13కోట్ల జీవన్మృతుల దేశం నిరసన

13కోట్ల జీవన్మృతుల దేశం నిరసన
X

దేశం ఇప్పుడు అట్టుడుకుతున్నది. మన దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగం యథేచ్ఛగా, ఎలాంటి జంకూగొంకు లేకుండా ఉల్లంఘించబడుతూ వుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కుల అణచివేత నిరంతరం సాగుతున్నది. దేశం అంతటా మతోన్మాదాన్ని, విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విభజిస్తున్నారు. విద్యార్థులకు సరైన బడులు, చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు లేవు. యువత భవిత గాఢాంధకారంలో వుంది. రైతులు, కార్మికులు, మహిళలు, దళితులూ, ఆదివాసుల స్థితి దారుణంగా వుంది. మొత్తం మీద ప్రజలు ఎవరూ నిశ్చింతగా లేరు.

ఇలాంటి మాటలు ఒకప్పుడు ఎవరో కొందరి మేధావుల అతి అంచనాలు లెమ్మని అనుకున్నా ఇప్పుడు ఎవరూ అలా అనడం లేదు. కానీ అందరిలో దేశం ఎందుకు ఇలా తయారు అయింది? అని అనిపించినా అడగలేని భయం మాత్రం అంతటా అలముకున్నది. నిరాశ, భయం ఇక ఇంతే అనుకుంటున్న సమయాన, జన్ జీ తరం నిశ్చల తటాకంలో రాయి విసిరి ప్రకంపనాలు సృష్టించిన చందాన, సమాజంలో నూతన ప్రభంజనాన్ని, కదలికల్ని తీసుకు వచ్చింది.

ఇప్పుడిక నిశ్శబ్దం భళ్ళున బద్దలైంది. భయం బారికేడ్లను ఒక్క తాపు తన్ని నిలబడింది. ఒదిగి, నోరు మూసుకు బతకమన్న ఆడపిల్లలు వీధుల్లోకి వచ్చి పులుల్లా గర్జిస్తున్నారు. కాటికి కాలు చాపాల్సిన వయసు వృద్ధులు చేతి కర్రలు, చక్రాల కుర్చీలెక్కి ధర్నాలకు, సభలకు వచ్చి పిల్లల పక్కన నిలబడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కాదు. హమ్మయ్యా ఇప్పటి కన్నా ఏమి జరగాలో అది ఈ దేశంలో మొదలవుతూ వుంది అనే మాటలు, దేశం అంతటా వినబడుతున్నాయి. పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రజాస్వామిక వ్యవస్థలను, దేశాన్ని రక్షించుకోవడం ఇవ్వాల్టి తక్షణ అవసరం అని అనేక మంది గుర్తించడం మొదలైంది.

అక్టోబర్ 10 జంతర్ మంతర్ నిరసనను జంతర్ మంతర్ 2.0గా పిలుస్తునారు. ఈ పోరాటం ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అన్న అంశం చుట్టూ జరుగుతూ వుంది. గత కొన్ని రోజులుగా అనేక విద్యార్థి సంస్థలు, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి), ప్రతిపక్ష పార్టీలు, సివిల్ సొసైటీ సంస్థలు కలిసి దేశమంతటా ఆందోళనలు చేస్తున్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్, ముంబై శివాజీ పార్క్, బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ వంటి చోట్ల ఈ ధర్నాలు, ఊరేగింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

జంతర్ మంతర్‌లో జరిగే ధర్నా సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాలు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఐక్యంగా ఒక ప్రకటనను ఇచ్చాయి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారించాలని, సర్ నిలిపివేయాలని, జనవరి 2025 ఓటరు జాబితా పునరుద్ధరణ చేయాలనీ, అన్ని అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని, 2023 నియామక చట్టం రద్దు చేయాలనీ వాళ్ళు డిమాండు చేశారు. “ప్యాక్ యువర్ బ్యాగ్స్, ఇది సుదీర్ఘ పోరాటం” అని పిలుపునిచ్చారు. జన్‌జీ, విద్యార్థి సంస్థలు, ఇండియా బ్లాక్, పౌర సమాజం అందరం ఒకే వైపు నిలబడి, ఐక్యంగా పోరాడితే విజయం సాధిస్తాం అని విద్యార్థి నాయకురాలు నేహా బోరా అన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్). 2025 జూన్‌లో బీహార్‌లో ప్రారంభమై, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ ప్రక్రియ అసలు ఉద్దేశం, అధికార బిజెపి పార్టీకి ఉన్న హిడెన్ ఎజెండా వేరని, ఏమాత్రం పారదర్శకత లేని ప్రక్రియ ఇదని, దీనిని నిలిపివేయాలని మొదటి నుండి మేధావులు, ప్రతిపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు వారు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. వాళ్ళు ఇది ఓటు చోరీకి మార్గం అని విమర్శించారు. సరైన డాక్యుమెంట్లు లేని వారు అనే పేరుతో ముఖ్యంగా పేద, మైనారిటీ, మహిళా, వలస కార్మికులు ఎక్కువగా తొలగించబడ్డారు. అలాగే ఫారం 6 లో అనధికారిక మార్పులు చేసి, కొత్త ఓటర్ల నమోదును మరింత కష్టతరం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి చోట్ల ప్రారంభ దశలోనే 10 -35 శాతం వరకు ఓటర్ల తగ్గింపు జరిగింది.

బీహార్‌లో మొదటి దశలో సుమారు 47 లక్షల తగ్గింపు అంటే 9 శాతం, రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 7.2 కోట్ల తొలగింపులు జరిగాయి. మూడవ దశలోనూ ఇప్పుడు లక్షల్లో తగ్గింపు కొనసాగుతోంది. మొత్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 13కోట్లకు పైగా ఓటర్ల తొలగింపులు జరిగాయి. ఈ మొత్తం ప్రక్రియ ముగిసే నాటికి ఎన్ని లక్షల, కోట్ల మంది తొలగించబడతారో వేచిచూడాలి. 2026 సెప్టెంబర్‌లో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ రిపోర్టర్ రితికా చోప్రా బృందం ఎన్నికల కమిషన్ అంతర్గత నోట్స్, లేఖలు, అధికారులతో ఇంటర్వ్యూలు ఆధారంగా ఒక కథనాన్ని తయారు చేసింది.

మొత్తం మీద ఈ పరిశోధన బయటపెట్టిన తిరుగులేని ఆధారాలు, ప్రతిపక్షాలనుంచి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. అవకతవకలపై విచారణ డిమాండ్లకు దారితీసింది. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, కమిషన్ స్వతంత్రతపై, పని తీరుపై తీవ్రమైన అనుమానాలను, అనేక ప్రశ్నలను లేవనెత్తింది. జ్ఞానేశ్ కుమార్ 1988 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఎఎస్ అధికారి. 2024లో ఎలక్షన్ కమిషనర్‌గా, 2025 ఫిబ్రవరిలో సిఇసి గా నియమితుడయ్యారు. అతనిపై మొదటి నుండి ఆర్థిక అవినీతి ఆరోపణలున్నాయి. జమ్మూకశ్మీర్‌తో సహా, అనేక కీలక విషయాలలో బిజెపికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ బిజెపి విశ్వాసపాత్రుడు అతడని అంటారు. అందువల్లే ప్రతిపక్షాలు జ్ఞానేశ్‌ని కోట్లాది ఓటర్ల పేర్లు తొలగించిన, ఏ మాత్రం పారదర్శకత లేని డిక్టేటర్ పాలకుల తొత్తు అనీ, మోడీ ప్రభుత్వం కీలుబొమ్మ, ఓటు చోరీకి ముఖ్య వాస్తుశిల్పి అని ఆరోపిస్తున్నాయి.

ఇప్పుడిక రెండవ దశ ఆందోళన ప్రారంభం అయింది. సెప్టెంబర్ 25న జంతర్ మంతర్ వద్దకు చేరుకొని నిరసన తెలిపేందుకు బయలుదేరిన అనేక మంది నిర్బంధించబడ్డారు. సెప్టెంబర్ 28న నేహా నేతృత్వంలో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, మనోజ్ ఝా, నిఖిల్ డే, నందిత తదితరులు మరో మారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా వాళ్ళని అరెస్టు చేశారు. ఆతిశి, సౌరభ్ భరద్వాజ్, ఐషే ఘోష్‌లు, వారి వెంటే సంజీవ్ ఝా, ఆప్ పార్టీ సంజయ్ సింగ్, యోగేంద్ర యాదవ్, బ్రిందా కరాట్ వంటి పెద్ద వాళ్ళు సైతం నిరసనల్లో భాగం అవుతున్నారు.

ఎఐఎస్‌ఎ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్), ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, డివైఎఫ్, కెవైఎస్, దిశ, పిడిఎస్ వంటి విద్యార్థి, యువజన సంస్థలు అక్టోబర్ 2 నుంచి వరుసగా ధర్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వేలాది మంది అనేక రాష్ట్రాలలో నిర్బంధించబడ్డారు. అక్టోబర్ 3, 4 న కూడా నిరసనలు కొనసాగాయి. నేహా మూడు రోజులు వరుసగా నిర్బంధించబడింది. అక్టోబర్ 4న ఆమెను మగ పోలీసులు గుర్తులు లేని కారులో తీసుకువెళ్ళబోతూ వుంటే ఎంతో ధైర్యంగా ఆడపిల్లలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మరో వంక కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వంలో, అక్టోబర్ 2న ముంబై శివాజీ పార్క్ వద్ద జరిగిన ధర్నాకి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, దాదాపు 10 వేల మంది హాజరయ్యారు. షబానా అజ్మీ, విశాల్ దద్లానీ, నసీరుద్దీన్ ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

అక్టోబర్ 8న బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన పీపుల్స్ ట్రిబ్యూనల్, చప్పల్ ప్రొటెస్ట్‌లో ఎస్‌ఐఆర్ వల్ల ఓటరు జాబితా నుంచి తొలగించబడిన కర్ణాటక ప్రజలు సాక్ష్యాలు సమర్పించారు. అభిజీత్, ప్రముఖ నటుడు, యాక్టివిస్ట్ ప్రకాష్‌రాజ్, యూ ట్యూబర్ ధ్రువ్ రాథీ, అనేక మంది విద్యార్థి నాయకులు దీనిలో పాల్గొన్నారు. మరో పక్క కాంగ్రెస్, ఇండియా బ్లాక్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ ఆపివేయడం, బ్యాలెట్ పేపర్ తిరిగి తీసుకురావడం వంటి డిమాండ్లు చేస్తోంది. రాహుల్ జరుగుతున్నది ఓట్ చోరీని కానూన్ చోరీ, సంస్థల చోరీగా అభివర్ణిస్తూ ఎన్నికల కమిషనర్‌ను దేశద్రోహి అన్నాడు. తమ డిమాండ్ల సాధనకై నిరసన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ నాయకత్వంలో ఎన్‌డిఎ బ్లాక్, అక్టోబర్ 6, 7న పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్‌కి మార్చ్, అకాశవాణి భవన్‌లో 8 గంటలకుపైగా ధర్నా, తర్వాత జంతర్ మంతర్‌కు చేరే ప్రయత్నం చేశారు. రాహుల్, ప్రియాంక, అనేక మంది ఎంపిలు నిర్బంధించబడ్డారు. ఇప్పుడు ఎవరూ ఇక ఆగేలా లేరు.

గత పన్నెండేళ్లుగా వరుస తప్పుల కారణంగా బిజెపి ప్రభుత్వం ఇప్పుడు జవాబు చెప్పుకోలేని ఆత్మరక్షణ స్థితిలో వున్నది. అదే సమయంలో ఏమి చేసైనా సరే, తన తప్పులను ఒప్పుకోకుండా, అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కూడా వుంది. అబద్ధాలు, మత గొడవలు, బెదిరింపులు, విభేదాలు సృష్టించి చీలికలు తేవడం, ఐటి దాడులు వంటి చర్యలు ఇక పనిచేయడం కష్టం అని అర్థమైనప్పుడు, ఇక మిగిలింది నిర్బంధమే కదా. ఇప్పుడు దేశంలో అనేక చోట్ల జరుగుతున్నది అదే. సభలకు అనుమతి నిరాకరణలు, ప్రతిపక్ష పార్టీలు, విదార్థులు, ఇలా వందలాది మందిపై కేసులు, మహిళా నిరసనకారులు, జర్నలిస్టులపై లైంగిక హింస, రానున్నాది గడ్డుకాలం అని సూచిస్తున్నాయి. నేహా బోరా వాళ్లు మమ్మల్ని కుక్కలు, కాక్రోచ్‌లు అనుకుంటున్నారు. కానీ మేము ఈ దేశ పౌరులం, ప్రశ్నించే హక్కు మాకు ఉంది. మేము మీకు భయపడే రోజులు పోయాయి అంది. విసిగి వేసారి పోయాక చివరికి భయం పోవడమే నిజం కాక తప్పదు.

విమల

(రచయిత్రి సామాజిక విశ్లేషకులు)

Tags

Next Story