బాచుపల్లిలో అగ్నిప్రళయం... 35 షాపులు దగ్ధం

35 shops burnt down in Bachupally
35 దుకాణాలు బుగ్గి
రోడ్డున పడ్డ వ్యాపారులు
బాచుపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బారీగా ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మంగళవారం రాత్రి సుమారు 10.40 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రమాదం జరిగింది. మార్కెట్‌లోని మూడో ఓ షాపునకు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి నిప్పు రవ్వలు పడ్డాయి. అవి పక్కనే ఉన్న ఫర్నీచర్ షాప్‌నకు అంటుకొని అలా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి.
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట సర్కిల్ ప్రగతి నగర్ కమాన్ సమీపంలోని మియాపూర్ రోడ్డులో ఉన్న ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు చెలరేగడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 35వరకు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు. మంటలు గమనించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేశారు. ఫర్నీచర్ దుకాణాల్లో కలపతోపాటు రెజీన్, పెయింట్లు వంటి త్వరగా మండుకునే వస్తువులు ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ అంతటా విస్తరించాయి. మంటల తీవ్రతకు దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. ఇది స్థానికులను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. మంటలు ఎగసిపడుతుంటే ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. మార్కెట్‌లో మొత్తం 43 నుంచి 60 వరకు షాపులు ఉండగా, దాదాపు 35 షాపులు మంటలకు ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం,మొత్తం ఆస్తి నష్టం సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న రమాదేవి అనే మహిళ మాట్లాడుతూ తమ షాపులో ఉన్న సుమారు 20 లక్షల రూపాయల విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని, తన బిడ్డలతో కలిసికట్టుబట్టలతో బయటకు రావాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. చాలా మంది వ్యాపారస్తులు తమ షాపుల నుంచి కనీసం చిన్న వస్తువును కూడా తీసుకోలేక పోయారని, తమ జీవితాలు విగత జీవులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బాచుపల్లి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూకట్‌పల్లి, జీడిమెట్ల, పటాన్ చెరు, మాదాపూర్ కేంద్రాల నుంచి సుమారు ఐదారు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. వీరికి తోడుగా జిహెచ్‌ఎంసి వాట్ ట్యాంకర్లు, హైడ్రా, డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికంగా ఉన్న కాలేజీ విద్యార్థులు,యువకులు కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులకు సహకరించారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని బాధితులు వేడుకుంటున్నారు.
Tags
-
Home
-
Menu
