పరిగి అటవీ కార్యాలయంలో ఎసిబి దాడులు

వికారాబాద్ జిల్లా, పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఎసిబి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్‌పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో సీతాఫలాల టెండర్లకు అనంతసాగర్ సమీపంలోని ఓ కాంట్రాక్టర్ రూ.15 లక్షలకు టెండర్లు వేయగా జిఎస్‌టి ఇతర ఖర్చులతో కూడిన మొత్తం రూ.18 లక్షల వరకు టెండర్లు దక్కించుకున్నాడు. సీతాఫలాలు అడవి, ఇతర ప్రాంతాల నుంచి తెంపి తరలించేందుకు ప్రతిరోజూ పర్మిట్లు అటవీ శాఖ అధికారులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రూ.50 వేలు ఇవ్వాలని పరిగి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం సెక్షన్ ఆఫీసర్లు బి.సాయికుమార్,మహమ్మద్ మోహినుద్దీన్‌తో పాటు డ్రైవర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు.
ఇందులో కాంట్రాక్టర్ పండ్లు తీసుకువెళ్లేందుకు రోజు వారి అనుమతులు పొందేందుకు రూ.50 వేలు ఇవ్వాలని సెక్షన్ అధికారులు డిమాండ్ చేశారు. అయితే, అంత డబ్బులు లేవని పండ్లు మురిగిపోతున్నాయని, అవి కుళ్లిపోతే తమకు నష్టం వస్తుందని బాధితుడు వారికి చెప్పాడు. దీంతో కనీసం రూ.40 వేలు అయినా లంచం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు డబ్బులు తీసుకుని పరిగికి వచ్చినప్పుడు డ్రైవర్ సహాయంతో తీసుకున్నారు. వెంటనే సెక్షన్ అధికారులను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెక్షన్ అధికారులతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్టు ఎసిబి డిఎస్‌పి తెలిపారు.
-
Home
-
Menu
