అద్భుత ‘విజన్’.. రైజింగ్ సన్

అద్భుత ‘విజన్’.. రైజింగ్ సన్
X

స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్నాయి. అప్పటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే అత్యంత ప్రాధాన్యంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అద్భుతమైన ఫలితాలకు వేదికగా అందర్నీ ఆశ్చర్యపర్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించారు. మొదటి రోజునే ఈ సదస్సు సూపర్ సక్సెస్ అయింది. 35 కంపెనీలు రూ. 2.43లక్షల కోట్లు తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం కావడం గొప్ప విషయం. రెండో రోజు మంగళవారం అదే స్థాయిలో కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా, ఈ రెండు రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ. 6లక్షల వేల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం దాదాపు 185 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, త్రీ ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సంకల్పాన్ని పెట్టుకుంది. ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావిస్తోంది.

విజన్‌లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) మోడళ్లను ప్రభుత్వం నిర్దేశించుకుంది. డీప్‌టెక్, ఎఐ, క్వాంటమ్, కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రపంచంలో తెలంగాణను ఆసియాకు ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల ప్రారంభంగా ప్రభుత్వం ఈ రైజింగ్ విజన్ సదస్సు భారీ ఎత్తున నిర్వహించింది. చైనా లోని అన్ని ప్రావిన్స్‌ల్లో పెద్దదైన గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం 20 ఏళ్ల లోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించింది. ఆ ప్రావిన్స్‌నే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజన్‌కు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ విజన్ సాధించడం కష్టంగా అనిపించినా, కృషితో సాధించగలమన్న నమ్మకంతో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటి, గ్రీన్‌ఎనర్జీ, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం, ఈ విధంగా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రావడం విశేషం. దీని ద్వారా 1,52,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41 వేల కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. డీప్‌టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ రూ. 75 వేల కోట్లు (భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు), ఎప్రిన్/యాక్సిస్ రూ. 31 వేల కోట్లు, విన్‌గ్రూప్ రూ. 27 వేల కోట్లు, సల్మాన్‌ఖాన్ రూ.10 వేల కోట్లు, మేఘా 8 వేల కోట్లు, వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధమయ్యాయి.

పునరుత్పత్తి శక్తి, పవర్ సెక్యూరిటీ రూ. 39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ లాజిస్టిక్ గేల్‌వేలకు రూ. 19,350 కోట్లు, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ , కోర్ ఇండస్ట్రీ రూ. 13,500 కోట్లు ఒప్పందం కుదిరింది. మై హోం నుంచి గ్లోబల్ కంపెనీల వరకు ఈ ఒప్పందాల వెల్లువ ఉప్పొంగింది. ప్రస్తుతం తెలంగాణలో 11.4 గిగావాట్ల (11,400 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్‌కు అదనంగా మరో 20 గిగావాట్ల (20 వేల మెగావాట్ల) విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అవుతుంది కాబట్టి ఆ డిమాండ్ సాధన కోసం మరిన్ని సౌర, థర్మల్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలు నెలకొల్పడానికి నిర్ణయించుకున్నారు. రక్షణ, అంతరిక్షరంగాల పరిశోధనలతోపాటు ఉత్పత్తులకు వీలుగా హైదరాబాద్ నగరం త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరో మూడు యూనిట్లు నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ ఉత్పత్తులు అందించడానికి 3500 కంపెనీలు 25 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయని చర్చలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న సూచన వెలువడింది.

అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 34.6 బిలియన్ డాలర్లు ఉండగా, 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు పెంచడం లక్షంగా పెట్టుకున్నారు. సోమవారం క్రీడారంగానికి ప్రోత్సాహకరంగా రూ.16వేల కోట్ల పెట్టుబడులు సమకూరగా, మంగళవారం మరో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు సమకూరుతున్నాయి. రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. అపోలో గ్రూప్ ఆధునిక విశ్వవిద్యాలయం, వైద్య, విద్య పరిశోధన కేంద్రం నిర్మాణానికి 200 కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అరబిందో ఫార్మా రూ. 2 వేల కోట్లు, ఎఐ రెడీ డేటా పార్క్ రూ.70 వేల కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండడం విశేషం. ఆయన సమక్షం లోనే ఒప్పందాలు కుదురుతుండడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరుపురాని ఘట్టం.


Tags

Next Story