రెండేళ్ల బాలుడి వీడియో వైరల్.. గ్రాడ్యుయేషన్ వరకు చదివిస్తానన్న హోండా డీలర్!

మన తెలంగాణ – వైరల్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో.. రెండేళ్ల బాలుడికి కోట్లాది మంది అభిమానాన్ని తెచ్చిపెట్టింది. మహారాష్ట్రకు చెందిన రుద్రాన్ష్ సింగ్ ఠాకూర్ కొత్త స్కూటర్ ముందు స్టైలిష్‌గా పోజులిచ్చిన వీడియో ఏకంగా 13.7 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. చిన్నారి హావభావాలు, ధీమాగా నిలబడిన తీరు నెటిజన్లను ఆకట్టుకోవడంతో స్టైలిష్ కిడ్ గా వైరల్ అయ్యాడు. ఈ వీడియో చూసిన హోండా షోరూం యజమాని మరో అడుగు ముందుకేసి, బాలుడి చదువు బాధ్యతను డిగ్రీ వరకు తీసుకుంటానని ప్రకటించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్కూటర్ కొనడానికి వెళ్లి.. సోషల్ మీడియా స్టార్‌గా!
మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన రుద్రాన్ష్ సింగ్ ఠాకూర్ నవంబర్ 9న తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి కొత్త స్కూటర్ కొనుగోలు చేసేందుకు హోండా షోరూంకు వెళ్లాడు. కుటుంబం హోండా యాక్టివా తీసుకున్న సందర్భంగా స్కూటర్ ముందు చిన్నారిని నిలబెట్టి వీడియో చిత్రీకరించారు. తెల్లటి టీషర్ట్, జీన్స్, కళ్లకు సన్ గ్లాసెస్ ధరించిన రుద్రాన్ష్.. చేతులు జేబుల్లో పెట్టుకుని ఎంతో ధీమాగా పోజులిచ్చాడు. అతడి స్టైలిష్ లుక్, అమాయకమైన హావభావాలు వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అనూహ్యంగా వైరల్ అయింది.
13.7 కోట్ల వ్యూస్.. 68 వేలకుపైగా కామెంట్లు
చిన్నారి వీడియోకు 13.7 కోట్లకు పైగా వ్యూస్ రావడంతో పాటు 68 వేలకుపైగా కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు అతడి కాన్ఫిడెన్స్‌ను ప్రశంసిస్తూ స్టైలిష్ కిడ్ అనే పేరుతో పిలవడం ప్రారంభించారు. రెండేళ్ల చిన్నారి వీడియో ఇంత భారీ స్థాయిలో ఆదరణ పొందడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ వీడియోను చూసిన సాయి పాయింట్ హోండా షోరూం యజమాని దిలీప్ బోబాడే పాటిల్ చిన్నారి, అతడి కుటుంబాన్ని షోరూంకు ఆహ్వానించారు. వైరల్ వీడియో విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ రుద్రాన్ష్ చదువుకు అండగా నిలుస్తానని ప్రకటించారు. కేజీ-1లో ప్రవేశం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు అతడి విద్యకు అవసరమైన ఖర్చులను తాను భరిస్తానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన గుర్తింపు చిన్నారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకోవడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
చిన్నారి తల్లికి ఆనందం
ఈ విషయాన్ని కంటెంట్ క్రియేటర్ యశ్ చించోల్కర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. చిన్నారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ సహాయం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. రుద్రాన్ష్ తల్లి సైతం తన కుమారుడిపై ఇంతమంది ప్రేమాభిమానాలు చూపించడం, అతడి చదువుకు సాయం చేసేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక సాధారణ స్కూటర్ కొనుగోలు సందర్భంలో తీసిన వీడియో.. కోట్లాది మందికి చేరి, చిన్నారి విద్యకు అండగా నిలిచే అవకాశాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపు ఓ చిన్నారి భవిష్యత్తుకు తోడ్పడేలా మారడం ఈ ఘటనలో ప్రత్యేకతగా నిలుస్తోంది.
Tags
-
Home
-
Menu
