యాక్టింగ్‌తో అలరించి.. బిజినెస్‌తో అదరగొడుతున్న స్టార్లు!

యాక్టింగ్‌తో అలరించి.. బిజినెస్‌తో అదరగొడుతున్న స్టార్లు!
X

మల్టీప్లెక్స్‌లు, రియల్‌ ఎస్టేట్‌, మీడియా, నిర్మాణం.. స్టార్‌డమ్‌ను వ్యాపారంగా మార్చుకుంటున్న టాలీవుడ్‌ తారలు

హైదరాబాద్‌: ఒకప్పుడు హీరో సినిమా చేస్తాడు.. హిట్‌ కొడతాడు.. రెమ్యునరేషన్‌ తీసుకుంటాడు. ఇప్పుడు కథ మారింది. తెరపై సంపాదించిన స్టార్‌డమ్‌ను తెర వెనుక వ్యాపారంగా మార్చుకుంటున్నారు టాలీవుడ్‌ తారలు. తమ పేరుకు ఉన్న బ్రాండ్‌ విలువను పెట్టుబడిగా మార్చుకుంటూ సినిమా నిర్మాణం నుంచి మల్టీప్లెక్స్‌లు, రియల్‌ ఎస్టేట్‌, మీడియా, టెక్నాలజీ వరకు విస్తరిస్తున్నారు.

మహేశ్‌బాబు.. గచ్చిబౌలిలో ‘ఏఎంబీ’

మహేశ్‌బాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యాపార బ్రాండ్లలో ఏఎంబీ సినిమాస్‌ ఒకటి. ఏషియన్‌ సినిమాస్‌తో భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్‌ కొండాపూర్‌లోని సారథ్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో ఉంది. గచ్చిబౌలి–మియాపూర్‌ కారిడార్‌లో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో ప్రముఖ సినిమా గమ్యస్థానంగా నిలిచింది.

అల్లు కుటుంబం.. కోకాపేటలో భారీ అడుగు

మల్టీప్లెక్స్‌ వ్యాపారంలో అల్లు కుటుంబం మరో అడుగు ముందుకేసింది. గండిపేట–కోకాపేట ప్రాంతంలోని అల్లు స్టూడియోస్‌ ప్రాంగణంలో ‘అల్లు సినిమాస్‌’ను ఏర్పాటు చేసింది. ఏకంగా ఏడు ఎకరాల ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌లో నాలుగు స్క్రీన్లతో నిర్మించిన ఈ థియేటర్‌లో భారీ డాల్బీ స్క్రీన్‌ ప్రధాన ఆకర్షణ.

ఇది అమీర్‌పేటలోని ఏఏఏ సినిమాస్‌కు అదనంగా అల్లు కుటుంబం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మరో కీలక సినిమా కేంద్రం. అంటే ఒక వైపు అమీర్‌పేటలో ఏఏఏ.. మరో వైపు కోకాపేటలో అల్లు సినిమాస్‌—వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో అల్లు కుటుంబం సినిమా వ్యాపారానికి ప్రత్యేక స్థానం ఏర్పడుతోంది.

అల్లు అర్జున్‌.. అమీర్‌పేటలో ‘ఏఏఏ’

అల్లు అర్జున్‌ ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఏఏఏ సినిమాస్‌ను అమీర్‌పేటలో ఏర్పాటు చేశారు. సత్యం థియేటర్‌ ప్రాంతంలో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ నగరంలోని ప్రముఖ ప్రీమియం సినిమా కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది.

విజయ్‌ దేవరకొండ.. మహబూబ్‌నగర్‌లో ‘ఏవీడీ’

విజయ్‌ దేవరకొండ ఏవీడీ సినిమాస్‌ ద్వారా మల్టీప్లెక్స్‌ రంగంలోకి అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌ ద్వారా హైదరాబాద్‌ దాటి తన స్టార్‌ బ్రాండ్‌ను విస్తరించారు.

రవితేజ.. వనస్థలిపురంలో ‘ఏఆర్‌టీ’

రవితేజ కూడా ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఏఆర్‌టీ సినిమాస్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం తత్త్వ మాల్‌లో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌లో పలు స్క్రీన్లు ఉన్నాయి.

రానా.. హీరో మాత్రమే కాదు!

రానా దగ్గుబాటి మాత్రం థియేటర్లకే పరిమితం కాలేదు. సినిమా నిర్మాణం, కంటెంట్‌, మీడియా, టెక్నాలజీ, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాల్లో వ్యాపార ఆసక్తులు చూపుతున్నారు. దగ్గుబాటి కుటుంబం ఇప్పటికే నిర్మాణం, స్టూడియో, సినిమా ప్రదర్శన రంగాల్లో బలమైన స్థావరాన్ని ఏర్పరచుకుంది.

మురళీమోహన్‌.. సినిమాల నుంచి రియల్‌ ఎస్టేట్‌ దాకా

కొత్త తరం హీరోలు మల్టీప్లెక్స్‌ల వైపు వెళ్తుంటే.. పాత తరం నటుల్లో మురళీమోహన్‌ రియల్‌ ఎస్టేట్‌లో తనదైన ముద్ర వేశారు. జయభేరి గ్రూప్‌ ద్వారా గృహ నిర్మాణం, స్థిరాస్తి వ్యాపారంలో కొనసాగుతున్నారు.

నాగార్జున.. స్టూడియో నుంచి హాస్పిటాలిటీ వరకు

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌ హైదరాబాద్‌ సినిమా పరిశ్రమలో కీలక సంస్థగా కొనసాగుతోంది. స్టూడియో, నిర్మాణం, మీడియా, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో కుటుంబ వ్యాపార ప్రయాణం విస్తరించింది.

నాని.. హీరో నుంచి నిర్మాతగా

నాని వాల్‌ పోస్టర్‌ సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. నటుడిగా వచ్చిన స్టార్‌ ఇమేజ్‌ను కంటెంట్‌ నిర్మాణంలోకి తీసుకెళ్లిన ఉదాహరణగా ఇది నిలుస్తోంది.

సినిమా హిట్‌.. బిజినెస్‌ కూడా హిట్‌ కావాలనే లెక్క!

టాలీవుడ్‌లో జరుగుతున్న ఈ మార్పు వెనుక లెక్క సింపుల్‌. సినిమాతో వచ్చిన పేరు ఒక్క సినిమాకే పరిమితం కాకూడదు.. అదే బ్రాండ్‌ పదేళ్లు, ఇరవై ఏళ్లు వ్యాపారాన్ని నడపాలి. ఒకరు కొండాపూర్‌లో మల్టీప్లెక్స్‌ పెడుతున్నారు.. మరొకరు అమీర్‌పేటలో థియేటర్‌ నడుపుతున్నారు.. ఇంకొకరు మహబూబ్‌నగర్‌లో సినిమా బిజినెస్‌ చేస్తున్నారు.. మరొకరు వనస్థలిపురంలో స్క్రీన్లు పెంచుతున్నారు. అల్లు కుటుంబం మాత్రం గండిపేట–కోకాపేటలోని అల్లు స్టూడియోస్‌ ప్రాంగణంలో అల్లు సినిమాస్‌తో మరో పెద్ద అడుగు వేసింది.

వెండితెరపై స్టార్‌డమ్‌.. ఇప్పుడు బిజినెస్‌ స్క్రీన్‌పై కూడా కనిపిస్తోంది!

Tags

Next Story