ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?: మంత్రి బండి

ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?: మంత్రి బండి
X

కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ఫాంహౌస్ భూముల సందర్శనకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. “ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?.. అధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్లడమేంది?.. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారు?.. పాంహౌస్‌లో సర్కార్ భూములుంటే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.. ఆ విషయాన్ని వదిలేసి ఈ రాజకీయ డ్రామాలేంది?” అని మండి పడ్డారు. కెసిఆర్ కుటుంబం, బిఆర్‌ఎస్ నేతలు రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు భయపడి కాంగ్రెస్ పార్టీ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని ఉద్ఘాటించారు.

ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్‌కు ఒక ట్రై సైకిల్‌ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్లు మొదలు కాబోతున్నాయన్నారు. రూ.80 యూసీఎఫ్ నిధులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులు చేపట్టబోతున్నామన్నారు. 16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్ మెంట్ పనులను ప్రారంభించబోతున్నామన్నారు.కాంగ్రెస్ నేతల ఫాంహౌజ్ సందర్శన పెద్ద జోక్ అని అన్నారు. ప్రైవేట్ భూములను సందర్శించడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు అధికారం ఎక్కడిదన్నారు. ఫాంహౌస్‌లో ప్రభుత్వ భూములుంటే అధికారులను పంపి స్వాధీనం చేసుకోవాలని, వాటికి సంబంధించిన ఆధారాలను సిఎం బయటపెట్టాలన్నారు.

22ఏ జాబితాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత బిఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు 22ఏను తమకు అనుకూలంగా వాడుకున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఉప ఎన్నికలో పోటీ బిజెపి, బిఆర్‌ఎస్ మధ్యనే ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ను జనం అసహ్యించుకుంటున్నారన్నారు. దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యమన్నారు. వినాయుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని దానం నాగేందర్ గుర్తుంచుకొని జాగ్రత్త పడితే మంచిదన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమన్నారు.

Tags

Next Story