ముచ్చటగా మూడోసారి.. ఆసియాకప్‌లో అనూహ్య పరిణామం

ముచ్చటగా మూడోసారి..  ఆసియాకప్‌లో అనూహ్య పరిణామం
X
యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దాయాది జట్లు ఒకే టోర్నమెంట్‌లో ఏకంగా మూడు సార్లు తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసియాకప్ లీగ్ దశలో ఓసారి, సూపర్4లో మరోసారి టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. తాజాగా ఫైనల్లోనూ రెండు జట్ల మధ్య పోరు జరుగనుంది. ప్రపంచ క్రికెట్‌లోనే భారత్, పాకిస్థాన్ జట్లు చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్నాయి. సిరీస్ ఏదైనా, ఏ టోర్నమెంట్ అయినా, ఫార్మాట్ ఏదైనా రెండు జట్లు తలపడ్డాయంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండోపాక్ మ్యాచ్‌లపై కాస్త ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే అయినా రెండు మ్యాచుల్లోనూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం మళ్లీ అభిమానులను టోర్నీపై దృష్టి సారించేలా చేసిందని చెప్పాలి.

ఆసియాకప్ ఫైనల్లో రెండు జట్లు ఫైనల్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఏదో ఒక జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పాకిస్థాన్ టైటిల్ పోరుకు దూసుకొచ్చింది. ఫైనల్‌కు చేరే క్రమంలో భారత్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో ఫైనల్లోనూ పాక్‌ను ఓడించి టీమిండియా ట్రోఫీని సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఒక సారి తలపడడమే అరుదైన అంశంగా భావిస్తే ఆసియా కప్ టోర్నీలో ఏకంగా మూడు సార్లు ఎదురుపడడం నిజంగా అనూహ్య పరిణామంగా చెప్పాలి.

Tags

Next Story