రాజాపేట గురుకులాల్లో టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థుల మూకదాడి

గురుకుల పాఠశాలలో ర్యాగింగ్

జూనియర్ విద్యార్థిపై 20 మంది సీనియర్ల సామూహిక దాడి.

ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్

భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఘటన మంగళవారం వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థి విద్యాలయానికి వైస్ కెప్టెన్ గా కొనసాగడం జీర్ణించుకోలేని ఇంటర్ విద్యార్థులు, పదవ తరగతి విద్యార్థి ముస్తాల కౌశిక్ వర్ధన్ పై 20 మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి గాయపరచి అడ్డు వచ్చిన మరో అయిదుగురిని కూడా కర్రలతో బ్యాట్లతో గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది ఈ సమస్యను బయటకు పొక్కకుండా దాచిపెట్టేఅందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన ముస్తాల లావణ్య సుదర్శన్ ల ఏకైక కుమారుడు ముస్తాల కౌశిక్ వర్ధన్ ఐదవ తరగతి నుండి రాజపేట గురుకుల పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పదవ తరగతి "ఏ" సెక్షన్ లో విద్యార్థిగా ఉన్నాడు. గత నెల నవంబర్ 29న శనివారం రాత్రి 11:30 సమయంలో ఇంటర్ విద్యార్థులు సుమారు 20 మంది కౌశిక్ వర్ధన్ నిద్రిస్తున్న 20 నెంబర్ గదిలోకి వెళ్లి బ్యాట్లు కర్రలతో దాడి చేస్తూ దూషించినట్లు చెప్పాడు. ఈ సంఘటనను సెల్ఫోన్లో కౌశిక్ వర్ధన్ స్నేహితుడు చిత్రీకరిస్తుండగా, గదిలోని లైట్లను ఆర్పి వేసి కౌశిక్ వర్ధన్ ను చితకబాదారు.

కౌశిక్ వర్ధన్ ను కొట్టొద్దని తోటి పదవ తరగతి విద్యార్థులు చందు రాహుల్ అభివర్ధన్ అరుణ్ ఈశ్వర్ లను కూడా ఇంటర్ విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో నాగార్జునసాగర్ కు చెందిన చందు రామన్నపేటకు చెందిన రాహుల్ లు తీవ్రంగా గాయపడడంతో భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను గురుకులంలోని ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చారు. సోషల్ మీడియాలో విద్యార్థి పై దాడి చేసిన వీడియోలను చూసిన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు బంధువులు మంగళవారం హుటాహుటిన రాజపేట గురుకుల పాఠశాలకు రావడంతో విషయం బయటపడింది. ప్రిన్సిపల్ సుధాకర్ ఉపాధ్యాయ సిబ్బందిని గాయాల పాలైన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు లావణ్య సుదర్శన్ బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయంలో సుమారు రెండు గంటలకు పైగా తమ అక్కసు వెలగక్కుతూ తన ఏకైక కుమారుని చంపే ప్రయత్నం చేశారని రోధిస్తూ విలపించింది. వీపు ఛాతిపై ఉన్న గాయాలను చూపుతూ పరిస్థితికి కారణమైన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అంటూ కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. సంఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నప్పటికీ గోప్యంగా ఉంచడం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో గత కొంత కాలం నుండి విద్యార్థులు గుట్కాలు మద్యానికి సిగరెట్లకు బానిసలు అయ్యారని మరిన్ని చెడాలవాట్లు ఉన్నాయని కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుని టి.సి ఇవ్వాలని పట్టు పట్టారు. వైస్ కెప్టెన్ గా చక్కటి బాధ్యతలు నిర్వర్తించడంతో సీనియర్లకు మింగుడు పడడం లేదని అందుకే తనను టార్గెట్ చేశారని కౌశిక్ వర్ధన్ చెప్పారు. 20 మందిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ వర్ధన్ తరఫున కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం, పట్టింపు లేని తనం ఉపాధ్యాయుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. ప్రాణాలు తీసినా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ బాధ్యత వహించే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తమకు న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కౌశిక్ వర్ధన్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.

ఈ విషయంపై ప్రిన్సిపల్ సుధాకర్ వివరణ ఇస్తూ గత నెల 29వ తేదీన రాత్రి జరిగిన సంఘటనపై రెండు రోజులుగా ప్రత్యేక సమావేశాలు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పూర్వాపరాలు తెలుసుకొని బాధ్యులైన ఏడుగురు ఇంటర్ పదవ తరగతి విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు, నెల నాలుగవ తేదీన పేరెంట్స్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పాఠశాలలో అనుమతి లేకుండా సెల్ ఫోన్లు ఉండడం, విద్యార్థులు విచ్చలవిడిగా బయట తిరగడం, క్రమశిక్షణ లోపించడం నిబంధనలకు విరుద్ధమైన అనేక పరిస్థితులు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న పరిస్థితిపై తీవ్రమైన చర్చ విమర్శ జరుగుతుంది. గ్యాంగ్ రౌడీల తరహాలో అర్థరాత్రి దాడులు బ్యాట్లు కర్రలు వాడడం లాంటి అనేక చర్యలు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొనడం పట్ల అనేక విషయాలు దాచిపెడుతున్నట్లు స్పష్టమవుతుంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి. ప్రక్షాళన చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.


Tags

Next Story