కల చెదిరిన టీమిండియా

Team India defeat in World Cup
X

Team India defeat in World Cup

మన తెలంగాణ/ క్రీడా విభాగం: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలువడం ఖాయమని కోట్లాది మంది భారతీయులు ఊహల్లో తేలిపోయారు. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి సత్తా చాటింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లోనూ అలవోక విజయం సాధించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా తదితరులు బ్యాటింగ్‌లో అసాధారణ రీతిలో రాణించారు. ముఖ్యంగ ఓపెనర్లు గిల్, రోహిత్‌లు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ శుభారంభం అందించారు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో ఒకటి రెండు మ్యాచుల్లో తప్పిస్తే టీమిండియాకు ప్రతిసారి శుభారంభమే లభించింది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస శతకాలు, హాఫ్ సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టించాడు.

భారత్ సాధించిన విజయాల్లో కోహ్లి చాలా కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఆరంభంలో తడబడినా తర్వాత అనూహ్యంగా ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారించాడు. వికెట్ కీపర్ రాహుల్ కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. జడేజా, సూర్యకుమార్‌లు కూడా బాగానే ఆడారు. దీంతో ఫైనల్‌కు చేరే క్రమంలో ఆడిని పది మ్యాచుల్లోనూ భారత్ జయకేతనం ఎగుర వేసింది. భారత్ విజయాల్లో బౌలర్లు పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. మహ్మద్ షమి అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. సెమీస్ వరకు 23 వికెట్లు పడగొట్టి జట్టుకు అండగా నిలిచాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలు కూడా మెరుగైన బౌలింగ్‌తో తమవంతు పాత్ర పోషించారు.

ఫైనల్లో తేలిపోయారు..

లీగ్ దశలో, సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అలరించిన భారత ఆటగాళ్లు కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోర వైఫల్యం చవిచూశారు. బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తుది సమరంలో ఏ దశలోనూ భారత్ తన స్థాయికి ఆటను కనబరచలేదనే చెప్పాలి. రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్‌లు విఫలమయ్యారు. రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా భారీ స్కోరును సాధించలేక పోయాడు. ఇక గిల్, శ్రేయస్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. కోహ్లి, రాహుల్‌లు ఆడినా వారి బ్యాటింగ్ చాలా నెమ్మదిగా సాగింది.

ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు ధాటిగా ఆడలేక పోయారు. దీంతో జట్టు స్కోరు 240 పరుగులకే పరిమితమైంది. ఇక బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న షమి ఫైనల్లో మాత్రం ఆ దూకుడును కనబరచలేక పోయాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్, బుమ్రా, జడేజా, కుల్దీప్‌లు కూడా విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్ కూడా చాలా పేలవంగా ఉంది. జట్టు ఓటమికి ఇది కూడా ప్రధాన కారణంగా చెప్పాలి. భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో పూర్తిగా నిరాశ పరిచారు. ఇలా మూడు విభాగాల్లో సమష్టి వైఫల్యం చవిచూడడంతో టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది.

Tags

Next Story