కాంగోలో ఘోర విమాన ప్రమాదం.... 14 మంది మృతి

కాంగోలో ఘోర విమాన ప్రమాదం.... 14 మంది మృతి
X

కిన్షాసా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు సహా కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనిక న్యాయస్థానం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. వీరితో పాటు మరో 12 మంది ప్రతినిధులు, విమాన సిబ్బంది మృతి చెందినట్లు సైన్యం తెలిపింది. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అనంతరం విమానం కేంజ్ ప్రాంతంలో కూలిపోయింది. విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంజ్ తెలిపారు. కాంగో తూర్పు ప్రాంతంలో ఇప్పటికే పలు తిరుగుబాటు గ్రూపులతో సైన్యం పోరాడుతోంది. ముఖ్యంగా రువాండా మద్దతు ఉందని కాంగో ఆరోపిస్తున్న ఎం23 తిరుగుబాటు గ్రూపుతో ఘర్షణలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇటీవల వరుస దాడుల్లో పలు కీలక నగరాలు తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కీలక సైనిక అధికారులతో పాటు 14 మంది మృతి చెందడం కాంగో సైన్యానికి భారీ నష్టంగా మారింది.

Tags

Next Story