సాగునీరు అందక 20 ఎకరాల వరికి నిప్పు

పంటను పండించేందుకు అప్పులు చేసి.. పెట్టుబడులు పెట్టి.. కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట కళ్లముందే ఎండిపోతుంటే ఆ రైతు గుండె తట్టుకోలేకపోయింది. నెలల తరబడి శ్రమించి పండించిన పంటకు నీరు అందకపోవడంతో చివరకు ఆ పంటనే అగ్నికి ఆహుతి చేయాల్సిన దుస్థితి ఎదురైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాతల దీనస్థితికి అద్దం పడుతోంది.రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన రైతు ఉప్పరి వెంకటేశు 20 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు సమాచారం.
పంట కోసం భారీగా పెట్టుబడులు పెట్టినా, సాగునీరు అందక పంట ఎండిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నీటి కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో తన పంటకు నిప్పంటించిన ఘటన కలచివేస్తోంది. ఆర్డీఎస్ ద్వారా సాగునీరు సక్రమంగా అందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక నుంచి నీటి విడుదల, దిగువ ప్రాంతాలకు నీటి సరఫరాపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కోరుతున్నారు.
రైతు కష్టం ఎవరికీ పట్టదా?
ఒక పంట పండించడానికి రైతు పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. పొలం దున్నడం నుంచి విత్తనం వేయడం, ఎరువులు చల్లడం, కూలీల ఖర్చులు భరించడం వరకు ప్రతి దశలోనూ డబ్బుతో పాటు శ్రమను వెచ్చిస్తాడు. తీరా పంట చేతికొచ్చే సమయంలో నీరు అందకపోతే ఆ రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ ఘటన తెలియజేస్తోంది.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అన్నదాత కంట కన్నీరు పెట్టించే పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
-
Home
-
Menu
