బొలెరో వాహనాన్ని ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

బొలెరో వాహనం టైర్ పగలడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపుకొని టైరు మార్చుకునే క్రమంలో అటుగా అతివేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి ఎన్‌హెచ్ 44పై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. కొత్తకోట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బాగేపల్లి జిల్లా బిక్‌బిల్లాపూర్ మండలం గులూరు గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి బొలెరో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 12:30 నిమిషాల సమయంలో కొత్తిమీర కట్టలను లోడ్ చేసుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. అనంతపూర్ జిల్లా గుత్తి గ్రామానికి చెందిన జగదీష్ (21) దినసరి కూలీలో భాగంగా ఆయనకు తోడుగా వచ్చాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్ముళ్లపల్లి గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే బొలెరో వాహనం టైర్ పలిగింది. దీంతో డ్రైవర్ రవి వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపుకొన్నాడు.
వీరిని చూసిన మరో బొలెరో డ్రైవర్ శివకుమార్ కూడా తన వాహనాన్ని కూడా ఆపుకొని డ్రైవర్ రవికి సహాయం చేశాడు. జగదీష్, శివకుమార్, రాజశేఖర్ ముగ్గురు కలిసి వాహన టైర్ ఇప్పే క్రమంలో అటుగా కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ అతివేగంగా బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో జగదీష్ (21) అక్కడికక్కడే మృతి చెందగా, శివరాజ్ (25), రాజశేఖర్ (26)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీసులు క్షతగ్రాతులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శివరాజ్, రాజశేఖర్‌లు మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్‌ఐ శివానంద్ గౌడ్ పరిశీలించారు. డ్రైవర్ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు.
-
Home
-
Menu
