‘సాగు’ను ముందుకు సాగనిద్దాం

‘సాగు’ను ముందుకు సాగనిద్దాం
X

స్వాతంత్య్రానంతరం దేశ వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా ఆహార స్వయం సమృద్ధిని సాధించడం వైపుగా సాగింది. అందుకు అనుగుణంగా దేశ బడ్జెట్‌లో గణనీయమైన భాగాన్ని గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయోత్పత్తిని పెంచడానికి కేటాయించబడ్డది. అప్పటి దేశ సాగు లక్ష్యాలకు అనుగుణంగా దేశసాగులో గణనీయమైన విజయాలు సాధించి, నేడు దేశ ఆహార భద్రతకు ఎలాంటి లోటు లేకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సవృద్ధ్దిని సాగించగలిగాం. అయితే, ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణం అనేక సమస్యలకు మూలకారణమవుతున్నాయి. ఈ రెండింటి ప్రభావం ప్రతి రంగంపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి. అందులోను వ్యవసాయ రంగం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అత్యంత దుర్బలమైనది. వాతావరణంలోని మార్పులు సాగులో చూపే ప్రభావాలను మనదేశంలో నేడు మనం ప్రత్యక్షంగా అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, చలిరూపంలో చూస్తున్నాం. వీటి వల్ల రైతాంగం అనేక రకాల సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం భారతదేశంలోని 75% కంటే ఎక్కువ జిల్లాలు వరదలు, కరువులు, వేడిగాలులు, తుఫానుల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలకు గురవుతున్నాయి.

ఇక మన రాష్ట్రంలో కూడా ఈ ప్రభావాలు ప్రస్తుతం నిత్యకృత్యమవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాల లోటుతో మొదలై చివరిలో అధిక వర్షాలతో చేతికివచ్చిన పంటలు క్షణాల్లో అధిక వర్షాల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నాబ్కాన్స్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 2020- 2022 కాలంలో వివిధ రకాల పంట ఉత్పత్తులలో పంటకోత తర్వాత ఇంచుమించు 3%15% వరకు నష్టం జరువుతుంది. ఇది దాదాపుగా 68.90 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యం కాగా, దాని వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ. 1.5 లక్ష కోట్లుగా అంచనా. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సమస్యలు రైతులను నిత్యం వెంటాడుతున్నాయి. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం కొనసాగుతుంటే, మరోవైపు దేశ సాగు సామర్ధ్యాన్ని, సాగు తోడ్పడే వనరులను వినియోగించడంలో ఆశించిన రీతిలో ముందుకు సాగలేకపోతున్న. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో సరైన వర్షాలు కురవక పోవడంవల్ల విత్తిన విత్తనాలను మొలకెత్తడానికి రైతులు నానాతిప్పలు పడడం కళ్లారా చూసాం.

నేటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కాలంలో కూడా రైతులు కనీస విత్తిన పంటను మొలకెత్తించుకో లేకపోతున్నారు అంటే అందుకు మన వ్యవసాయ సాగునీ అసమర్థ నిర్వహణను చూసిస్తుంది. అందులో ప్రధానంగా, దేశ సేద్యపు నీటి పారుదల సామర్థాన్ని చూస్తే దేశంలో దాదాపు 139.5 మిలియన్ హెక్టార్ల నీటిపారుదల సామర్థ్యం ఉంది. అయితే, 2021 నాటికి వినియోగించుకున్న సాగునీరు దాదాపు 76 మిలియన్ హెక్టార్లకు మాత్రమే. ఇది మొత్తం సాగులో దాదాపు 55% మాత్రమే. నేటికీ దేశంలో సుమారుగా 45% సేద్యం వర్షాధారంగానే సాగుతుంది. అందువల్ల వర్షాలు కురవడంలో ఏ చిన్న మార్పు వచ్చిన పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఇక సాగునీటి వినియోగ పద్ధతులను చూసినట్లయితే దేశ నీటిపారుదల వనరులలో గొట్టపు బావులు అత్యంత ముఖ్యమైనవి. తరువాత కాలువలు, సాంప్రదాయ బావులు, ట్యాంకులు, స్ప్రింక్లర్, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి. ఇక విఫణి వ్యవస్థ చూస్తే, పంట కోత తర్వాత సరైన మార్కెట్ సదుపాయాలు కీలకం. రైతులు పండించిన ధాన్యాన్ని సరైన సమయంలో సరైన వేదికలు, సరిపడ దూరంలో మార్కెట్లు ఏర్పాట్లు చాలా ప్రాముఖ్యమైనవి.

జాతి రైతు కమిషన్- 2006 ప్రకారం దేశ సాగు ఉత్పత్తి అవసరాలకై ప్రతి 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒక నియంత్రిత మార్కెట్ ఉండాలి. కానీ ప్రస్తుతానికి దేశంలో సగటు 407 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఒక నియంత్రిత మార్కెట్ సేవలు అందిస్తుంది. దేశం మొత్తంమీద నియంత్రిత టోకు మార్కెట్లు దాదాపుగా 7085 కాగా, అందులో 2599 ప్రధాన మార్కెట్ యార్డులు (పిఎంవై), 4486 ఉప-మార్కెట్ యార్డులు (ఎస్‌ఎంవై) ఉన్నాయి. ఇక తెలంగాణలో మొత్తం 282 నియంత్రిత మార్కెట్ల ఉండగా, అందులో 195 ప్రధాన మార్కెట్ యార్డులు (పిఎంవై), 87 ఉప-మార్కెట్ యార్డులు (ఎస్‌ఎంవై) ఉన్నాయి. రాష్ట్రంలో మార్కెట్ల సాంద్రత చూసినట్లయితే సుమారుగా 397 చదరపు కిలోమీటర్లకు కేవలం ఒక నియంత్రిత మార్కెట్ మాత్రమే ఉంది. ఈ విధంగా రైతులకు సరిపడా మార్కెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతు పండించిన పంటను దీర్ఘకాలం నిల్వ చేసుకోలేక దళారులకు కనీస మద్దతుకంటే తక్కువ అమ్ముకుంటున్నారు. మరొక అంశం సాగులో యాంత్రీకరణ, దేశ సాగు నేటికీ ఆధునిక సాగుకి ఆమడదూరంలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సాగులో యంత్రీకరణ 80 90 శాతం ఉండగా, మన దేశంలో మాత్రం సాగులో యంత్రీకరణ నేటికీ కేవలం 45% మాత్రమే ఉంది.

ఒకవైపు సాగుకు సరిపడా వ్యవసాయ కూలీలు గ్రామాల్లో క్రమంగా తగ్గడంతోపాటు, వ్యవసాయ కూలీల రోజువారీ కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దేశంలో ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సాగులో నిర్మాణాత్మకమైన మౌలిక సదుపాయాలు అత్యంత ప్రముఖమైనవి. దేశ వ్యవసాయం వైవిధ్యతకు అనుగుణంగా, చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొనే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సాగులో మౌలిక సదుపాయాలు, నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించి దేశంలో ఉన్న ప్రతి వనరులను ముఖ్యంగా నీటి వనరులను సమర్ధవంత వినియోగించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రతి నీటి బిందువును సమర్ధవంతగా సాగుకు వినియోగించే విధంగా కృషి చేయాలి. అంతేకాక, పంట విత్తినప్పటి నుండి పంటకోత తర్వాత వివిధ స్థాయిలలో నష్టాలను అరికట్టేందుకు నిర్మాణాత్మకమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహిస్తే చిన్న సన్నకారు రైతుల కష్టాలను కొంతవరకు తగ్గించవచ్చు.


డా. రేపల్లె నాగన్న

7990842149

Next Story