తలసీమియా రోగులకు ఆశాకిరణం

తలసీమియా రోగులకు ఆశాకిరణం
X

పార్లమెంట్‌లో జాతీయ రక్తమార్పిడి బిల్లును ప్రవేశపెట్టడంపై తలసీమియా రోగులు స్వాగతిస్తున్నారు. రక్తసేకరణ, పరీక్ష, ప్రాసెసింగ్, నిల్వచేయడం, పంపిణీ, రక్తమార్పిడి, రక్తంలోని ప్లాస్మా (ద్రవభాగం) ఎర్రరక్త కణాలు (ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి) తెల్లరక్త కణాలు (రోగనిరోధక శక్తి), ప్లేట్‌లెట్లు (రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి) వీటిని తెలుగులో ఎర్రరక్తకణాలు (ఆర్‌బిసిలు), తెల్లరక్తకణాలు (డబ్లుబిసిలు) ప్లేట్‌లెట్లు, ప్లాస్మా అని అంటారు. ఈ రక్తం లోని ముఖ్యభాగాలను పంపిణీ చేయడం ఇవన్నీ ప్రామాణికంగా ఉండేలా ఈ బిల్లు దోహదం చేస్తుంది. రక్తసేకరణ కేంద్రాలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తారు. ఇందులో ఎలాంటి అక్రమాలు జరిగినా జరిమానా విధిస్తారు. రోగులు, కేర్ గివర్స్, వైద్యులు, నిబంధనలు లేని అడ్డగోలు రక్తసేకరణతో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును రూపొందించారు. రక్తసేకరణ నుంచి రక్తమార్పిడి వరకు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రోగికి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తలసీమియాతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులు చికిత్సకోసం వెళ్లగా హెచ్‌ఐవి సోకిన రక్తం ఎక్కించడంతో ఆ పిల్లల జీవితాలు ప్రమాదంలోపడ్డాయి. సత్నాకు చెందిన కొందరు చిన్నారులు తలసీమియావ్యాధితో బాధపడుతుండగా వారిని సత్నాలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు వారికి రక్తమార్పిడి చేశారు. 150 మందికి పైగా దాతలనుంచి సేకరించిన రక్తాన్ని మూడు వేర్వేరు బ్లడ్ బ్యాంకుల నుంచి తీసుకొచ్చి చిన్నారులకు ఎక్కించారు. ఈ రక్తమార్పిడి చిన్నారులకు ప్రాణాంతకమైంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ వ్యాధి లేకపోయినా, పిల్లలకు సంక్రమించడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. అయితే వ్యాధి సోకిన సూది వాడటం కానీ, లేదంటే కలుషిత రక్తాన్ని ఎక్కించడం గానీ ఈ వ్యాధి సంక్రమించడానికి కారణమై ఉండొచ్చని పరిశీలనలో తేలింది. ఈ ఐదుగురు పిల్లలకు అనేక సార్లు రక్తమార్పిడి చికిత్స జరిగినట్టు గుర్తించారు. ఫలితంగా బాధ్యులైన బ్లడ్‌బ్యాంక్ ఇన్‌ఛార్జ్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు విధులనుంచి సస్పెండ్ కావలసివచ్చింది. సన్నా జిల్లా ఆస్పత్రి మాజీ సివిల్ సర్జన్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సత్నా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఏడాది మార్చిలో తొలి హెచ్‌ఐవి పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 20న 15 ఏళ్ల తలసీమియా పేషెంట్‌కు హెచ్‌ఐవి పాజిటివ్ వచ్చింది. మార్చి 26 నుంచి 28 వరకు మరో ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవి పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 3న మరో కేసు నమోదైంది. ఇలా మొత్తం ఐదుగురు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడ్డారు.

గత నవంబరు నెలలో జార్ఖండ్‌లో రక్తనిధి కేంద్రం నిర్వాహకుల నిర్లక్షం వల్లనే ఆరుగురు తలసీమియా పిల్లలకు హెచ్‌ఐవి సోకింది. తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల కూడా హెచ్‌ఐవి రక్తం ఎక్కించే సంఘటనలు జరిగాయి. తలసీమియా అనేది ఎర్రరక్తకణాలను ప్రభావితం చేసే ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీనితో శరీరం అసాధారణమైన హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎర్రరక్తకణాలకు అధికంగా హానిజరుగుతుంది. ఫలితంగా రక్తహీనతకు దారితీస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సంబంధించిన జన్యువుల్లో అసహజమైన, అసాధారణమైన, జన్యులోపం తల్లిదండ్రుల వారసత్వంగా సంక్రమిస్తుంది. తలసీమియాలో మేజర్, మైనర్ అనే రెండు రకాలు ఉన్నాయి.

తలసీమియా మేజర్ ఉన్న పిల్లలు పుట్టిన వెంటనే ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ జీవితంలో మొదటి రెండు సంవత్సరాల్లోనే లక్షణాలను అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. ఇది క్రమం తప్పకుండా రక్తమార్పిడి తప్పనిసరి చేస్తుంది. మరోవైపు తలసీమియా మైనర్ గ్లోబిన్ గొలుసుల్లో ఒకటి పరివర్తనం చెందినప్పుడు సంభవిస్తుంది. ఈ పరిస్థితి ఉన్నవారు సాధారణంగా చాలా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి చికిత్స అవసరం ఉండదు. కానీ తమ ద్వారా తమ పిల్లలకు తలసీమియా సంక్రమింప చేస్తారు. తలసీమియా ఎర్రరక్తకణాల ఆల్ఫా, బీటా చైన్లను ప్రభావితం చేస్తుంది. ఆల్ఫా లేదా బీటా తలసీమియా ఉన్న తల్లిదండ్రుల నుండి ఒకటి రెండు జన్యువులు వారి సంతానానికి సంక్రమించాయా లేదా అనే దానిపై ఆధారపడి ఈ లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఏవీ కనిపించనటువంటి పరిస్థితి నుంచి తరచుగా రక్త మార్పిడికి అవసరమయ్యే ప్రాణాంతకమైన రక్తహీనత కలిగించే లక్షణాల వరకూ ఉండవచ్చు. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి వైద్యులు రోగి తాలూకు ఆరోగ్యచరిత్ర, కుటుంబచరిత్ర తెలుసుకుంటారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తలసీమియా వాహకాలుగా (క్యారియర్) ఉంటే లేదా తలసీమియా ప్రభావితమైతే అప్పుడు రక్తపరీక్ష చేస్తారు.

రక్తంలో అసాధారణ ఆకారంలో ఉన్న ఎర్రరక్త కణాలను మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. ఈ విధంగా అసాధారణ ఆకారంలో ఎర్రరక్త కణాలు ఉంటే అవి తలసీమియాకు సంకేతాలుగా చెప్పవచ్చు. రక్తంలో అసాధారణ హిమోగ్లోబిన్ తాలూకు రక్తాన్ని గుర్తించడానికి హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష చేయవచ్చు. తలసీమియా రోగి తాను బతకడం కోసం ఎర్రరక్త కణాల కోసం ప్రతి మూడు, ఐదు వారాలకు ఓసారి రక్తమార్పిడి చేయించుకోవలసిన అవసరం కలుగుతుంది. దేశంలో ఈ వ్యాధి చాలా సాధారణమైనప్పటికీ ఏటా దేశంలో 10,000 మంది తలసీమియాతో జన్మిస్తున్నారు. కొన్ని దశాబ్దాల వరకు పిల్లల్లో తలసీమియా ప్రాణాంతక వ్యాధిగా పీడించేది. కానీ ఇప్పుడు అత్యంత ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడంతో దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణిస్తున్నారు. అనేక సమస్యల కారణంగా, మరీ ముఖ్యంగా శరీరంలో ఐరన్ ధాతువు విపరీతంగా ఉండడంతో రెగ్యులర్‌గా, జీవితాంతం రక్తమార్పిడి చేయించుకోవలసి వస్తోంది. అలా తొలగించుకుంటేనే కానీ బతకడం కష్టమవుతోంది. వైద్య, ఆరోగ్యభద్రత సరిగ్గా నిర్వహిస్తే నలభై, ఏభై ఏళ్లు దాటినా బతికించడం సాధ్యమౌతుంది. అయితే ఇది చాలా వ్యయంతో కూడుకున్న ప్రక్రియ. ఈ కారణాల వల్ల మన దేశంలో తలసీమియా రోగులు కేవలం 50% మందే 25 ఏళ్ల తరువాత బతకగలుగుతున్నారు. సామాజిక, ఆర్థిక, పరిస్థితులు చాలా బలహీనంగా ఉండే వారిలో ఈ తలసీమియా నివారణ చాలా కష్టమవుతోంది.


డా. బి.రామకృష్ణ

99599 32323

Tags

Next Story