ఎన్నికల తీరు మారితేనే కల నెరవేరేది!

‘తెలంగాణలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడిగా నడుస్తున్నది. ఎన్నికలు మూడు దశల్లో నడుస్తున్న తరుణంలో ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు కాలంతో పోటీపడి పనిచేస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రెండు సంవత్సరాల నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన సమస్యలకు పరిష్కారాల్ని చూపే అసలైన గ్రామ స్వపరిపాలన కోసం పల్లెలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు 1 కోటి 60 లక్షల ఓటర్లతో ఎన్నికల రణరంగం సిద్ధమైనది. గ్రామంలోనే దేశం ఉంది. అవి అంతరించిపోతే దేశమే అంతమయ్యే ప్రమాదం ఉన్నది. పల్లెసీమలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలా నడవాలంటే ఎన్నికల ప్రక్రియనే కీలకం. అలాంటి కీలకమైన ఈ దేశ ఎన్నికల ప్రక్రియలో గ్రామస్థాయినుంచే సమూలమైన మార్పులు తేవాలి. కానీ మన దగ్గర అది పంచాయతీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా వాటి తీరు ‘ప్రలోభాల’ పర్వమే తప్ప ప్రగతి సూత్రంగా లేదు.రోజులు గడుస్తున్నా కూడా పార్టీల జెండాలే తప్ప ప్రజా ‘ఎ’జెండాలు ముందుకు వెళ్లే పరిస్థితులు కనబడడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా, నాయకుడి ఎంపికలో నిర్ణయాత్మకమైన శక్తిగా నిలిచే ‘ఓటు’ను డబ్బుతో, మద్యంతో, పరపతి, ప్రలోభాలతో చట్టవిరుద్ధమని తెలిసిన కూడా యథేచ్ఛగా లాక్కుంటున్నారు. ప్రజల నిజాయితీని పక్కదారిపట్టించి ప్రలోభాల రొంపిలోకి దించారు. వీరి ప్రవర్తన, విధానాల వలన ఈతరమే కాదు భవిష్యత్తు తరాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఈ ధోరణి ఇప్పటికే సమాజంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఇలానే కొనసాగితే రానురాను ఎటువైపు దారి తీస్తుందో..? ఏ రూపు దాలుస్తుందో..? రేపటికి ఏ సంకేతం ఇస్తుందో..?
ఊహిస్తేనే ఆందోళన కలిగిస్తున్నది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే మరింత ప్రమాదంలోకి నెట్టుతున్నది. వీటన్నిటికి మన రాజకీయ పార్టీల ఎన్నికల విధానాలు, వైఖరినే కారణం. స్వరాజ్యం కొద్దిమంది అధికారాన్ని చేజిక్కించుకున్నంత మాత్రానరాదు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకున్నచోట అడ్డుపడనప్పుడు మాత్రమే వస్తుంది. నేడు ఆ స్వరాజ్యం లేదు.. రాజ్యం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి అధికార దుర్వినియోగానికైనా సిద్ధపడడమే ఉంది. వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు, పొత్తులు, జిత్తులు, జిమ్మిక్కులు, రాజకీయాల సహజ స్వభావాన్ని మార్చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు మారుతారో.. అధికార దాహం కోసం ఏం చేయడానికి అయినా ఎలా సిద్ధపడతారో ఎవరికి అర్థం కానీ స్థితి ఉన్నది. ఈనాటి రాజకీయ ప్రక్రియలో తమ స్వార్థం, రాజకీయ దాహం తప్ప ప్రజల కోణం లేదు. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం, స్వప్రయోజనాలే కానీ మంచికి మానవత్వానికి, నీతికి, నిజాయితీకి అవకాశం లేదు అన్నట్టుగా ఉంది.
నేటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే, సామాన్యుడికి రాజకీయాల్లో స్థానం లేదని, భవిష్యత్తులో కూడా రాదని స్పష్టంగా కనబడుతున్నది. ఎన్నికల్లో పోటీకి నిలబడితే ఏం చేస్తావు..? ఎలా చేస్తావు..? అని అడిగే పద్ధతులు పోయి నీ వద్ద ఎన్ని పైసలు ఉన్నాయి..? ఎంత పెడతావు..? ఎంత ఇస్తావు..?అని బహిరంగంగా మాట్లాడే దుస్థితికి వచ్చింది. అభివృద్ధికి పాటుపడే వ్యక్తుల విధానపరమైన ప్రవర్తన, పని విధానం, నిజాయితీ, నిబద్ధతలను పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థుల కుల, ధన, బల, బలగాలను బేరీజు వేసుకొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా నడిచే దుస్థితి ఉన్నది. అభ్యర్థులను ఎంపికచేసే దగ్గర కూడా కొద్దిమంది వ్యక్తులే కూర్చొని శాషిస్తూ అభ్యర్థుల భవితవ్యాన్ని ఖరారు చేసే రాచరికపు పోకడలకు నిలయంగా మారింది. చివరికి విలువలతో బతకాల్సిన విద్యావంతులు సైతంజెండా, ఎజెండాలు ఏమీ లేక ఎవరికి పడితే వారికి జై కొట్టే అయోమయ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా సమాజ అభివృద్ధికి పురోగమనం కాదు తిరోగమనమే.
మనదేశంలో రాజకీయ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. ఎలక్షన్ అంటేనే కలెక్షన్ అన్నట్టుగా ఎంత పెట్టాలి..? గెలిచిన తర్వాత తిరిగి ఎంత రాబట్టాలి ..? అని ముందే లేక్కలు వేసుకొని రంగంలోకి దిగే పరిస్థితులు వచ్చాయి. సేవ చేసేందుకు కాదు సంపాదించేందుకే రాజకీయాలను వాడుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి, గుణగణాలు, వయస్సు తదితర రాజ్యాంగ నియమాలకు సంబంధించిన హక్కులు పోయి ‘డబ్బే’ ప్రధాన హక్కుగా నేడు మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ఉండాలి, డబ్బు ఉన్నోళ్లే కావాలి అనే పరిస్థితులు వచ్చాయి. డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సామాన్యులకు రాజకీయాల్లో స్థానం లేదని, భవిష్యత్తులో కూడా రాదనేది అక్షర సత్యం.
కాళోజీ లాంటి మహనీయులు జరుగుతున్న తీరును గమనించే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటివాడో చూడు, ఎన్నుకుంటే ఏం చేస్తాడో కాదు ఇప్పటివరకు ఏం చేశాడో చూడు, పెట్టిన టోపీని కాదు.. పెట్టే టోపీని చూడు అంటూ చైతన్యం చేశాడు. అయినా ప్రజలు చైతన్యం కాలేదు.. ప్రజల్ని విభజించి వారి ఆలోచన శక్తిని చంపి తమ అనుచరులుగా మలుచుకున్నారు. కాబట్టే పార్టీల జండాలే తప్ప వారికి మరొకటి అర్థం కాదు. వారి అభివృద్ధి, అభ్యున్నతి ఆలోచన రాదు. అందుకే ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడనే మిగిలారు. అభివృద్ధి కూడా అలానే మిగిలింది. కానీ మనల్ని ఏలే నాయకులు మాత్రం కోట్లాది రూపాయలకు అధిపతులుగా మారారు. అందువల్లనే నాయకుల్లో ఎదుగుదల ఉన్నది కానీ ప్రజల్లో ఎదుగుదల లేదు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకోబడే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారి నిర్ణయాధికారం మీదనే పాలన వ్యవస్థ ఆధారపడి ఉన్నది. కానీ ప్రజలు ఆ నిర్ణయాధికార శక్తి ఏంటో..? ఒక్కసారి ఉపయోగిస్తే ఎలా ఉంటుందో..? ఎలాంటి మార్పులు తెస్తుందో.. తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించడం మాని దీర్ఘకాలిక ప్రయోజనాలు మార్పుపై దృష్టిపెటి ప్రజాస్వామ్యయుతంగా, విశ్వజనీయమైన, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత పద్ధతిలో ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుంటే మహోత్తరమైన మార్పులు ఎన్నో జరుగుతాయి. ఆ మార్పులన్నింటికీ వజ్రాయుధం మన ఓటే. నా జాతి ప్రజలకు కత్తిని ఆయుధంగా ఇవ్వలేదు.. ఓటునే ఆయుధంగా ఇచ్చాను, పోరాడి రాజులవుతారో లేక ఓడిపోయి (అమ్ముకొని) బానిసలు అవుతారో తేల్చుకోవాలని అంబేద్కర్ సందేశం ఇచ్చారు.. ఓటు హక్కు సాధించిన అనంతరం ఓటు ఆవశ్యకతను, అవసరతను వివరించారు. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో ఓటు హక్కు వచ్చి 75 ఏళ్లు దాటిన కూడా ఇంకా ఓటు అవసరతను, ఆవశ్యకతను ప్రజలు గ్రహించడం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని రాజ్యాంగ సంస్థలు, అధికారులు ఓటుపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫోటో వరకే పరిమితమై చైతన్యం తెచ్చామంటే కాదు ఫోటో షూట్లు మానీ అధికార యంత్రాంగమంతా పల్లెబాట బట్టి ప్రజలకు ఓటు ఆవశ్యకతను వివరించాలి. ‘ఓటర్లు చైతన్యమైనప్పుడు మాత్రమే పరిపాలన వ్యవస్థలో కానీ, పాలకుల ఆలోచన ధోరణుల్లో కానీ మార్పు వస్తుంది. ఓటరులో మార్పు రానంత కాలం సమాజంలో మార్పురాదు..’ కాబట్టి ఓటరు పూర్తిగా మారాలి.. ఆ దిశగా మార్పు జరగాలి. నాయకుడి ఎంపికలో ఓటరే కీలకమైనప్పుడు అసమర్ధున్ని ఎన్నుకొని బాధపడే కంటే ఎన్నికకు ముందే అన్ని ఆలోచించి సమర్థవంతమైన నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలో మార్పుతో పాటు ప్రజల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రశ్నించే స్వభావం పెరుగుతుంది. పాలనలో కూడా జవాబుదారీతనం ఉంటుంది. పాలన సరిగ్గా చేయకపోతే ప్రజలు నిలదీస్తారని భయం పాలకుల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ ఓటు మీదనే ఆధారపడి ఉంది.
ఇది జరగాలంటే ప్రస్తుత రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. స్వార్థంతో కాదు సామాజిక బాధ్యతతో పరిపాలించే వ్యవస్థ రావాలి. ప్రజలకు జవాబుదారీగా లేకుంటే, ప్రజలు వద్దనుకుని పాలకులను నేరుగా తొలగించే ‘రీకాల్ సిస్టం’ రావాలి. మన రాజకీయ వ్యవస్థలో వారసత్వ పోకడలు పోవాలి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్నట్టుగా పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రెండుసార్లు మాత్రమే పోటీ చేసేలా నిబంధనలతో పకడ్బందీ చట్టాన్ని తేవాలి. రాజకీయాల్లో యువతరం, కొత్త రక్తం ఎదిగేలా ప్రోత్సహించాలి. ప్రజల్లో రాజకీయాలపై పేరుకుపోయిన చెత్తను, భ్రమల్ని పోగొట్టాలి. క్షేత్రస్థాయిలో వీటిని ఆచరణలో అమలు చేయాలి. అలా సంస్కరించినప్పుడే రాజకీయాలు రేపటి తరానికి ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.. ఇలా జరిగినప్పుడే ధనంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం ఒక సామాన్యుడు కూడా సమాజం కోసం పాటుపడతాడని, సేవ చేస్తాడనే విశ్వాసం పెరుగుతుంది. పార్టీలు సైతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్హత సేవా గుణమే కానీ ధనం కాదని గుర్తిస్తే, సంపాదన కోసం కాదు సమాజ బాగు కోసమే రాజకీయాలు అన్నట్టుగా మారితేనే అవి నీతివంతమైన రాజకీయాలు అవుతాయి. వాటివల్ల రేపటి తరానికి మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా సమన్యాయం, సామాజిక న్యాయం అందుతుంది. కావున రేపటి తరం నిలబడాలంటే ఎన్నికల తీరు పూర్తిగా మారాలి, అది పంచాయతీ ఎన్నికల నుండే ప్రారంభం కావాలి. ఆ దిశగా పాలకవర్గం క్షేత్రస్థాయిలో పలు సంస్కరణలు తీసుకురావాలి. అలా చేస్తేనే ఎన్నికల తీరు మారుతుంది. ప్రగతి వైపు నడుస్తుంది.
రాగల్ల ఉపేందర్ (మాదిగ)
-
Home
-
Menu
