అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ ఆస్తులు 50 కోట్లు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇల్లు, మరో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. కిరణ్ కుమార్ సొంతూరు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంతో పాటు సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు జరిపి వివరాలు సేక రించారు. అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ కు 100 ఎకరాల వ్యవసాయ భూమి, పది విలువైన ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనా లు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15 కోట్లు అని చెబుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు : సూర్యాపేట జిల్లాలో గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ తెలిపారు. కిరణ్ కుమార్ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
ఆయనకు పార్ట్నర్ షిప్ ఉన్న నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులో కూడా అధికారులు దాడులు నిర్వహించారు. పొనుగోడు, నేరేడుచర్ల తో పాటు కల్వకుర్తిలో ఆయన పనిచేస్తున్న ఆఫీస్ తో పాటు గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోని ఆయన అత్తగారింట్లో, అనంతగిరి మండలంలోని అమీనాబాద్, అలాగే సూర్యాపేటలోని ఆయన నివాసం ఉంటున్న కిరాయి ఇంట్లో, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీలు చేస్తోన్న సమయంలో కిరణ్ కుమార్ పోనుగోడులోనే ఉన్నారు. దర్యాప్తు కోసం ఏసీబీ అధికారులు ఏడిఏ కిరణ్ కుమార్‌ను వెంట తీసుకువెళ్లారు. దర్యాప్తు పూర్తి అయ్యాక వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
-
Home
-
Menu
