ఎఐతో కొందరు కోటీశ్వర్లు.... మరికొందరు బిచ్చగాళ్లు

AI brings millions
X

AI brings millions

ఎఐ బూమ్‌.. కొందరికి కోట్లు, మరికొందరికి పాట్లు

ఐపీవోలతో శాన్‌ఫ్రాన్సిస్కోలో కొత్త సంపద వెల్లువ.. అదే సమయంలో వేలాది టెక్‌ ఉద్యోగాలు గల్లంతు

మన తెలంగాణ / ప్రత్యేక కథనం: ఒకవైపు ఎఐ కంపెనీల ఉద్యోగులకు కోట్లాది డాలర్ల సంపద పోగు అవుతోంది. మరోవైపు అదే టెక్‌ రంగంలోని వేలాది మందికి ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బూమ్‌ సృష్టిస్తున్న ఈ విరుద్ధ పరిస్థితి ఇప్పుడు అమెరికా టెక్‌ రంగంలో కొత్త ఆర్థిక అసమానతకు అద్దం పడుతోంది. ఎఐ దిగ్గజాలు ఆంథ్రపిక్‌, ఓపెన్‌ఏఐ పబ్లిక్‌ మార్కెట్‌లోకి వచ్చే ప్రక్రియను ప్రారంభించాయి. రెండు సంస్థలూ అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు గోప్యంగా ఎస్-1 దరఖాస్తులు సమర్పించాయి. అయితే ఇప్పటివరకు ఐపీవో తేదీ, షేర్ల సంఖ్య, ధర ఖరారు కాలేదు.

ఉద్యోగులకు భారీ సంపద

ఈ ఐపివొలు జరిగితే ఆ సంస్థల ప్రస్తుత, మాజీ ఉద్యోగుల వద్ద ఉన్న షేర్ల విలువ భారీగా పెరిగే అవకాశం ఉంది. రెడ్‌ఫిన్‌ అంచనా ప్రకారం.. రెండు కంపెనీల ఉద్యోగులు తమ ఐపిఒ సంపదను ఉపయోగిస్తే శాన్‌ఫ్రాన్సిస్కో మెట్రో ప్రాంతంలోని మొత్తం ఇళ్ల విలువలో దాదాపు 29 శాతానికి సమానమైన కొనుగోలు శక్తి వారికి ఏర్పడవచ్చు. ఓపెన్‌ఏఐ ఉద్యోగుల వాటా సుమారు 20 శాతం, ఆంథ్రపిక్‌ ఉద్యోగుల వాటా దాదాపు 9 శాతంగా అంచనా వేశారు. ఇప్పటికే ఏఐ ఉద్యోగుల సంపద ప్రభావం నగర రియల్‌ ఎస్టేట్‌పై కనిపిస్తోంది. అధిక వేతనాలు పొందుతున్న ఏఐ నిపుణులు లగ్జరీ ఇళ్ళు కొనుగోలు చేస్తున్నారు.

పాత టెక్‌ ఉద్యోగులకు కొత్త కష్టం

ఇదే సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో పాత తరహా టెక్‌ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. గత 12 నెలల్లో బే ఏరియాలో టెక్‌ కంపెనీలు 14,500 మందికి పైగా ఉద్యోగాల తొలగింపులకు నోటీసులు ఇచ్చాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపుగా ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఉన్న డిమాండ్‌ 2022తో పోలిస్తే 42 శాతం తగ్గగా, ఏఐకి సంబంధించిన ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగాలు 37 శాతం పెరిగాయి. బే ఏరియాలో గత ఏడాది 20 వేలకు పైగా ఏఐ ఉద్యోగాలు పెరిగినా కూడా మొత్తం టెక్‌ ఉద్యోగుల సంఖ్య 2022తో పోలిస్తే 6 శాతం తగ్గిందని సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది.

కొత్త వారికి మరింత కష్టం

ఏఐ ప్రభావం ముఖ్యంగా యువ ఉద్యోగులపై కనిపిస్తోంది. కాలిఫోర్నియాలో 22–25 ఏళ్ల వయసు ఉద్యోగులలో ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే వృత్తుల్లో ఉపాధి, చాట్‌జీపీటీ ప్రారంభమైన తర్వాత 16.8 శాతం తగ్గింది. ఇతర ఉద్యోగాల్లో ఈ తగ్గుదల 4.6 శాతంగా ఉంది. ఎఐతో ఉద్యోగాలపై ప్రభావం ఉండొచ్చని ఆంథ్రపిక్‌ గుర్తిస్తోంది. సంస్థ 2026లో ఏర్పాటు చేసిన 200 మిలియన్‌ డాలర్ల ఎకానమిక్ ఫ్యూచర్ రిసెర్ట్ ఫండ్ లక్ష్యాల్లో ఏఐ కారణంగా ఉద్యోగ మార్పులను ఎదుర్కొనే వారికి సహాయం చేయడం, ఆదాయ భద్రతపై పరిశోధన చేయడం, ఉద్యోగులకు ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధిలో వాటా కల్పించే మార్గాలను అధ్యయనం చేస్తున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో కథ ఒక పెద్ద మార్పుకు సంకేతం కానుంది.

Next Story