నిషేధాలతో కాదు... బాధ్యతతోనే బాల్యం భద్రం

నిషేధాలతో కాదు... బాధ్యతతోనే బాల్యం భద్రం
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దురంధర్ సినిమా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన రెండో భాగం కూడా విపరీతమైన హింసతో కూడినదే. పెద్దవాళ్లే చూసి తట్టుకోలేనంత హింస తెరపై కనిపిస్తుంటే, చిన్నపిల్లలపై దాని ప్రభావం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ చిత్రాన్ని 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే చూడాలన్నది నిబంధన. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. సినిమాల్లో హింస, అశ్లీలత, అసభ్యకరమైన దృశ్యాలు మితిమీరి ఉండకుండా కట్టడి చేయాల్సిన సెన్సార్ బోర్డు, వాటిని పూర్తిగా తొలగించకుండా ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన తన బాధ్యతను నెరవేర్చినట్టేనా? పెద్దలకు మాత్రమే చూడదగిన చిత్రమని వర్గీకరించడం ఒక ఎత్తయితే, ఆ చిత్రాన్ని మైనర్లు చూడకుండా నిరోధించడం మరో ఎత్తు. ఒక కుటుంబం దురంధర్ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లిందనుకుందాం. ఆ కుటుంబంలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. థియేటర్ నిర్వాహకులు మొదట ఆ పిల్లలను లోపలికి అనుమతించలేదు. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల లోపు వారికి ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలు చూపించకూడదని చెప్పారు. అయితే సినిమా టికెట్లకు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, తాము సినిమా చూడకుండా వెనక్కి వెళ్లిపోతామని కుటుంబ సభ్యులు కోరారు.

టికెట్ల డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో చివరకు థియేటర్ నిర్వాహకులు ఆ మైనర్లను లోపలికి అనుమతించినట్టు చెప్పుకుంటే, అది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, పిల్లలపట్ల బాధ్యతారాహిత్యం కూడా. వ్యాపారమే పరమావధిగా భావించే సినిమా థియేటర్ల నిర్వాహకులు ఇలాంటి నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

అయితే ప్రతి థియేటర్ ముందు ప్రభుత్వ అధికారులే అహర్నిశలూ నిలబడి, ఏ సర్టిఫికెట్ పొందిన సినిమాలకు మైనర్లను అనుమతించకుండా పర్యవేక్షించడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే నిబంధనలను అమలు చేసే వ్యవస్థతోపాటు, వాటిని పాటించాలన్న బాధ్యత కూడా థియేటర్ల యాజమాన్యాలకు ఉండాలి. టికెట్ అమ్మకమే లక్ష్యంగా పెట్టుకుని, నిబంధనలను పక్కనపెడితే పిల్లల భద్రత, వారి మానసిక ఎదుగుదల ఎవరి బాధ్యత?

ఇక్కడ తల్లిదండ్రుల పాత్రను కూడా విస్మరించలేం. పిల్లలను సినిమా చూడడానికి తీసుకెళ్లే ముందు ఆ సినిమా ఏ వర్గానికి చెందినదో తెలుసుకోవాలి. ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకూడదన్న విషయం తల్లిదండ్రులకు తెలియాలి. పిల్లలు కోరుతున్నారనే కారణంతోనో, కుటుంబంతో కలిసి సినిమా చూడాలనే ఉద్దేశంతోనో నిబంధనలను ఉల్లంఘించడం సమర్థనీయం కాదు. కుటుంబమంతా కలిసి చూసి ఆనందించగల సినిమాలు మరిన్ని రావాలి . ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు థియేటర్ నిర్వాహకులు అనుమతించినా, తల్లిదండ్రులు తమ బాధ్యతను మరిచిపోకూడదు.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలను మైనర్లు థియేటర్లలో చూడకుండా నిరోధించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి చంచల్ కుమార్, కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ఉన్నతాధికారులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.

హైకోర్టు జారీ చేసిన నోటీసులు కేవలం అధికారులకే పరిమితమైన అంశంగా చూడకూడదు. పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సినిమాలను పిల్లలు చూడకుండా నిరోధించడంలో ప్రభుత్వ యంత్రాంగం, సెన్సార్ బోర్డు, థియేటర్ల నిర్వాహకులు, తల్లిదండ్రులు- అందరికీ బాధ్యత ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం ఒక ప్రక్రియ. ఆ సర్టిఫికెట్ నిర్దేశించిన నియమాలను అమలు చేయడం మరో ప్రక్రియ.

పిల్లలపై హింసాత్మక దృశ్యాలు, అనుచితమైన కంటెంట్ ప్రభావం పడకుండా చూడడం సమాజం మొత్తం బాధ్యత. ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చామని సెన్సార్ బోర్డు చేతులు దులుపుకుంటే, టికెట్లు అమ్మామని థియేటర్లు బాధ్యత నుంచి తప్పించుకుంటే, పిల్లలను సినిమా చూడడానికి తీసుకెళ్లామని తల్లిదండ్రులు సమర్థించుకుంటే -నిబంధనలు కాగితాలకే పరిమితమవుతాయి. పిల్లల ప్రయోజనాలను కాపాడాలంటే సర్టిఫికెట్ ఇవ్వడం దగ్గరనుంచి సినిమా ప్రదర్శన వరకు ప్రతి దశలోనూ బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరం.

థియేటర్లలో వయో పరిమితులు విధిస్తే సరిపోతుందా? చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంట్లో టివి, అందుబాటులో ఒటిటి వేదికలు ఉన్నప్పుడు పిల్లలను అనుచిత దృశ్యాల నుంచి ఎలా కాపాడాలి? ఇందులో తల్లిదండ్రుల బాధ్యత ఎంత?

పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సినిమాలను చిన్నపిల్లలు చూడకూడదు. వారి లేత మనసులపై అలాంటి దృశ్యాలు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే వయసుకు తగని సినిమాలను పిల్లలు చూడకుండా నిరోధించాలన్న నిబంధనలు అవసరం. కానీ థియేటర్లలో ప్రవేశాన్ని అడ్డుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారమైనట్టేనా? పిల్లల చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌ల్లోకి, ఇంట్లోని టివిల్లోకి, ఒటిటి వేదికల్లోకి వస్తున్న అనుచిత కంటెంట్ సంగతేమిటి?

తాజాగా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని సమర్థంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే పిల్లలపై ప్రభావం చూపే కంటెంట్ థియేటర్లకే పరిమితం కాలేదన్న విషయాన్ని కూడా గుర్తించాలి.

ఇప్పుడు వినోదంకోసం సినిమా హాళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో టివి ఉంది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. ఒటిటి వేదికలు ఉన్నాయి. ఇంటర్నెట్‌లో అంతులేని కంటెంట్ అందుబాటులో ఉంది. థియేటర్లలో వయసు నిర్ధారణ చేసి ప్రవేశాన్ని అడ్డుకోవచ్చు. మరి ఇంట్లో పిల్లల చేతిలో ఉన్న ఫోన్లోకి వచ్చే కంటెంట్‌ను ఎవరు నియంత్రిస్తారు?

ఇక్కడే తల్లిదండ్రుల బాధ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పిల్లలకు మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం పెద్దలే. తమ పనులకు ఆటంకం కలగకూడదనో, పిల్లలు మారాం చేయకూడదనో, వారిని కాసేపు నిశ్శబ్దంగా ఉంచాలనో ఫోన్లు చేతికిస్తున్నారు. మొదట కార్టూన్లు, ఆటలు చూపిస్తారు. ఆ తర్వాత పిల్లలు గంటల తరబడి వీడియోలు చూస్తున్నా పట్టించుకోరు. ఏం చూస్తున్నారు? ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నారు? ఎలాంటి కంటెంట్ వారి ముందుకొస్తోంది? అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత పూర్తయిపోదు. నిజానికి అక్కడి నుంచే వారి బాధ్యత మొదలవుతుంది. పిల్లలు ఏం చూస్తున్నారో తెలుసుకోవడం, వారి ఫోన్ వినియోగానికి సమయ పరిమితులు విధించడం, వయసుకు తగని కంటెంట్ అందుబాటులోకి రాకుండా తగిన నియంత్రణలు ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. చిన్నపిల్లలు ఇంటర్నెట్‌లో ఎదురయ్యే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఏది మంచో, ఏది చెడో, ఏది కల్పితమో, ఏది వాస్తవమో గుర్తించే పరిణతి వారికి ఉండదు. అలాంటి సమయంలో వారిని నిర్లక్ష్యంగా వదిలేయడం ఎంతవరకు సమంజసం?

పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారో అప్పుడప్పుడు అడగడం మాత్రమే సరిపోదు. వారితో కలిసి కొంతసేపు కంటెంట్ చూడాలి. వారికి నచ్చే విషయాలను తెలుసుకోవాలి. అనుచితమైన దృశ్యాలు ఎదురైతే వాటి గురించి భయపెట్టకుండా, తప్పొప్పులను వివరించాలి. ఫోన్ వినియోగానికి స్పష్టమైన నియమాలు పెట్టాలి. భోజనం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఫోన్లకు దూరంగా ఉండే అలవాటు చేయాలి. పిల్లలకు ప్రత్యామ్నాయంగా పుస్తక పఠనం, ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో సంభాషణలకు సమయం కేటాయించాలి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. పెద్దలు ఇంట్లో ఎప్పుడూ ఫోన్లలో మునిగిపోయి ఉంటే పిల్లలకు మొబైల్ వినియోగంపై పరిమితులు విధించడంవల్ల ప్రయోజనం ఏముంటుంది? పిల్లలు పెద్దల మాటలకంటే వారి ప్రవర్తనను ఎక్కువగా అనుకరిస్తారు. కాబట్టి పిల్లలకు ఫోన్ తగ్గించమని చెప్పే ముందు పెద్దలు తమ ఫోన్ వినియోగాన్ని నియంత్రించుకోవాలి. పిల్లలతో గడపాల్సిన సమయాన్ని సామాజిక మాధ్యమాలకు, అంతులేని వీడియోలకు బలి చేయకూడదు.

ప్రభుత్వాల బాధ్యత కూడా థియేటర్ల వద్ద తనిఖీలతో ముగియకూడదు. ఒటిటి వేదికలు, డిజిటల్ కంటెంట్ ప్రసార వ్యవస్థలు వయోపరిమితులను సమర్థంగా అమలు చేస్తున్నాయా లేదా పరిశీలించాలి. పిల్లలకు అందుబాటులో ఉండే కంటెంట్ విషయంలో తగిన రక్షణ చర్యలు ఉండేలా చూడాలి. పాఠశాలల్లో డిజిటల్ భద్రత, ఇంటర్నెట్ వినియోగం, మీడియా అవగాహన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

అన్నింటికంటే ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. పరీక్షల్లో మార్కులు సాధించడం, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సంపాదించడం మాత్రమే విద్య లక్ష్యం కాకూడదు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకోవడం, మంచి చెడులను విశ్లేషించడం, తప్పు ఒప్పులను గుర్తించడం, ఇతరులను గౌరవించడం వంటి విలువలను కూడా పిల్లలకు బోధించాలి. తెరపై కనిపించేదంతా అనుసరించదగినది కాదని, ఆకర్షణీయంగా కనిపించేదంతా మంచిది కాదనే అవగాహన పిల్లల్లో కల్పించాలి .

పిల్లలను చెడునుంచి కాపాడటం అంటే వారి చుట్టూ గోడలు కట్టడం మాత్రమే కాదు. ఆ గోడలు దాటి బయట ప్రపంచంలోకి వెళ్లినప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణను వారిలో పెంపొందించడం. ఆ బాధ్యతను కేవలం ప్రభుత్వాల మీదకో, పాఠశాలల మీదకో నెట్టివేయడం తగదు. పిల్లల భవిష్యత్తుపై అత్యధిక ప్రభావం చూపగలిగేది కుటుంబమే. అందులోనూ తల్లిదండ్రుల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు.

థియేటర్లలో పిల్లలను అనుమతించకుండా ఆపడం ప్రభుత్వ బాధ్యత. వారి చేతిలోని ఫోన్లోకి వచ్చే అనుచిత కంటెంట్‌ను నియంత్రించడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే అంతకంటే ముఖ్యంగా ఏది చూడాలి? ఏది చూడకూడదు? ఎందుకు చూడకూడదు? అన్న విచక్షణను పిల్లల్లో పెంపొందించడం కుటుంబం, విద్యాసంస్థలు, సమాజం సమష్టిగా నిర్వర్తించాల్సిన బాధ్యత. పిల్లలకు ఫోన్లు కొనివ్వగలుగుతున్నాం. మరి వారితో సమయం గడపడానికి, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడానికి మనకు సమయం లేదా? పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం కంటే, వారి జీవితానికి సరైన దిశానిర్దేశం చేయడం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం.

ఆ మధ్య కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మైనర్ బాలబాలికలు మొబైల్ ఫోన్‌లను వాడటాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేసింది. ఈ చట్టం చెయ్యడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. మైనర్‌ల చేతికి మొబైల్ ఫోన్‌లు అందుతున్నాయా లేదా అన్న విషయం ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? చిన్నపిల్లల పేర్ల మీద మొబైల్ ఫోన్‌లు ఉండవు కదా. తల్లిదండ్రుల ఫోన్‌లే సాధారణంగా వాళ్ళూ వాడుతుంటారు. దీన్ని ఎట్లా కట్టడి చేస్తారు? చట్టాలు చేసి, అధికారులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటే ఏం ప్రయోజనం?


దేవులపల్లి అమర్

Tags

Next Story