డిఎస్పీ భీంరెడ్డి బినామీల ఇళ్లపై ఎసిబి అధికారుల దాడులు

డిఎస్పీ భీంరెడ్డి బినామీల ఇళ్లపై ఎసిబి అధికారుల దాడులు
X

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన డిఎస్పి సంకిరెడ్డి భీంరెడ్డి బినామీల ఇళ్లపై ఎసిబి అధికారులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్, జహీరాబాద్‌లోని డిఎస్పి భీం రెడ్డి బినామీల ఇళ్లపై ఏకకాలంలో ఎసిబి అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు, రూ.1.35కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, 14లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం రావడంతో ఎసిబి అధికారులు జూన్ 27,2026న భీంరెడ్డి ఇళ్లు, స్నేహితులు, బినామీల ఇళ్లపై దాడులు చేసి రూ.200కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు కనుగొన్నారు. తర్వాత భీంరెడ్డి వాట్సాప్, డైరీలో రాసుకున్న బినామీల చిట్టా బయటికి రావడంతో మళ్లీ దాడులు నిర్వహించారు. భీంరెడ్డి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఎసిబి అధికారులు పలుమార్లు నిర్వహించిన తనిఖీల్లో గుర్తించారు.

తాజాగా అతడి భార్య ఫోన్‌లో ఉన్న మరికొంతమంది బినామీల లిస్టు ఎసిబి అధికారులకు చేరింది. దాని ఆధారంగా ఎసిబి డిఎస్పి గంగసాని శ్రీధర్ నేతృత్వంతో ఎసిబి అధికారులు హైదరాబాద్, జహీరాబాద్‌లోని బినామీల ఇళ్లు కార్యాలయాలపై దాడులు చేశారు. పుప్పాలగూడ లోని భీంరెడ్డి బినామి బొమ్మ వెంకటేష్ ఇంటిలో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులు రూ.1.35కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, 14లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. విదేశీ మద్యం లభించడంతో లిక్కర్‌ను ఎక్సైజ్ సిబ్బందికి అప్పగించనున్నట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు. భీంరెడ్డి బెయిల్‌పై విడుదలైన తర్వాత మరోసారి ఎసిబి అధికారులు దాడులు చేయడం కలకలం సృష్టించింది.

Tags

Next Story