ పాలసీ అట్రాక్టివ్నెస్ ఇండియా సూచీలో విద్యుత్, భూమి- మూలధనం, నిర్వహణ- సాంకేతిక మద్దతు, నియంత్రణ,- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి ప్రధాన నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2016 నుంచి 11 రాష్ట్రాల్లో అమలులో ఉన్న 19 ఐటి, ఐటిఇఎస్, డేటా సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీలను ఈ విశ్లేషణలో పరిశీలించారు. ఎస్అండ్పి గ్లోబల్ తాజా అధ్యయనంలో తెలంగాణకు గుర్తింపు లభించడం వెనుక కేవలం సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పించడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పర్చడం వంటి అంశాలున్నాయి.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సమగ్ర ప్రోత్సాహకాలతో తర్వాతి స్థాయిలో ఉండగా, గుజరాత్ విద్యుత్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రత్యేకత సంతరించుకుందని నివేదిక వివరించింది. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 300 మెగావాట్ల డేటా సామర్థ్యం కార్యకలాపాల్లో ఉండగా, మరో 2 గిగావాట్ల సామర్థ్యం అభివృద్ధిలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. 2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ, విస్తృతమైన ఎఐ, డిజిటల్ మౌలిక వసతుల రంగంలో సుమారు 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి సామర్థ్యానికి చేరుకుంటామని అంచనా వేస్తోంది. ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నగరంలో ‘ఇండియా సౌత్ సెంట్రల్’ డేటా సెంటర్ రీజియన్‌ను ప్రారంభించడం కూడా మారుతున్న పరిస్థితులకు ఉదాహరణ. ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి డిజిటల్ మౌలిక వసతులు ఏర్పడటం ద్వారా డేటా సెంటర్లకు మాత్రమే కాకుండా విద్యుత్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, నిర్వహణ వంటి అనేక అనుబంధ రంగాలకు కూడా వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి.
డేటా సెంటర్లతో పాటు భవిష్యత్ పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులను సిద్ధం చేయడంపైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అభివృద్ధి వంటివి ఈ ప్రణాళికలో కీలకమైనవి. అంతర్జాతీయ పెట్టుబడుల్లోనూ తెలంగాణ పరిధి విస్తరిస్తోంది. పుష్కర కాలం కిందట ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ఆర్థిక ప్రగతిని కేవలం పెట్టుబడుల ప్రకటనలతో అంచనా వేయలేం. పరిశ్రమల విస్తరణ, ఐటి-ఐటిఇఎస్, డేటాసెంటర్లు, జిసిసిలు, ఉపాధి అవకాశాలు, పెరుగుతున్న వ్యాపార లావాదేవీలు, పన్ను ఆదాయం వంటి అనేక సూచికలను కలిపి చూస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పు స్పష్టమవుతోంది. పెట్టుబడులు వాస్తవ ఉత్పత్తి, ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలుగా మారిన కొద్దీ వాటి ప్రభావం ప్రభుత్వ ఆదాయంలోనూ ప్రతిబింబిస్తుంది. ఇవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాలిస్తే తెలంగాణను అన్ని రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలబెట్టడమే కాకుండా, స్థిరమైన ఆదాయం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదులు ఏర్పడుతాయి.
ఐవి మురళీకృష్ణ శర్మ
-
Home
-
Menu
