యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్ నౌకాదళ బృందంలో 8 మంది ఆత్మహత్యాయత్నం

యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్ నౌకాదళ బృందంలో 8 మంది ఆత్మహత్యాయత్నం
X

ఇరాన్‌తో యుద్ధానికి మద్దతుగా రికార్డు స్థాయిలో నిరంతరంగా సముద్రంలో గడిపిన యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్ విమాన వాహక నౌక బృందంలో ఎనిమిది మంది నావికులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అమెరికా నేవీ ఉన్నతాధికారి తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక నేవీ కార్యదర్శి హంగ్ కావో.. డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్‌కు పంపిన లేఖలో వెల్లడించారు.న్యూయార్క్‌కు చెందిన సెనెటర్ గిల్లిబ్రాండ్ గత నెలలో లింకన్ నౌకలోని వేలాది మంది సిబ్బంది పరిస్థితిపై వివరాలు కోరారు. దీనికి స్పందిస్తూ హంగ్ కావో మంగళవారం రాసిన లేఖలో ఈ వివరాలను వెల్లడించారు. సిబ్బందిలో ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆహారం,

పరిశుభ్రతకు సంబంధించిన వస్తువుల కొరత వంటి అంశాలపై గతంలో వార్తలు రావడంతో లింకన్ నౌక సుదీర్ఘ ప్రయాణం చర్చనీయాంశమైంది.ఈ సమయంలో నౌకలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? అని గిల్లిబ్రాండ్ ప్రత్యేకంగా ప్రశ్నించారు. దీనికి హంగ్ కావో స్పందిస్తూ.. ఈ ప్రయాణ సమయంలో నౌకలో ఎలాంటి ఆత్మహత్యలు చోటుచేసుకోలేదని తెలిపారు. అయితే లింకన్ నౌక ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం నౌకాదళ బృందంలో ఎనిమిది ఆత్మహత్యాయత్నాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ సంఖ్యలో లింకన్ నౌక సిబ్బందితో పాటు విమాన విభాగం, నౌకాదళ బృందం, డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ సిబ్బంది, రక్షణగా ఉన్న డిస్ట్రాయర్లలోని నావికులు, నౌకలో ఉన్న అన్ని విమాన స్క్వాడ్రన్ల సిబ్బంది కూడా ఉన్నారని లేఖలో వివరించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై చర్చ..

నౌకలో పరిస్థితులకు సంబంధించిన వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కొట్టిపారేశారు. లింకన్ నౌక గత నవంబరులో శాన్ డియాగోలోని స్వదేశీ స్థావరం నుంచి బయలుదేరింది. అనంతరం ఇరాన్ సంబంధిత కార్యకలాపాలకు మద్దతుగా జనవరిలో మధ్యప్రాచ్యానికి చేరుకుంది. అక్కడ 260 రోజులకు పైగా నిరంతరంగా సముద్రంలో ఉండి రికార్డు సృష్టించింది. లింకన్ నౌక, దానికి మద్దతుగా ఉన్న కొన్ని నౌకలు సెప్టెంబరు ప్రారంభంలో కాలిఫోర్నియాకు తిరుగు ప్రయాణంలో థాయ్‌లాండ్‌లో ఆగాయి. నౌక కమాండింగ్ అధికారి కెప్టెన్ డాన్ కీలర్ అప్పుడు నౌక త్వరలో స్వదేశానికి బయలుదేరుతుందని తెలిపారు. అయితే మార్గమధ్యంలో మరిన్ని చోట్ల సరఫరాల కోసం ఆగే అవకాశం ఉందని చెప్పారు. నౌకాదళ బృందం అమెరికాకు తిరిగి చేరే ఖచ్చితమైన తేదీపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

Tags

Next Story