నిమ్స్‌లో అక్రమాల పుట్ట!

రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ అయిన నిమ్స్‌లో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రోగులకు అందాల్సిన వైద్య సేవల వెనుక అక్రమ వ్యవహారాలు చోటుచేసుకున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ థియేటర్ల వద్ద సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య పరికరాలను అనధికారికంగా నిల్వ చేయడం నుంచి.. రోగి ఒక్కరికి వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో చూపించడం వరకు పలు అసాధారణ లెక్కలు బయటపడ్డాయి. చివరకు రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించారు. నిమ్స్‌లోని పలు విభాగాల్లో జరిగిన ఈ వ్యవహారాలను ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో గుర్తించింది.
ఆపరేషన్ థియేటర్ల వద్దే రూ.5 కోట్ల ఇంప్లాంట్లు!
నిమ్స్‌లోని ఐదు ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు కీలక అంశాలను గుర్తించారు. థియేటర్ల సమీపంలోని అల్మారాలు, ఉప నిల్వ గదుల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య సామగ్రిని సరఫరాదారులు అనధికారికంగా నిల్వ చేసినట్లు వెల్లడించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అనుమతితోనే ఈ నిల్వలు కొనసాగినట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రధాన స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి సామగ్రి తీసుకోవాల్సి ఉండగా, నేరుగా సరఫరాదారుల నుంచే ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు ఏసీబీ పేర్కొంది. వినియోగం తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్ తయారు చేసి, సరఫరాదారుల బిల్లులతో కలిపి ప్రధాన స్టోర్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. వాస్తవంగా వినియోగించని ఇంప్లాంట్లకు కూడా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సృష్టించి బిల్లులు పొందే అవకాశం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది.
చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులా?
బిల్లుల విభాగంలోనూ తీవ్ర అసాధారణతలు బయటపడ్డాయి. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బిల్లులు ప్రాసెస్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ముఖ్యంగా ప్రభుత్వమే చెల్లింపులు చేసే ఆరోగ్యశ్రీ పథకం రోగుల విషయంలో ఈ తరహా లెక్కలు కనిపించినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జి అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లింగ్ నమోదైనట్లు ఏసీబీ తన ప్రకటనలో పేర్కొంది.
ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా?
శస్త్రచికిత్సలకు వినియోగించే వస్తువుల లెక్కల్లోనూ అసాధారణ వినియోగం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఒకే రోగికి ఒక వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో చూపించడం ఇందుకు ఉదాహరణగా ఏసీబీ పేర్కొంది. ఈ తరహా అవకతవకల్లో అధిక భాగం ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు సంబంధించినవేనని తెలిపింది. వినియోగించిన వైద్య సామగ్రి, వాస్తవ చికిత్స వివరాలు, బిల్లుల మధ్య సంబంధాన్ని అధికారులు పరిశీలించాల్సి ఉంది.
క్యాంటీన్లో అపరిశుభ్రత.. గడువు ముగిసిన ఆహారం
నిమ్స్ ప్రధాన క్యాంటీన్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉండటంతో పాటు, అవసరమైన ఆహార భద్రతా నమోదు కూడా లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. కార్మిక చట్టాల ఉల్లంఘనలు, క్యాంటీన్ టెండర్ ప్రక్రియలో అవకతవకలు ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. టెండర్లలో పోటీని అడ్డుకునేలా కొందరు బిడ్డర్లు కుమ్మక్కై ఉండవచ్చన్న అనుమానాలనూ ఏసీబీ ప్రస్తావించింది.
మ్యాన్‌పవర్, మెడికల్ షాపుల టెండర్లపై నిఘా
2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్ కేటగిరీకి మార్చిన విధానంలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొన్నారు. నియామకాల వ్యవహారంలో కుమ్మక్కు జరిగిన అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన అమ్మకాల రికార్డులు లేకపోవడం, నమోదుకాని సిబ్బందితో పని చేయించడం వంటి అంశాలు బయటపడ్డాయి. షాపుల కేటాయింపు టెండర్ ప్రక్రియను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది.
సెక్యూరిటీ కాంట్రాక్టుల్లోనూ జాప్యం
భద్రతా సిబ్బంది సేవలకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయడంలో అసాధారణ జాప్యం, పాత కాంట్రాక్టులను పదేపదే పొడిగించడం వంటి అంశాలను ఏసీబీ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఓ సంస్థకు సంబంధించిన రూ.28.13 లక్షల బ్యాంకు గ్యారంటీని జప్తు చేయకపోవడాన్ని కూడా తనిఖీ నివేదికలో ప్రస్తావించింది.
పత్రాలు స్వాధీనం.. తదుపరి విచారణ
అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో నిమ్స్‌లో ఏసీబీ అధికారులు, టీజీ సేఫ్ ఆహార భద్రతా విభాగం, ఔషధ నియంత్రణ శాఖ, కార్మిక శాఖ ప్రత్యేక బృందాలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుర్తించిన అంశాలపై మరింత పరిశీలన కోసం నోట్ ఫైళ్లు, ఒప్పందాల ప్రతులు, ఇతర సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరోపణలు, అనుమానాలపై తదుపరి ధ్రువీకరణ చేపట్టనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు 1064 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించింది.
-
Home
-
Menu
