ముసుగులు మారాలి

Masks must change
నేరాల విషయంలో పోలీసులకు చిక్కినవారు నలుగురికి కనబడేందుకు ఇష్టపడక ముఖాలు దాచుకుంటూ వడి వడిగా వెళుతుంటారు. మీడియా కెమెరాలకు దొరకకుండా తలకు ఏదైనా అడ్డంగా పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది చేతి రుమాళ్లు, మాస్కులను వాడుతుంటారు. సమాజంలో గుర్తింపు ఉన్నవారు నేర అనుమానితుడిగా పోలీసుల పక్కన నడవడానికి సిగ్గుపడుతుంటారు. పరువు పోతుందనే భావనతో తమ ముఖాలు కనబడనీయరు. తెలిసిపోతే కుటుంబ సభ్యులకు తలవంపుగా ఉంటుందని తమ గుర్తింపును కనుమరుగు చేస్తుంటారు. సభ్యసమాజంలో పెద్ద మనుషుల్లా చలామణి అయ్యేవారి అసలు రంగు బయట పడ్డాక ముఖం చెల్లక ఇలా దాచేస్తూ ఉంటారు.
రేవ్ పార్టీల్లో దొరికిపోయినవారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. కెమెరా కంటికి చిక్కకుండా వారు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. లండన్‌లో ఉంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎందరినో మోసగించి కోట్లు కాజేసిన ఒకావిడను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. యూ ట్యూబ్ రీళ్లలో ఆమె రూపం అందరికి తెలిసినా నలుగురిలో ముఖం ఎత్తుకోలేక మాస్కును, చేతిరుమాలును అడ్డం పెట్టుకొని ఆమె జారుకున్నారు. ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో సమాచారం ప్రపంచానికి తెలిసిపోతోంది. పత్రికల్లో, టివిల్లో రాకముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది ఇలా ఉంటే, కొందరి ముఖాలకు పోలీసులే నల్లని ముసుగులు వేసి కోర్టుకు, మీడియా ముందుకు తెచ్చే సంఘటనలు చూస్తుంటాం. ఇది తప్పనిసరి అయిన చట్టపరమైన విషయం. అనుమానితుడిగా అరెస్టు అయినవారి గుర్తింపును బహిర్గతం చేయకుండా ఉంచడం పౌరుడిగా వారికి రాజ్యాంగపరంగా ఉన్న హక్కు. నేరం రుజువై కోర్టు శిక్ష విధించేదాకా ఆయన సాధారణ పౌరుడే. అందుకే ఆయన ముఖాన్ని ముసుగుతో కప్పుతున్నారు. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్‌లో సాక్షులు గుర్తుపట్టేదాకా ఈ దాగుడుమూత అవసరం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ పరేడ్ జరుగుతుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫారసుల మేరకు పరేడ్‌లో ఇతరులెవ్వరినీ అనుమతించరు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని పౌరులకు గౌరవంగా బతికే వ్యక్తిగత హక్కు ఉంటుంది. అదే ఆర్టికల్ లోని సెక్షన్ 14 ప్రకారం విచారణ న్యాయబద్ధంగా జరగాలి. అందుకే ఒకే ఎత్తూ, చిత్తూ, రంగు రూపులో ఉన్న ఐదారుగురితో అనుమానితుడిని కలిపి నిలబెడతారు. వారిలో అసలు దొంగ ఎవరో సాక్షులు కనిపెట్టాలి. అవసరమైతే వీడియో ద్వారా జడ్జి సమక్షంలో నిందితుడి గుర్తింపు పరోక్షంగా చేపట్టవచ్చు. దీని వల్ల నిందితుడి వల్ల సాక్షులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ పెరేడ్ తరవాత ముసుగు తొలగిపోవచ్చు.
తీవ్రమైన నేరాలు పాల్పడినవారిగా అరెస్టు అయినవారికి కూడా ముసుగు అవసరమవుతుంది. మాదకద్రవ్యాల రవాణా, బ్యాంకు దోపిడీ, సామూహిక అత్యాచారం లాంటి భారీ నేరాలలో పట్టుబడినవారి వివరాలు గోప్యంగా ఉంచాలని ఇలా చేస్తారు. మిగతా ముఠాలకు వీరి వివరాలు తెలియకుండా, వారు జాగ్రత్త పడకుండా ఈ దాపరికం పనికొస్తుంది. చేతికి చిక్కిన తీవ్రవాదుల ముఖాలను కూడా బయట పెట్టరు. దొరికినవారెవరు, పోలీసుల వెంట ఉన్నది తమవారే అనే వివరాలు తెలిస్తే వారిపై దాడి జరిగే అవకాశం ఉంటుంది.
రహస్యాలు బయటపెడతాడనే ఉద్దేశంతో దూరంగా నుంచైనా వారిని చంపేయవచ్చు. లైంగిక అత్యాచార నిందితులైనవారి ముఖాలు కప్పేయక తప్పదు. వారిని చూస్తే జనం ఆవేశంతో ఎంతకైనా తెగించవచ్చు. ఇలాంటి నిందితులను ముసుగుతో కోర్టులకు తీసుకెళ్ళడం సులభంగా ఉంటుంది. అవసరమైతే మరో ఇద్దరు ముగ్గురు ముసుగు డమ్మీలను వేర్వేరు వాహనాల్లో తీసికెళుతుంటారు. అసలు నిందితుడు ప్రజలకు, దాడి తలపెట్టినవారికి తెలియకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటారు.
నిందితుల ముఖాలకు కప్పే నల్ల ముసుగు ఎలా ఉండాలి అనే విషయంలో చట్టపరంగా ఎలాంటి సూచనలు, నిబంధనలు లేవు. చాలా వరకు నల్లని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇందుకోసం వాడడం చూస్తుంటాము. నిజానికి అవి తొడుక్కున్నవారిని చాలా ఇబ్బంది పెడతాయి. కళ్లు కనబడక తూలిపడుతుంటారు. కళ్లు కనబడాలని రెండు రంధ్రాలు చేసినా కవరు అటు ఇటు కదిలి చూపు ఆనని పరిస్థితే ఉంటుంది. నిందితుల ముఖాన్ని పూర్తిగా నల్ల గుడ్డతో కప్పేయడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమానవీయ చర్యగా పేర్కొంది. ఎక్కువ కాలం ముసుగు ఉండడం వల్ల ఊపిరాడక చనిపోయిన సంఘటనలు ఉన్నాయని మార్షల్ ప్రాజెక్ట్ అనే అమెరికన్ సంస్థ బయట పెట్టింది. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ ముసుగులు ప్రాణాంతకమే అని వైద్యులు కూడా అంటున్నారు.
కొన్ని దేశాల్లో కళ్ల దాకా వలలాంటి అల్లకం ఉన్న ముసుగులు వాడుతున్నారు. ఈ మధ్య మన దేశంలో కూడా వీటి విషయంలో మార్పులు చేపట్టారు. కోల్‌కతా పోలీసులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వివిధ సైజుల్లో తయారు చేయిస్తున్నారు. కళ్లు, నోరు బయటకు ఉండేలా చూస్తున్నారు. ఢిల్లీ, చండీగఢ్‌లలో కూడా సస్పెక్ట్ ఫ్రెండ్లీ మాస్కులు వాడుతున్నారు. అనుమానితులను నల్లని ప్లాస్టిక్ కవర్లతో ఇబ్బంది పెట్టకుండా ఈ ముసుగులు విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి, వైద్యుల సలహా మేరకు ఒక నిర్దిష్టమైన విధానం చేపట్టవలసిన అవసరం ఉంది.
బి.నర్సన్ 9440128169
Tags
-
Home
-
Menu
