డాక్టర్ల ప్రచారంలో నైతిక సూత్రాలు

డాక్టర్ల ప్రచారంలో నైతిక సూత్రాలు
X

వైద్య ప్రచారంలోని వింతపోకడలను అరికట్టేందుకని జాతీయ వైద్య కమిషన్ కొత్త మార్గదర్శక సూత్రాలు అంటూ ఓ చిట్టాను ఈ మధ్య విడుదల చేసింది. ఈ కమిషన్ 2023 లో కూడా దేశంలో వైద్యులందరూ అనుసరించవలసిన నియమ నిబంధనల పట్టికను విడుదల చేసింది. వైద్య విద్య, ఆసుపత్రుల నిర్వహణ, రోగులకు సేవలు అందించే డాక్టర్ల విధి విధానాలు.. తదితర అంశాలపై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం 2020 లో జాతీయ వైద్య కమిషన్‌ను విడిగా ఏర్పాటు చేసింది. 1956లో వచ్చిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం పరిధిలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఆధీనంలో ఇది పని చేస్తుంది. వైద్య వృత్తిలో నైతికతను, నిజాయితీని కాపాడే దిశగా దీని పర్యవేక్షణ ఉంటుంది. 2023లో విడుదల చేసిన ఉత్తర్వులోనే చాలా విషయాలు వివరంగా పేర్కొనబడ్డాయి. మన వైద్యులు వీటిని సరిగ్గా పాటిస్తే చాలు, దేశంలోని వైద్యరంగానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకొనే వీడియోల్లో ఎలాంటి తప్పుడు సమాచారం ఉండకూడదు. తమ వద్ద చికిత్స తీసుకున్న రోగి వివరాలు, లక్షణాలు బహిరంగ పరచకూడదు. మీడియా ప్రోగ్రాంలో ప్రశ్న వేసే వారి వివరాలు బయటపెట్టవద్దు. చికిత్స తీసుకోవాలంటే వ్యక్తిగతంగా కాని, ఆన్‌లైన్‌లో గాని సంప్రదించమని మాత్రమే చెప్పాలి. రోగి ఫోటోలను, ఆయన మెడికల్ రిపోర్టులను తెరపై చూపించకూడదు. తమ పక్కన పేషంట్లను ఉంచి వారిచే డాక్టర్ చికిత్సపై అభిప్రాయాన్ని, వ్యాఖ్యానాలను కోరవద్దు. తమ చికిత్స ద్వారా ఆరోగ్యవంతులైన వారి ఫోటోలను, వారు రాసిన అభిప్రాయాలను తెరపై చూపవద్దు. తమకు తెలిసిన వైద్య విషయాలు, చికిత్సలో వస్తున్న నూతన విధానాలు ప్రజలకు విషయ పరిజ్ఞానం పెంచేందుకు చెప్పవచ్చు తప్ప ఇతర విషయాలు అందులో చేర్చవద్దు. పత్రికల్లో, టివి ప్రసారాల్లో, వెబ్ సైట్లలోనే కాకుండా వ్యక్తిగత వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

గీత దాటిన వారికి ఉల్లంఘన స్వభావం, తీవ్రతలను బట్టి వివిధ రకాల జరిమానాలు ఉంటాయి. అవసరమైతే జరిమానాలే కాకుండా మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ రద్దు దాకా కూడా చర్యలు ఉండవచ్చు. అయితే వీటిని డాక్టర్లు పెద్దగా పట్టించుకొనే దాఖలాలు లేవు. చర్యలు చేపట్టిన సందర్భాలు కూడా నామమాత్రమే. ‘40 ఏళ్లుగా దేశంలోనే అత్యంత నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ ఇస్తున్నది’ అని ఒక ప్రముఖ హాస్పిటల్ ఇచ్చిన పత్రికా ప్రకటనను చెన్నై మెడికల్ కౌన్సిల్ మూడేళ్ళ క్రితం తప్పుపట్టింది. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ఇలాంటి పత్రికా ప్రకటన్లను తప్పు పడుతూ అదే చోట అంతే సైజులో సవరణ ప్రకటనను ఆయా హాస్పిటళ్లతో ఇప్పించింది. ఆ ప్రకటనలో కనిపించిన డాక్టర్లపై చర్యలు చేపట్టింది. ఇద్దరు వైద్యుల ఫోటోలు, వారి ఫోన్ నంబర్లు ఇస్తూ ముంబైలోని హాస్పిటల్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో ప్రకటన ఇచ్చినందుకు ఆ వైద్యులకు ముంబై మెడికల్ కౌన్సిల్ నోటీసులు పంపింది. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇలా డాక్టర్లపై చర్యలు తీసుకున్న వార్తలున్నాయి.

డాక్టర్లు మందులు, వైద్య పరికరాలకు చెందిన వ్యాపార ప్రకటనల్లో పాల్గొనకూడదని వారి ప్రొఫెషనల్ కండక్ట్‌లో ఉంది. డాక్టర్ పేరు, సంతకం, ఫోటో వైద్య సేవల, ఉత్పత్తుల, ఆసుపత్రుల ప్రచారానికి వాడకూడదు. డాక్టర్ గది తలుపుకు ఉండే బోర్డుపై కూడా ఆయన పేరు, చదువు తప్ప ఫోటో ఉండకూడదు. ఇది వృత్తి పట్ల డాక్టర్లు పాటించవలసిన నీతికి సంబంధించిన విషయం. ఇలా నీతి నియమాలు ఎన్ని ఉన్నా వీటి ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పనవసరం లేదు. టివిల్లో ఎంతో కాలంగా వస్తున్న ‘డాక్టర్ సలహాలు’ కార్యక్రమాలు వాణిజ్య ప్రకటనలుగా రూపాంతరం చెందాయి.

ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సౌలభ్యంతో డాక్టర్లు స్వయంగా తమ వివరాలు తెలుపుతూ వీటి ద్వారా ఉధృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. సొంత వెబ్ సైట్లు ఏర్పడ్డాయి. ఎవరిష్టమైన సమాచారం వారు పోస్టు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో మాట్లాడేది మనం ఎంచుకున్న పేరు, అర్హతలు, అనుభవం గల డాక్టరేనా అనేది స్పష్టపడదు. ఇవేమీ పట్టించుకోని విధంగా సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరిగిపోతోంది. డాక్టర్, హాస్పిటల్ సైట్లో ఉండే వీడియోల్లో చెప్పే మాటల్లో నిజమెంతో గాని చూసి నమ్మేవారి సంఖ్య ఎక్కువే ఉంటోంది. ఒక ఆరోగ్య సమస్యపై గూగుల్‌లో వెదికితే చాలు వాసన పట్టేసినట్లు అన్ని రకాల సామాజిక మాధ్యమాలు ఆ సమాచారంతో మన వెంట పడతాయి. ఇలా వైద్య వ్యవస్థ దారి తప్పి నైతిక నిబంధనలకు పొంతన కుదరకుండా పోయింది.

విచిత్రమేమిటంటే మూడేళ్ళ క్రితం ఇచ్చిన నిబంధనల ఉల్లంఘనయే ఘనంగా సాగుతోంది. మళ్ళీ కొత్త మార్గదర్శక సూత్రాలతో ప్రభుత్వం సాధించేదేమిటో అర్థం కాదు. ఆసుపత్రుల, వైద్యుల వాణిజ్య ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఇందులో ఉన్నాయి. చికిత్సకు ముందు, చికిత్సకు తరువాత అని కొన్ని ఛానళ్లలో వైద్య కార్యక్రమాలు ఊదరగొడుతున్నాయి. ఇది తప్పని కొత్త నిబంధన చెబుతోంది. సెలబ్రెటీలతో హాస్పిటళ్ళ ప్రచారం జోరుగా సాగుతోంది.

హాస్పిటల్ ఆవరణలో సెలబ్రెటీల ఫ్లెక్సీలు కనబడుతుంటాయి. ఈ విధానానికి తెర పడాలి మరి. పేషంట్లను రెఫర్ చేసినందుకు ఏ వ్యక్తికి గాని, సంస్థకు గాని కమిషన్లు ఈయకూడదు అనేది ఒక ప్రధాన అంశం. గ్రామాల్లోనో, పట్టణాల్లోని డాక్టర్లకు రెఫర్ విధానం ఓ ఆదాయ మార్గం. దీన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు తమ వ్యాపారం కోసం పెంచి పోషిస్తున్నాయి. ఇది నేరమైనా నిరూపించడం సాధ్యం కానిది. మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా చితికివేస్తున్న సామాజిక రుగ్మతల్లో నేటి వైద్యం ఒకటి. నియమ నిబంధనలు కాగితాల్లోకి వస్తే ప్రయోజనం శూన్యం. వాటిని కఠినంగా అమలుచేస్తేనే ప్రజలు హర్షిస్తారు.


బి.నర్సన్ 9440128169

Tags

Next Story