బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం
X

సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి వెండి కిరీటం, హుండీ అపహరణ

నిర్మల్ జిల్లా బాసరలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించారు.

సమాచారం ప్రకారం, చోరీకి ముందు ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి దుండగులు తమ ఆనవాళ్లు కనిపించకుండా ప్రయత్నించారు. అర్థరాత్రి సమయంలో వ్యాస మహర్షి ఆలయం వెనుక వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఉదయం సుప్రభాత సేవలు నిర్వహించేందుకు వచ్చిన ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ గర్భగుడి తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించి ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా వెండి కిరీటం, హుండీ కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.

అర్థరాత్రి సమయంలో ఆరుగురు హోంగార్డులు విధుల్లో ఉన్నప్పటికీ, భారీ భద్రతా వ్యవస్థను దాటుకుని దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారన్నది ప్రస్తుతం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. చోరీ అనంతరం దుండగులు వేదవ్యాస గుహ మార్గం ద్వారా పరారైనట్లు సమాచారం. అపహరించిన హుండీని వేదవ్యాస గుట్టపై పడేసి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Tags

Next Story