మానవులు జీవనదుల్లా ప్రవహించాలి

Humans flow like water life
X

Humans flow like water life

‘మానవులు జీవనదుల్లా ప్రవహించాలి కానీ, చెట్లలా స్థబ్దంగా నిలిచిపోవద్దు’ అని గోపీచంద్ చెప్పిన ఈ వాక్యం ఆయన సాహిత్య, తాత్విక దృక్పథానికి ఒక రూపకం. జీవితం అనేది నిలకడ కాదని, అది ఒక నిరంతర స్రవంతి అని ఆయన నమ్మకం. ఈ భావన ఆయన కాలానికే పరిమితం కాలేదు, నేటి తరానికీ అదే ప్రాసంగికత కలిగి ఉంది. ఎందుకంటే మనం కూడా అదే ప్రశ్నలతో పోరాడుతున్నాం. జీవితం యొక్క అర్థం ఏమిటి? స్వేచ్ఛ అంటే ఏమిటి? సమాజం […]

‘మానవులు జీవనదుల్లా ప్రవహించాలి కానీ, చెట్లలా స్థబ్దంగా నిలిచిపోవద్దు’ అని గోపీచంద్ చెప్పిన ఈ వాక్యం ఆయన సాహిత్య, తాత్విక దృక్పథానికి ఒక రూపకం. జీవితం అనేది నిలకడ కాదని, అది ఒక నిరంతర స్రవంతి అని ఆయన నమ్మకం. ఈ భావన ఆయన కాలానికే పరిమితం కాలేదు, నేటి తరానికీ అదే ప్రాసంగికత కలిగి ఉంది. ఎందుకంటే మనం కూడా అదే ప్రశ్నలతో పోరాడుతున్నాం. జీవితం యొక్క అర్థం ఏమిటి? స్వేచ్ఛ అంటే ఏమిటి? సమాజం నిర్దేశించే నియమాలు మనిషిని ఉన్నతం చేస్తాయా లేక బంధీ చేస్తాయా?
గోపీచంద్ రచనల్లో మానవ జీవితంలోని ప్రధాన వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అసమర్థుని జీవయాత్రలో సీతారామరావు ఉన్నతమైన లక్ష్యాలను కోరుకుంటాడు. కానీ వాస్తవ జీవితంలో వాటిని ఆచరించడంలో విఫలమవుతాడు. ఈ విఫలత వ్యక్తిగత బలహీనత మాత్రమే కాదు, అది సమాజ పు కపటత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. సమా జం ఆదర్శాలను గొప్పగా ప్రకటిస్తుంది కానీ, వాటిని నిజంగా ఆచరించేవారికి తోడుగా నిలబడదు.

ఇది కేవలం గోపీచంద్ కాలపు వాస్తవం కాదు. ఈరోజు యువత కూడా అదే అనుభవిస్తోంది. ఉద్యోగ మార్కెట్లో ‘మూల్యాలు’ గురించి పెద్ద మాటలు మాట్లాడుతాం కానీ, ఆచరణలో అవకాశాలు ‘సిఫార్సులు’, ‘నెట్వర్కలు’ ఆధారంగా వస్తా యి. రాజకీయాలు ‘సామాజిక న్యాయం’ పేరిట ప్రచారం చేస్తాయి, కానీ వాస్తవంలో అధికారం, స్వార్థం ముందు అన్నీ మసకబారిపోతాయి. సీతారామరావు అంతరంగ సంఘర్షణ, నేటి ప్రతి మధ్యతరగతి వ్యక్తి అనుభవిస్తున్న సంఘర్షణే.
స్వేచ్ఛ-ఒంటరితనం గోపీచంద్ రచనల్లో మరో ముఖ్యమైన అంశం స్వేచ్ఛ. ఆయన పాత్రలు సమాజపు కట్టుబాట్ల నుం చి బయటపడాలనుకుంటాయి. కానీ ఆ స్వేచ్ఛ వారిని ఆనందానికి కాకుండా, ఒంటరితనానికి నెడుతుంది. సీతారామరావు సమాజం నిర్దేశించిన పాత్రలకు తలొగ్గకుండా స్వేచ్ఛ కోరుకున్నప్పుడు, చివరికి ఒంటరితనం, నిస్సహాయత మాత్రమే మిగులుతుంది.

నేటి కాలంలో కూడా ఇదే జరుగుతోంది. సోషల్ మీడియాలో ‘స్వతంత్ర అభిప్రాయం’ వ్యక్తం చేసే వారు విమర్శలకు గురవుతున్నారు. ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. వృత్తి జీవితంలో ‘తనదైన మార్గం’ఎంచుకున్నవారు ఒంటరితనానికి లోనవుతున్నా రు. గోపీచంద్ చూపిన ఆ మానసిక స్థితి నేటి ఆధునిక సమాజంలో కూడా అదే తీవ్రతతో ప్రతిధ్వనిస్తోంది.
గోపీచంద్ చెప్పిన తాత్విక సత్యం ఇదే. నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం బంధనాల నుండి తప్పించుకోవడం కాదు. తనను తాను అర్థం చేసుకోవడం, తన పరిమితులను అంగీకరించడం. ఈ అవగాహ న లేకపోతే స్వేచ్ఛ మనకు సంతోషం ఇవ్వదు, మరింత నిస్సహాయతను మాత్రమే ఇస్తుంది.
సమాజపు అద్దం

పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామాలో శాస్త్రిగారు జీవితాంతం నిస్వార్థంగా బ్రతికినట్లు భావించినా, చివరికి తనలోని సూక్ష్మ స్వార్థం, అహం బయటపడుతుంది. గోపీచంద్ అద్భుతంగా ఆ సంఘర్షణను చూపించారు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు.. సమాజం మొత్తానికి ఒక అద్దం. మనం పారదర్శకత, న్యాయం, సమానత్వం వంటి గొప్ప విలువల గురించి మాట్లాడుతున్నప్పటికీ, వాస్తవ జీవితంలో స్వార్థం, అన్యాయం అన్నవే ముందుకు వస్తాయి.
ఈ విరోధభావం ఈ రోజూ కొనసాగుతోంది. అవినీతి వ్యతిరేక నినాదాలు ఇచ్చే నేతలే చివరికి అవినీతిలో చిక్కుకుంటున్నారు. ప్రజాస్వామ్య విలువలు బోధించే సంస్థలే పారదర్శకతను ఉల్లంఘిస్తున్నాయి. గోపీచంద్ చూపిన ద్వంద్వ స్వభావం ఇప్పటికీ మన సమాజపు దినచర్యలో కనిపిస్తుంది.

గోపీచంద్ సాహిత్యం మనకు సమాధానాలు ఇవ్వ దు. ఆయన మన ముందు ప్రశ్నలను మాత్రమే ఉంచుతారు. అదే ఆయన శాశ్వత విలువ. ఆయన కాలంలో వలెనే ఈ రోజూ కూడా మనం కొత్త ప్రశ్నలతో, కొత్త సంఘర్షణలతో జీవిస్తున్నాం. గోపీచంద్ పాత్రలు మనల్ని గుర్తు చేస్తాయి. మనిషి కేవలం మంచివాడు లేదా చెడ్డవాడు కాదు. అతనిలో వెలుగూ, చీకటి రెండూ ఉంటాయి. ఈ అవగాహన నేటి సమాజానికి అత్యంత అవసరం. ఎందుకంటే మనం తరచూ మనల్ని ‘ధర్మపరులు’గా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మనలోని బలహీనతలు, స్వార్థం బయటపడుతూ నే ఉన్నాయి. గోపీచంద్ చూపిన అద్దం మనకి ఇప్పటికీ అసౌకర్యాన్ని కలిగిస్తోంది. గోపీచంద్ సాహిత్యం కేవలం చరిత్రలోని ఒక అ ధ్యాయం కాదు. అది మన సమకాలీకమే! ఆయన కథానాయకులు, ఆయన ప్రశ్నలు ఇంకా మనలో నే తిరుగుతున్నాయి. మన సమాజం నిజంగా ముందుకు సాగాలంటే, గోపీచంద్ చూపిన ఆత్మ పరిశీలన అవసరం. ఆయన చూపిన సత్యం అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అదే మన భవిష్యత్తుకు మార్గదర్శనం.

Also Read : భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ హైలైట్స్ చూడాల్సిందే..

  • విర్గో

Tags

Next Story