అడవిలో ఆధ్యాత్మికం అంబు రామేశ్వరం

Ambu Rameshwaram Temple
X

Ambu Rameshwaram Temple

నేడు హాజరుకానున్న అశేషభక్తజనం, అతిరథులు

ఐదు ఆకుల పుంటికూర సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధి

మన తెలంగాణ/పెద్దేముల్: తట్టేపల్లి దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ అంబురామేశ్వర ఆలయం సాక్షాత్తు శ్రీరాముడి పాదస్పర్శతో పునీతమైన నేలగా విరాజిల్లుతుంది. పురాణ ప్రాశస్తానికి ప్రతీకగా నిలిచే దేవాలయాల్లో అంబురామేశ్వర ఆలయం ప్రాచీనమైన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. అడవిలోని ఆలయ పరిసరాల్లో త్రేతాయుగం నాటి కాలంలో శ్రీరాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించారని భక్తులు విశ్వసిస్తారు. తట్టేపల్లి నేలపై శ్రీరాముడు నడియాడిన ప్రాంతంగా పేర్కొంటారు. అటవీ ప్రాంతంలో వెలసిన అంబురామేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే.. బంగారు లింగమయ్యగా పేరొందారు. తట్టేపల్లి ప్రాంతంలో శ్రీ రాముడు సీతాదేవి కోసం నడియాడిన నేలగా ప్రసిద్ధి చెందింది. అలాంటి అత్యంత ప్రశస్తిగల శ్రీ అంబురామేశ్వరుడిని జాతర ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నేడు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, ప్రజాప్రతిధులు, అధికార యాంత్రాంగం పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. ప్రకృతి ఒడిలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం అంబురామేశ్వరుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

త్రేతాయుగం నాటి ఆలయంగా ప్రసిద్ధి

మండలంలోని తట్టేపల్లి - పాషాపూర్ గ్రామాల మద్యగల విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ అంబురామేశ్వర ఆలయం వెలసిందని పూర్వీకులు చెబుతున్నారు. త్రేతాయుగంలో శ్రీ రాముడు అడవీ మార్గంగుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో చీకటి పడటంతో శ్రీరాముడు అటవీ ప్రాంతంలో సేద తీరేందుకు నిశ్చయించుకుని అక్కడే ఉన్నాడు. అయితే, శ్రీ రాముడికి దాహం వేయడంలో అటవీ ప్రాంతంలో తన బాణం(అంబు)తో కొట్టి.. గంగను పైకి తెచ్చి దాహన్ని తీర్చుకున్నాడని భక్తులు చెప్తుంటారు. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో ఒక శివలింగాన్ని సైతం ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్లనే “అంబు” రామేశ్వరుని ఆలయంగా పేరొచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే, ఆలయ పరిసరాల్లోని నందినుంచి నిరంతరం జాలువారే జలపాతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదే ప్రాంతంలో దొరికే ఐదు ఆకుల పుండికూర(గోంగూర) ప్రత్యేకతగా చెప్పవచ్చు. భక్తులు పుండికూరను జాతర రోజుతో పాటుగా మరుసటి రోజు సైతం ఆహారంగా తీసుకుంటారు. ఈ ఐదాకుల పుండికూరలో సర్వరోగ నివారణ గుణాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. దీంతో ఎంతోమంది భక్తులు పుండికూరను తీసుకెళ్తారు. కేవలం అలయ పరిసరాల్లో మాత్రమే ‘ఐదు ఆకుల పుండికూర’ దొరకడం విశేషంగా చెప్పవచ్చు.

స్వామివారి జాతర ఉత్సవాల విశేషాలు

ప్రతియేటా శావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ అంబురామేశ్వర స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదివారం సాయంత్రం 4గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు జంగం సర్వేశం స్వామి నివాసం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీసేవలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్ళారు. నేడు(సోమవారం) ఉదయం తెల్లవారుజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, తిరునాళ్ళ వేడుకలు, రుద్రాభిషేకంతో పాటుగా ఆలయంలో కొలువైన అంబురామేశ్వరుడికి ధూపదీప నైవేధ్యాలతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భక్తుల సౌకర్యార్ధం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జరుగనున్న జాతరకు జిల్లాలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, వికారాబాద్, జహీరాబాద్, కర్నాటలోని షాదీపూర్, కుంచారం, చించోళి, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి అశేష భక్త జనం రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుకు తలేత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ నిర్వహకులు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేశారు.

జాతరకు పోలీసుల పటిష్టమైన ఏర్పాట్లు

శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ యం.ప్రశాంత్ వర్ధన్ ఆలయ కమిటీ ప్రనిధులు, గ్రామ పెద్దలతో కలిసి చర్చించి జాతర ఏర్పాట్లను పూర్తిచేశారు. జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శన నిమిత్తం క్యూలైన్, వీఐపీ రోడ్డుమ్యాప్, పార్కింగ్ స్థలం, దుకాణాల సముదాయ ఏర్పాటుపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. జాతరలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ఉత్సవాలపై ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ ఇప్పటికే పోలీస్ స్టేషన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటుగా అధికారులు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. నేడు ఉత్సవాలు కనుల పండువగా జరుగనున్నాయి.

Tags

Next Story