మళ్లీ తెరపైకి ఉమ్మడి పౌరస్మృతి

Amit Shah
జనసంఘ్ 1957, 1962 ఎన్నికల ప్రణాళిక లు హిందూ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరాయి. కానీ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించలేదు. ఈ డిమాండ్ 1967 ప్రణాళికలో కనిపించినప్పటికీ, 1971 లో మాయమైంది. 1980లో వచ్చిన బిజెపి తొలి ఎన్నికల ప్రణాళికలో కూడా దీని గురించి ఏమీ పేర్కొనలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న 1984లో కూడా పరిస్థితి అలాగే ఉంది. కానీ ఎనభైల మధ్యలో ఎల్‌కె అద్వానీ నాయకత్వంలోని పార్టీ మూడు అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుంది: యుసిసి, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం. 1985 నాటి షా బానో కేసు సమయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి యుసిసిని తమ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా మార్చుకున్నాయి.
ప్రజలలో ఏదైనా అంశంపై ప్రభుత్వం ప్రతికూలత ఎదుర్కొంటున్న సమయంలో ఆ అంశాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు భావోద్వేగం కలిగించే మరో అంశాన్ని తెరపైకి తీసుకు రావడం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు విధానపరంగా ఎటువంటి చొరవ చూపించలేక, భావోద్వేగ అంశాలతో ప్రజలలో కలకలం సృష్టించి పబ్బం గడుపుకోవడంలో ఆరితేరింది.
జులై 20న ఢిల్లీలో విద్యార్థులు, యువకులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా విరుచుకుపడిన సంఘటన మొత్తం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటే, హోంమంత్రిగా కనీసం పార్లమెంట్ ముందుకు వచ్చి అసలేమీ జరిగిందో చెప్పే సాహసం చేయలేకపోయిన అమిత్ షా పార్లమెంట్ ముగియగానే బిజెపితోపాటు ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అమలు చేసి తీరుతామని ప్రకటించారు. దేశంలో 21 రాష్ట్రాల్లో బిజెపి, ఎన్‌డిఎ పాలన నడుస్తోందని, ఈ రాష్ట్రాల్లో 2029లోపు యుసిసిని అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో యుసిసి అమలు దిశగా చర్యలు తీసుకున్నామని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు మిగతా రాష్ట్రాల్లోనూ యుసిసిని అమలు చేస్తామని చెప్పారు. రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత, కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారంలో ఉన్న బిజెపి, తన మూడవ దీర్ఘకాలిక వాగ్దానాన్ని అసంపూర్తిగా వదిలివేయడానికి ఇష్టపడకపోవచ్చు. అయితే, ఈ విషయమై పార్లమెంట్‌లో ఓ చట్టం తీసుకొచ్చి, దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేయకుండా ఒక్కొక్క రాష్ట్రంలో చట్టాలు తీసుకు రావడం భావోద్వేగంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమే గాని చిత్తశుద్ధి ఉందని చెప్పలేము. దేశ ప్రజలు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలనడంలో అభ్యంతరం లేదు. అయితే, పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, కొన్ని ప్రాంతాలకు లేదా వర్గాలకు కొన్ని మినహాయింపులు ఇవ్వక తప్పదు. నేడు ఉమ్మడి పౌరస్మృతిని డిమాండ్ చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు సైతం 1985 తర్వాతనే ఈ విషయమై ఒత్తిడి తెస్తున్నారు గాని, అంతకు ముందు లేదని గ్రహించాలి. గురుజీగా పేరొందిన రెండవ ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్, ఎం. ఎస్. గోల్వాల్కర్, వాస్తవానికి 1972లోనే ‘భిన్నత్వంలో ఏకత్వం’ కోసం వాదిస్తూ ఈ విషయమై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ‘ఆర్గనైజర్’ వారపత్రికలో ప్రచురితమైన, ఆగస్టు 1972 నాటి గోల్వాల్కర్ ఇంటర్వ్యూలో జాతీయతా స్ఫూర్తిని పెంపొందించడానికి యుసిసి తప్పనిసరిగా ఉండాలా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ గోల్వాల్కర్ ఇలా చెప్పారు: లేదు. ఈ సమాధానం మీకు, ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ నా అభిప్రాయం ఇది.. భారతదేశం ఎల్లప్పుడూ వైవిధ్యాన్ని ప్రోత్సహించింది. అయినప్పటికీ, మనం శతాబ్దాలుగా బలమైన, ఐక్యదేశంగా ఉన్నాం. ఐక్యతకు మనకు కావాల్సింది సౌహార్దం, ఏకరూపత కాదు. ముస్లింలలో బహుభార్యత్వం గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయన ఇలా పేర్కొన్నారు: యాంత్రికంగా (సివిల్ కోడ్‌ను) ఏకీకృతం చేసే ప్రయత్నాలు సరికావు. ముస్లింలు తమ (వ్యక్తిగత) చట్టాన్ని తమ పద్ధతిలో రూపొందించుకోనివ్వండి. బహుభార్యత్వం తమకు మంచిది కాదనే నిర్ధారణకు వారు వచ్చిన రోజు నేను సంతోషిస్తాను. కానీ నా అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దాలని నేను కోరుకోను.. విభిన్న జీవన విధానాల వైవిధ్యాన్ని పరిరక్షించడానికి నేను అనుకూలంగా ఉన్నాను.
యుసిసిపై సంఘ్ పరివార్ కఠిన వైఖరి ఆ తర్వాత, ప్రధానంగా 1980ల మధ్యలో షా బానో కేసు తర్వాత, బిజెపి పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రూపుదిద్దుకుంది. సాంప్రదాయ హిందూ వ్యక్తిగత చట్టాలను క్రోడీకరించడం, ఏకీకృతం చేయడం, ఆధునీకరించడం లక్ష్యంగా తెచ్చిన ‘హిందూ కోడ్ బిల్లు’ విషయానికి వస్తే, 1955 ఏప్రిల్ 15న దీనిపై వ్యతిరేకత బలపడింది. అప్పుడు జనసంఘ్ కేంద్ర కార్యవర్గ కమిటీ, ‘ప్రజల నుండి ఎటువంటి ఆదేశం (మాండేట్) తీసుకోకుండా, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా’ ఈ చర్యను తీసుకున్నారని పేర్కొంటూ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది. జనసంఘ్ 1957, 1962 ఎన్నికల ప్రణాళికలు హిందూ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరాయి. కానీ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించలేదు. ఈ డిమాండ్ 1967 ప్రణాళికలో కనిపించినప్పటికీ, 1971 లో మాయమైంది. 1980లో వచ్చిన బిజెపి తొలి ఎన్నికల ప్రణాళికలో కూడా దీని గురించి ఏమీ పేర్కొనలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న 1984లో కూడా పరిస్థితి అలాగే ఉంది. కానీ ఎనభైల మధ్యలో ఎల్‌కె అద్వానీ నాయకత్వంలోని పార్టీ మూడు అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుంది: యుసిసి, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం.
1985 నాటి షా బానో కేసు సమయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి యుసిసిని తమ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా మార్చుకున్నాయి. 1987లో వాజ్‌పేయి స్థానంలో అద్వానీ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1989 బిజెపి ఎన్నికల ప్రణాళిక, వ్యక్తిగత చట్టాలను పరిశీలించడానికి, ఏకాభిప్రాయం ద్వారా యుసిసి ముసాయిదాను రూపొందించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 1991లో ‘ఉమ్మడి పౌర చట్టాన్ని రూపొందించడానికి’ లా కమిషన్ అధ్యయనం చేయాలని ప్రతిపాదించింది. బిజెపి 1996 ఎన్నికల ప్రణాళిక ‘మేము ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తాము’ అని హామీ ఇచ్చింది. కనీస వివాహ వయస్సు, బహుభార్యత్వం, బహుభర్తృత్వం, వారసత్వం, చట్టబద్ధమైన వివాహ వయస్సు వంటి అంశాలు విభేదాలకు కారణమయ్యాయి ఇవి తెగ, ప్రాంతం, రాష్ట్రాల వారీగా మారుతూ ఉండే షెడ్యూల్ తెగల గుర్తింపులను నిర్వచించే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకనే ఈ విషయంలో తొందరపాటు తగదు. మహిళలు, క్వియర్, ట్రాన్స్‌జెండర్ ప్రజలు, ఆదివాసీ వర్గాలు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఇతర ప్రభావిత సమూహాలతో తగిన, పారదర్శక, సమ్మిళిత సంప్రదింపులు జరపకుండా రూపొందిస్తున్న లేదా ప్రతిపాదిస్తున్న రాష్ట్ర స్థాయి ఏకరీతి పౌర స్మృతులను అఖిల భారత ఫెమినిస్ట్ అలయన్స్ (అలిఫా) తిరస్కరించింది. ‘లింగ సమానత్వం’ అనే వాదనకు విరుద్ధంగా, ఈ స్మృతులు మహిళలకు రక్షణ గానీ, న్యాయం గానీ కల్పించకుండా, నిఘా ద్వారా ప్రభుత్వ అధికారాలను ఏకపక్షంగా పెంచుతాయని, వ్యక్తుల గోప్యతపై కఠినమైన ఆంక్షలను విధిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభావిత వర్గాల వారి అన్ని రాజ్యాంగ హక్కులు పూర్తిగా పరిరక్షించబడతాయని, వారితో విస్తృత సంప్రదింపులు జరుగుతాయని నిర్ధారించుకోకుండా, వీటిని అమలు చేయడానికి లేదా విధించడానికి తొందరపడటం శ్రేయస్కారం కాబోదు.
చలసాని నరేంద్ర
98495 69050
-
Home
-
Menu
