లంకతో రసవత్తర పోరు.. సూపర్ ఓవర్ లో భారత్ విజయం

దుబాయి: ఆసియా కప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన సూపర్4 మ్యాచ్ టీమిండియా సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక అదే రేంజ్ లో జవాబునిచ్చింది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (107) శతకంతో చెలరేగగా.. కుశాల్ పెరీరా (58) అర్ధ సెంచరీతో రాణించడంతో లంక కూడా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 202 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం 3 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన తొలి బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది. దీంతో నిసాంకా సెంచరీ వృథా అయ్యింది. ఇక, ఆదివారం ఫైనల్ పోరులో దాయాది పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది.
అభిషేక్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ (4) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే మరో ఎండ్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ తన భీకర ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహకారంతో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అభిషేక్ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. మరోవైపు సూర్యకుమార్ ఒక ఫోర్‌తో 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కొద్ది సేపటికే అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 61 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్కోరును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తిలక్ వర్మ, సంజు శాంసన్‌లు తమపై వేసుకున్నారు. ఇద్దరు లంక బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. వీరిని ఔట్ చేసేందుకు లంక బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ధాటిగా ఆడిన సంజు శాంసన్ 23 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 39 పరుగులు చేశాడు. సమన్వయంతో ఆడిన తిలక్ వర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 49 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 15 బంతుల్లో ఓ ఫోర్, మరో సిక్స్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 202 పరుగులకు చేరింది.
-
Home
-
Menu