ముల్కనూరులో బయటపడిన 10వ శతాబ్దపు దాన శాసనం

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామ చరిత్రకు వెయ్యేళ్ల నాటి ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. 10వ శతాబ్దానికి చెందిన దాన శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిషోర్, సిద్దమల్ల రమేష్ అన్వేషణలో గుర్తించారు. ముల్కనూరులో మహిళా సహకార డెయిరీ వెనకాల కాటమయ్య అనే చిన్న రాతి గుండుపై చెక్కివున్న ఈ శాసనం కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చారిత్రక విశేషాలను చాటుతోంది. ఈ రాతిపై గణపతి, వేదిభద్రపీఠం మీద శివలింగం, పక్కన నంది, మహిషాసురమర్దిని అర్ధ శిల్పాలున్నాయి. వాటిపైన సూర్యచంద్రులు చెక్కివున్నాయి. వీటిపై భాగంలో పెద్ద అక్షరాలలో శాసనం లిఖించివుంది. కాని, ఈ బల్లపరుపును జనాల కార్యకలాపాలతో శాసన లిపి చెరిగిపోయింది.
శిల్పాలు, శాసన ఆనవాళ్లు నిలిచాయి. ఆ రాతిగుండుకు ఎదురుగా మొక్కుబడి నాగ శిలలు కూడా ఉన్నాయి. రాతిగుండు మీద శిల్పాలు ఎల్లోరా శిల్పకళా పోకడల తరువాతి కాలపు పద్ధతి శైలిలో చెక్కబడినవి. శిథిలాక్షరాల కారణంగా ఈ 10వ శతాబ్దపు తెలుగు, కన్నడ లిపి శాసన వివరాలు మితంగా తెలుస్తున్నాయి. సమధిగత పంచ మహాశబ్ద బిరుదున్న మహాసామంతుడు బిజ్జనరాజు చైత్రశుద్ద ద్వాదశినాడు ముల్కనూరులో నీర్నేలను(నీటి వసతి ఉన్న భూమిని) దానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నదని కొత్త తెలంగాణ చరిత్రబృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ వివరించారు.***
-
Home
-
Menu
