వాట్సప్ వెబ్‌తో అకౌంట్ హైజాక్ ముప్పు

వాట్సప్ వెబ్‌తో అకౌంట్ హైజాక్ ముప్పు
X

మన తెలంగాణ/హైదరాబాద్: న్యూఢిల్లీ: ఆఫీసు లేదా పబ్లిక్ కంప్యూటర్‌లో వాట్సప్ వెబ్ వినియోగించే వారిని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాటిలో వాట్సప్ వెబ్ లాగిన్ చేసి వదిలిస్తే సైబర్ నేరగాళ్లు అకౌంట్లను హైజాక్ చేసి, ప్రైవేట్ సంభాషణలను చదవడంతోపాటు వినియోగదారుల్లా నటిస్తూ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖకు చెందిన యాంటీ సైబర్‌క్రైమ్ విభాగం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) అడ్వైజరీని సోమవారం జారీ చేసింది.

తప్పనిసరిగా లాగ్‌అవుట్..

బ్రౌజర్ విండో లేదా ట్యాబ్‌ను మూసివేస్తే సరిపోదని, ప్రతి సెషన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగ్‌అవుట్ చేయాలని ఐ4సిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్‌సీటీఏయూ) వెల్లడించింది. వాట్సప్ వెబ్‌ను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆఫీస్ కంప్యూటర్లు, ఇతరులు ఉపయోగించే సిస్టమ్‌లు, పబ్లిక్ కంప్యూటర్లు లేదా ఇతరులకు అందుబాటులో ఉండే పరికరాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వాట్సప్ వెబ్‌లో అధికారిక లేదా సున్నితమైన పనులను చేయకుండా ఉండాలి. ప్రభుత్వ, సంస్థలకు సంబంధించిన, ఆర్థిక, గోప్యమైన లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని కంప్యూటర్లలోని వాట్సప్ వెబ్ సెషన్ల ద్వారా పంపకపోవడం మంచిది అని తెలిపింది.

అనివార్యంగా వినియోగించాల్సి వస్తే...

వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించాల్సి వస్తే ఇన్‌కాగ్నిటో, ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లను వినియోగించాలని సూచించింది. తెలియని లేదా పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించవద్దు. సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ కియోస్క్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, ఇతరుల కంప్యూటర్లు లేదా నమ్మదగని సిస్టమ్‌ల నుంచి వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ కావద్దు. అకౌంట్‌లో అసాధారణ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలి. మీ అకౌంట్ నుంచి అనూహ్యంగా సందేశాలు వెళ్లడం, కాంటాక్టుల నుంచి అసాధారణ ప్రత్యుత్తరాలు రావడం లేదా వివరణ లేని కార్యకలాపాలు కనిపిస్తే వాటిని తీవ్రంగా పరిగణించాలి అని పేర్కొంది.

ప్రామాణీకరించిన వాట్సాప్ వెబ్ సెషన్ల ద్వారా అనధికారికంగా అకౌంట్లలోకి ప్రవేశించవచ్చని హెచ్చరించింది. దీనివల్ల నేరగాళ్లు సందేశాలను చదవడం, అకౌంట్ యజమానిలా నటిస్తూ సందేశాలు పంపడం, కాంటాక్ట్ జాబితాలు, గ్రూప్ సంభాషణలను చూడడం సాధ్యమవుతుందని పేర్కొంది. వినియోగదారుడిపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలు, ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బ్రౌజర్‌లను సురక్షితంగా ఉంచాలని, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఐ4సి సూచించింది. అనుమానాస్పద డౌన్‌లోడ్‌లు, తెలియని ఫైళ్లు, క్రాక్‌డ్ సాఫ్ట్‌వేర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది.

Tags

Next Story