మద్యం సేవించి ఇద్దరు మహిళల ఆకస్మిక మృతి..

మద్యం సేవించి ఇద్దరు మహిళల ఆకస్మిక మృతి..
X

మన తెలంగాణ/మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి శివారు భూక్య తండాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు సూర్యాపేటలో కోనుగోలు చేసుకుని తెచ్చిన మద్యం సేవించి క్షణాల్లో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. కళ్ల ముందర సందడిగా గడిపిన మహిళలు క్షణాల్లో మృత్యువాతపడటం కలకలం రేపింది.

మద్యం కల్తీనా మరేమైన విష ప్రయోగం జరిగిందా అంటూ తండా వాసులు కలవర పడుతున్నారు. తండాకు చెందిన మాలోతు శారద (40) మాలోతు నీలా (39) ఈ నెల 1న సూర్యాపేటకు కంటి అసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని 2న ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మద్యం కోనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన అనంతరం మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు గుండెపోటుగా భావించి సీపీఆర్ చేశారు.

హుటహుటిన జిల్లా కేంద్రంలోని ఏరియా అసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృత్యువాత పడినట్లు వైద్యులు ధృవీకరించారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటన జిల్లాలో చర్చనీశంయంగా మారింది. మద్యం కలుషితమైందా..లేక విష ప్రయోగం జరిగిందా అని పలువురు చర్చించుకుంటున్నారు. నీలా కుమారుడు ఇద్దరు మహిళల ఆకస్మిక మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై గుండ్రాతి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా మద్యం కల్తీలు జరుగుతున్నట్లు ఓ వైపు వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళల మృతితో మద్యం ప్రియులు కల్తీపై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మద్యంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story