విద్యార్థినిపై అటెండర్ లైంగిక దాడి

విద్యార్థినిపై అటెండర్ లైంగిక దాడి
X

రేగోడ్ మండలంలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి జూన్ 2019లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడు సారా జైపాల్ (25) పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ అక్కడ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణ అనంతరం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

ఈ కేసు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ చట్టం 2012 కింద విచారణ జరిగింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య కేసును సమర్థవంతంగా వాదించి నిందితుడికి శిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు. భరోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కె. శ్వేత బాధితురాలికి, సాక్షులకు న్యాయ సహాయం అందించారు. రేగోడ్ ఎస్‌ఐ ఎం. కాశినాథ్ కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కె. రవీందర్ రెడ్డి, ఎం. జార్జ్ దర్యాప్తు నిర్వహించారు. కోర్టు విచారణలో కోర్ట్ లైసోనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, పీసీ జి. కృష్ణ, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎ. వినోద్ సహకారం అందించారు. పిల్లలపై లైంగిక దాడి అత్యంత ఘోర నేరమని, ముఖ్యంగా పాఠశాలల వంటి సురక్షిత ప్రదేశాల్లో పిల్లలపై నేరాలకు పాల్పడే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags

Next Story