కొత్త కార్మిక చట్టాలతో 77 లక్షల జాబ్‌లు

న్యూఢిల్లీ : ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక వెల్లడించింది. దేశంలో ఇప్పటికే ఉన్న కార్మిక మార్కెట్ మధ్యకాలంలో గణనీయమైన స్థాయిలో అధికారీకరణ సామర్థాన్ని పెంచుకుంటుందని నివేదిక తెలిపింది. ప్రభుత్వం ఇటీవల నాలుగో లేబర్ కోడ్ల ద్వారా కార్మిక చట్టాల్లో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టింది. నాలుగు కోడ్‌లలో ది కోడ్ ఆన్ వేజ్ 2019, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 వంటివి ఉన్నాయి. నివేదిక ప్రకారం, కొత్త లేబర్ చట్టాల వల్ల నిరుద్యోగం రేటు గరిష్ఠంగా 1.3 శాతం తగ్గి, 77 లక్షలకు పైగా ఉపాధి సృష్టించే అవకాశముంది.
15 ఏళ్లు దాటిన కార్మిక శక్తి పాల్గొనిన రేటు 60.1 శాతం, పని వయస్సు జనాభా 70.7 శాతం ఆధారంగా ఈ అంచనా వేశారు. పిఎల్‌ఎఫ్‌ఎల్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం 60.4 శాతం ఉన్న ఫార్మల్ వర్కర్ల శాతం కనిష్టంగా 15 శాతం పెరిగి 75.5 శాతానికి చేరవచ్చని నివేదిక వెల్లడించింది. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ 85 శాతం వరకు పెరిగే అవకాశముందని కూడా పేర్కొంది. దేశంలో సుమారు 44 కోట్ల అసంఘటిత కార్మికుల్లో 31 కోట్ల మంది ఈ-శ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు అయ్యారు. వీరిలో 20 శాతం మంది ఫార్మల్ రంగానికి మారితే 1 కోటి మందికి ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ అందనున్నాయి. ఈ మార్పులతో 2 నుంచి 3 ఏళ్లలో సామాజిక భద్రత కవరేజ్ 80 నుంచి -85 శాతం వరకు పెరుగుతుందని ఎస్‌బిఐ అంచనా వేసింది. సంస్కరణలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి.
Tags
-
Home
-
Menu
