మనిషి కోసం

Embracing earth sky
X

Embracing earth sky

మోహభరిత ప్రేమ గాయ మొకటి గుండెను పొరలు పొరలుగా తొలచి వేస్తుంది చిక్కని చీకటిలో దారి చూపిన మిణుగురుల వెన్నెల గురుతులు రంగవల్లులై కనురెప్పలపై తెగిపడుతుంటాయి విచ్ఛిన్న స్వప్న గోళంలో కొన్ని అస్తికల గుంపులు దీర్ఘ సమాలోచనలు చేస్తూ జ్ఞాపకాల మధుసేవనంలో అభ్యంగనం అవుతాయి ఎడారిని ఊరిస్తున్న ఎండమావిలా కదిలే దాహం రేపటిని మోసుకుని నిన్నటి గుడారంలో మజిలీని వెతుక్కుంటుంది సాయంత్రాలలో కొండ శిఖరాల నుండి మబ్బుతునక బహూకరించిన ఇంద్రచాపంతో ఒకానొక నెమలి పింఛం పరవశాన్ని విప్పారుతుంది […]

మోహభరిత ప్రేమ గాయ మొకటి
గుండెను పొరలు పొరలుగా తొలచి వేస్తుంది
చిక్కని చీకటిలో దారి చూపిన
మిణుగురుల వెన్నెల గురుతులు
రంగవల్లులై కనురెప్పలపై
తెగిపడుతుంటాయి

విచ్ఛిన్న స్వప్న గోళంలో
కొన్ని అస్తికల గుంపులు
దీర్ఘ సమాలోచనలు చేస్తూ
జ్ఞాపకాల మధుసేవనంలో
అభ్యంగనం అవుతాయి

ఎడారిని ఊరిస్తున్న ఎండమావిలా
కదిలే దాహం రేపటిని మోసుకుని
నిన్నటి గుడారంలో మజిలీని వెతుక్కుంటుంది

సాయంత్రాలలో కొండ శిఖరాల నుండి
మబ్బుతునక బహూకరించిన ఇంద్రచాపంతో
ఒకానొక నెమలి పింఛం
పరవశాన్ని విప్పారుతుంది

పచ్చని అడవి పదిలంగా దాచుకున్న
వెచ్చని నెత్తుటి స్పర్శ చిదిమి వేయబడిన
ఆశలకు కొత్త రెక్కలు తొడిగి
పరమ సౌందర్య నీలి ఆకాశంలో
రంగుల కెరటాల ప్రవాహాన్ని అద్దుతుంది

భూమి, నింగిని కౌగిలించుకుని
జంటగా సాగరంలో తూలిపోతాయి...
కోమల హృదయమేదో
ఓ అలజడిని ఆహ్వానిస్తూ
మనిషి ఆనవాలుకై
అరణ్యాల జాడలు వెతుకుతుంది

Also Read : అద్భుతమైన అనుభవాల ప్రయాణం

  • గాజుల శ్రీధర్

Tags

Next Story