ఫార్మాడ్రగ్స్ మత్తులో యువత

ఫార్మాడ్రగ్స్ మత్తులో యువత
X

దేశం లోని అనేక రాష్ట్రాల్లో యువత హెరాయిన్ అనే మత్తు పదార్ధానికి బానిసలవుతున్నారు. మార్ఫిస్, కోడైస్, ఆక్సికోడోస్, ఫెంటానిల్, హెరాయిన్ అనేవి ఓపియాయిడ్లు. ఇవి మెదడు, నాడీ వ్యవస్థపై ప్రధానంగా నొప్పి తగ్గించడానికి వినియోగిస్తారు. వైద్యపరంగా సరైన మోతాదులో వీటిని వినియోగిస్తే నొప్పి నియంత్రణలో సహాయపడతాయి. వీటిని వ్యసనంగా చేసుకుని ఎక్కువ మోతాదులో వాడితే లేదా తప్పుగా వాడితే నిద్రమత్తు, మలబద్దకం, శ్వాస నెమ్మదించడం, క్రమంగా ప్రాణాంకతం కావచ్చు. జనాభా శాతంతో చూస్తే ఒపియాయిడ్ సమస్య మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్ల వయసు నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు దాదాపు 2% మంది హెరాయిన్‌ను అత్యధికంగా వినియోగిస్తున్నారని 2018 నాటి సర్వేలో బయటపడింది. అలాగే పాఠశాల విద్యార్థుల్లో వీటి వినియోగం 2.8 శాతంగా నమోదైంది. హెరాయిన్‌కు బానిసైన యువతలో చదువు, ఉద్యోగం, సామాజిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటోంది. శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది.

డ్రగ్స్ అక్రమ రవాణాలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌లో ప్రస్తుతం హెరాయిన్ లభ్యత బాగా తగ్గిపోవడంతో దాని స్థానంలో ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వినియోగం యువతలో పెరిగింది. ఈ ఫార్మాస్యూటికల్ మత్తు పదార్ధాలు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో పంజాబ్ లోకి వస్తుండడం వీటిని నివారించడం పోలీస్‌లకు పెద్ద సవాలుగా మారింది. ఈ ఫార్మాడ్రగ్స్‌లో ఎక్కువ భాగం పంజాబ్‌లో తయారు కావడం లేదు. ఇవి హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీల్లో తయారవుతున్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన మత్తుమందుల్లో 11.54 లక్షల ఫార్మాస్యూటికల్ మాత్రలు, కాప్సూల్స్‌ను గత సంవత్సరం నుంచి స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో అందుబాటులో ఉన్న ఈ డ్రగ్స్ లో సుమారు 80% ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని అంచనా. ఇది గతంలో ఉన్న పరిస్థితికి పూర్తి విరుద్ధం. అప్పట్లో పంజాబ్ లోకి అక్రమంగా వచ్చే డ్రగ్స్‌లో సుమారు 80 శాతం పాకిస్థాన్ సరిహద్దు అవతలి నుంచి అక్రమ రవాణా అయ్యేవి. 2024లో పంజాబ్‌లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 2024 తొలి ఆరు నెలల్లోనే 215 కిలోల హెరాయిన్ స్వాధీనం అయింది.

ఇప్పుడు కొత్త ధోరణి పంజాబ్‌లో కనిపిస్తోంది. ఫార్మా ఔషధాల దుర్వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు ఫార్మాడ్రగ్స్ ఉత్పత్తి అయ్యే రాష్ట్రాలు, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించే మార్గం లోని రాష్ట్రాలు కలిసి డ్రగ్స్ తయారీదారులు, పంపిణీదారులు, అలాగే వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న డ్రగ్ నెట్‌వర్క్‌లపై సమన్వయంతో చర్యలు తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. డ్రగ్స్ తయారీ యూనిట్ల నియంత్రణ, విక్రయం, కొనుగోలు, రవాణా వీటిన్నిటినీ పర్యవేక్షించడం, అవి పంజాబ్‌కు అక్రమంగా మళ్లించబడకుండా నిరోధించడం తదితర కార్యకలాపాల నివారణకు పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి బిఎస్‌ఎఫ్, పోలీస్ దళాలు బహుళ స్థాయి చర్యలు చేపట్టారు. ఈ చర్యల ఫలితంగా పంజాబ్‌లో వీధుల్లోనే విచ్చలవిడిగా లభించే హెరాయిన్‌ను అడ్డుకోగలిగారు. దీంతో పంజాబ్ యువతకు హెరాయిన్ లభ్యంకాక, మత్తు కలిగించే ఫార్మాడ్రగ్స్ వాడటం ప్రారంభమైంది. సెప్టెంబర్ 3న మొబైల్ డ్రోన్ గుర్తింపు వేదిక అయిన ‘డ్రోన్ సెన్స్ డి 200 ప్రో’కు చెందిన మూడు యూనిట్లు సరిహద్దు జిల్లాల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసే డ్రోన్లకు సంబంధించిన కార్యకలాపాలను గుర్తించి, వాటి ఖచ్చితమైన స్థానాన్ని, డ్రోన్లు ఎక్కడైతే డ్రగ్స్‌ను విడిచిపెడతాయో కనుక్కోగలగడం ఈ డ్రోన్‌సెన్స్ డి 200 ప్రో వ్యవస్థ లక్షం. దీని ద్వారా భద్రతా సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని చర్యలు తీసుకోగలుగుతుంది.

ఈ చర్యల కోసం 52 డ్రోన్ రెస్పాన్స్ టీమ్స్ (డిఆర్‌టిఎస్) ఏర్పాటయ్యాయి. వీటిలో 147 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. ఈ బృందాలు బిఎస్‌ఎఫ్‌తో కలిసి పనిచేస్తాయి. డ్రోన్ల డ్రగ్స్ రవాణా సంబంధమైన హెచ్చరికలు వచ్చిన వెంటనే ఈ బృందాలు స్పందించి డ్రోన్లు ఎక్కడైతే డ్రగ్స్‌ను జారవిడిచాయో అక్కడకు వెళ్లి నిఘా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో గస్తీ కాసి, డ్రగ్స్‌ను తీసుకెళ్లడానికి వచ్చిన వారిని పట్టుకుంటాయి. ఈమేరకు పోలీసులు మొత్తం 9 యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిలో 3 ‘బాజ్’యాంటీడ్రోన్ వ్యవస్థలు. గత సంవత్సరం ఆగస్టు నుంచి అమృత్‌సర్, తరన్ తారన్, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఇవి డ్రగ్స్ రవాణా డ్రోన్ల కదలికలను ముందుగానే పసికట్టి వాటి కమ్యూనికేషన్‌ను స్తంభింప చేస్తాయి. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో విలేజీ డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలే పోలీసులకు కళ్లు, చెవులుగా పనిచేస్తాయి. ‘యుద్ధ్ నషా విరుద్ధ్ (మాదకద్రవ్యాల వ్యతిరేక) ప్రచారం ద్వారా 2025 మార్చి 1నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాదారులైన దాదాపు 80,000 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్ నెట్‌వర్క్‌ల ఆర్థిక పునాదులను దెబ్బతీయడానికి ఆర్థిక ఆంక్షలతో కూడిన చర్యలను తీసుకుంటున్నారు. డ్రగ్స్ ఉత్పత్తికి, అక్రమ రవాణాకు పాల్పడిన వారికి సంబంధించిన రూ. 336 కోట్లకు పైగా ఆస్తులను స్తంభింప చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సమాచారం ఎవరైనా తెలియజేసినా, వాటి ఆచూకీ చెప్పగలిగినా అలాంటి వారికి రివార్డు పాలసీని అమలు చేస్తున్నారు. డ్రగ్స్ రవాణా డ్రోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నందుకు రూ. 25,000 నగదు బహుమతిని అందిస్తున్నారు.

Tags

Next Story